ఆరు నూరవుతుంది.

By | September 11, 2012 Leave a Comment

వన్ ఫైన్ మార్నింగ్..
మినీ ట్యాంక్ బండ్, సరూర్‌నగర్.
‘‘ఏంటంకుల్ అంతలా ఆలోచిస్తున్నారు? మీ ఇంటి పై కప్పులు ఏ రేకుల్తో వేద్దామా అనా?’’ బెంచీ మీద కూర్చున్న ఒకాయణ్ణి అడిగాడు ఒక కుర్రాడు.
‘‘ఓహ్.. నువ్వా శ్రవణ్? అదీ.. మా ఇంటి పై కప్పుల గురించి కాదు.. మా వాడ్ని ఎలా పైకి తీసుకురావాలా? అని’’
‘‘అరె... ఏమైందంకుల్ వాడికి?’’
‘‘ఏముంది.. నువ్వు చూడు మంచి ఉద్యోగం చేస్తున్నావ్. వాడికి నీలా పైకొచ్చేందుకు ఒక్క మంచి లక్షణం లేదు. రాత్రి రెండింటి దాక కంప్యూటర్ ముందు.. పొద్దున పదింటికి లేవడం. కాస్త తెల్లారిగట్లయినా లేచి ఏడ్వరా అంటే.. ‘తెల్లారి గట్ల కోడి కూడా లేస్తది. ఏం బాగుపడింది. చికెన్ వండుకుని తినేస్తున్నమ్’ అని సినిమా డైలాగులు చెప్తున్నడు.’’
‘‘లేదంకుల్ వాడు....’’ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు శ్రవణ్.
‘‘నీ వయసులో ఉన్న శ్రవణ్ చూడు నెలకు 50 వేలు సంపాదిస్తున్నాడు’ అని ‘నీ గురించి చెబితే.. ‘నీ వయసులో ఉన్న బిల్‌గేట్స్ మిలియనేర్ అయ్యాడు. మరి నువ్వు?’ అని కౌంటర్లు ఇస్తున్నాడు’’
‘‘లేదంకుల్.. వాడి గురించి నాకు తెలుసు.. చూడండి వాడు గొప్ప వాడవుతాడు..’’
‘‘వాడేం బాగుపడతాడు. వాడ్ని చూసి వాడి చెల్లీ అలానే తయారవుతోంది. ‘కష్టపడి చదువుకోవే పైకొస్తావ్’ అంటే.. కష్....ష్టపడుతూ చదవడమెందుకు డాడీ! సింహం రోజూ 18 గంటలు పడుకుంటది. గాడిద రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తది. కష్టపడి పనిచేయడం వల్ల పైకి వస్తారంటే అడవికి గాడిద ఎప్పుడో రాజు అయి ఉండాలి కదా. మరి కాలేదెందుకు? అందుకే కష్టపడి కాదు.. కాస్త ‘దీన్ని’ ఉపయోగించాలి’’ అంటూ దిమాక్ చూపించింది’’
‘‘అంకుల్! జనరేషన్ మారిందంకుల్. మా యూత్ ఇంతే. ఇలానే ఆలోచిస్తది. If hard work is what which makes u successful than all labourers would have been as rich as Mukesh Ambani1 (హార్డ్‌వర్కే మనిషి సక్సెస్‌కి కారణమయితే.. కూలీ పని చేసేవారందరూ ముఖేష్ అంబానీలా ధనికులవ్వాలి కదా?) అని రామ్‌గోపాల్ వర్మ అంతటోడు ట్విట్టర్‌లో రాసిండు’’
‘‘ముఖేష్ అంబానీ అంత కాకపోవచ్చు. కానీ కష్టపడి పనిచేసేవాడు ఎప్పటికీ చెడిపోడు!’’
‘‘కరక్టే అంకుల్ కాదనను. మీ వాడు నాలా ఉద్యోగం సంపాదించి.. జీవితాంతం కేవలం ‘ఉద్యోగి’గానే మిగిలిపోవాలనుకోవడం లేదు.. వాడి ఆలోచనలు వేరు...’’
‘‘వాడి బొంద ఆలోచనలు.. ఆరు నూరయినా వాడు బాగుపడడు?’’
‘‘ఆరు నూరవుతుంది2 అని వాడు నాకు ప్రూవ్ చేసి చూపించాడు. అంకుల్! కుందేలు గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పరుగెడ్తది. తాబేలు గంటకు 4.8 మీటర్లే నడుస్తుంది. కానీ ప్రతిసారీ కుందేలే గెలవదంకుల్. చిన్నప్పుడు మీరు చెప్పిన తాబేలు - కుందేలు కథలో తాబేలే ఎందుకు గెలిచింది?’’
‘‘నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ లేదు’’
‘‘నిజమే అంకుల్. మాకు లాజిక్‌లు అక్కర్లేదు. మ్యాజిక్‌లనే నమ్ముతాం. జీవితంలో ఏదో మ్యాజిక్ జరగాలి. మీ వాడు అలాంటి మ్యాజిక్ ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. వాడు చేస్తాడు. నాకు నమ్మకం ఉంది’’
‘‘నీది అపనమ్మకం. ఏం తెలుసని వాడికి. ‘పెద్దల మాట చద్ది మూట’ అంటారు. మేం చెప్పేది మీరు వినరా?’’
‘‘అంకుల్ ఇవి చద్దన్నం తినే రోజులా? పిజ్జాలు బర్గర్లు తినే కాలం.. ఏం పెద్దల మాట అంకుల్? ‘నిదానమే ప్రధానం’ అంటారు.. ‘ఆలస్యం.. అమృతం విషం’ అని కూడా మీరే అంటారు.. మీరు చెప్పే మాటల్లో మీకే క్లారిటీ ఉండదా?’’
‘‘అంటే... మేం పనికిరాని వాళ్లమనా?’’‘‘సారీ అంకుల్ నేను అలా అనడం లేదు.. మీరు చెప్పేది ఈ-మెయిళ్ల కాలంలో ఇన్‌ల్యాండ్ లెటర్ రాయమన్నట్లు ఉందంటున్నాను. మా జనరేషన్‌ని అర్థం చేసుకొమ్మంటున్నాను’’
‘‘రాసే విధానం వేరుకావొచ్చు. కానీ ఈమెయిల్ అయినా ఇన్‌ల్యాండ్ లెటర్ అయినా వాడేది ఒకే పనికి. ఎలా రాయాలో మీకు తెలిసినా ఏం రాయాలో చెప్పాల్సింది మాత్రం మేమే.’’
‘‘కావొచ్చంకుల్. మీరు అనుభవజ్ఞులే కాదనను. వర్షంలో తడిస్తే మీకు జలుబు చేసిందని మమ్మల్నీ తడవొద్దంటారా? భయమేస్తుందని హర్రర్ సినిమాలు చూడొద్దంటారా? మేమూ తడుస్తాం.. భయపడతాం.. నేర్చుకుంటాం..’’
‘‘అయితే మీ ఇష్టమా? అన్నీ అలానే నేర్చుకుంటారా? మేం అవసరం లేదా?’’
‘‘లేదంకుల్ మాకు సైన్స్ కావాలంటే ఇంటర్‌నెట్‌లో దొరుకుతుంది. కానీ సంస్కారం మాత్రం మీరే నేర్పాలి.’’
---
వామ్మో! ఈ జనరేషన్ చూడండి ఎలా అప్‌క్షిగేడ్ అయ్యిందో. వీళ్లని ఫేస్ చేయా’లంటే మీరూ అప్‌క్షిగేడ్ అవ్వాలి. ట్రస్ట్ మీ!
1) రామ్‌గోపాల్ వర్మ @RGVzoomin, 24 మార్చి , 2012, 8:26 PM
2) a = b అనుకుని రెండింటినీ 94తో బాగించండి. అప్పుడు 94a = 94b అవుతుంది.
(100-6)a = (100-6)b
100a - 6a = 100b - 6b
100(a-b) = 6(a-b)
ఎడమవైపు (a-b)కి కుడివైపు (a-b) క్యాన్సిల్ అవుతుంది.
100 = 6 అంటే ఆరు నూరవుతుంది.
(if u like this article click this link to read more www.facebook.com/beereddywrites)

0 comments: