ఎవ్రీ మార్నింగ్ is బ్యూటిఫూల్

By | September 18, 2012 3 comments

అదేంటో!? 
రోజూ చూస్తూనే ఉన్నా..
ప్రతి సూర్యోదయమూ...
కొత్తగానే ఉంటుంది...
దానికి ముందు జీవితం వింతగానే ఉంటుంది...
అలా ఎన్నో సూర్యోదయాలు 
కాలం అంతరంగంలో కలిసిపోతూనే ఉంటాయి...
వాటిని తీసి చూడలేం...
అలాంటి ఓ సూర్యోదయం గురించి.. 
ఈ మిక్స్ అండ్ మ్యాచ్.


సెల్‌ఫోన్ అలారం మోగే సమయం.. 
కోడి కూతకు బదులు వాహనాల హారన్‌లు, ఫ్యాక్టరీల సైరన్‌లు ఈ టైమ్‌లో సహజం..
అద్దె ఇళ్లల్లో ఉండేవారు నిద్రలేచి టూ వీలర్ బయటపెట్టి మళ్లీ పడుకునే సందర్భం..
ఒక ఇల్లాలు.. గడప ముందు సిమెంటు నేలని ఊడ్చి, గేటు ముందు సీసీ రోడ్డు మీద నీళ్లు చల్లి చాక్‌పీస్‌తో ముగ్గు వేస్తుంది.స్కూలు పిల్లలు అయిష్టంగానే ట్యూషన్‌కి బయలుదేరుతుంటారు.
కాలేజీ విద్యార్థులు ఆలస్యమైపోతోందని హడావిడిగా ప్రయివేటు క్లాస్ బాట పడతారు.
కొందరు స్పోర్ట్స్ సూటు, రన్నింగ్ షూస్ వేసుకుని కనిపిస్తారు.
చకచకా సైకిల్ తొక్కుతూ పేపర్ బోయ్‌లు వేగంగా వెళ్తుంటారు.
టీస్టాల్‌లో పాలు మరుగుతుంటాయి. ఇరానీ ఛాయ్ ఘుమఘుమలాడుతుంటుంది.
ఇడ్లీ బండి నడిపేవాళ్లు బండి తోసుకుంటూ అడ్డా మీదికి బయలుదేరుతుంటారు.
ఫ్లోరోసెంట్ గీతలున్న నారింజ రంగు ఆప్రాన్ ధరించి మున్సిపాలిటీ కూలీలు రోడ్లు ఊడుస్తుంటారు.
కొందరు పూలు అమ్ముతుంటారు.. కొందరు చెత్త ఏరుకుంటుంటారు.
మార్గాలు వేరైనా అందరి లక్ష్యం ఒకటే.. బతుకు పోరాటం..

ఉదయం 5 గంటలు.. ఎల్‌బీనగర్

charmasఆంధ్రా నుంచి వచ్చే ప్రయివేటు బస్సులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉన్నాయి. రోడ్డు దాటడం కూడా కష్టంగానే ఉంది. విజయవాడ వైపు వెళ్లే బస్టాపులో జనాలు ఫుల్‌గానే ఉన్నారు. అది చూస్తే ఎల్‌బీనగర్ రింగ్ రోడ్‌కి అలసట అనేది తెలియదా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏ సమయంలో చూసినా అంతే హడావిడిగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాలు హైదరాబాద్‌లో అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. అర్థరాత్రి దాటాకా ఆలస్యంగానైనా... కాస్త అలసట తీర్చుకుని.. ఆర్టీసీ బస్సు మళ్లీ రోడ్డెక్కుతుంది. నగరజీవి దినచర్య ప్రతీ దినం.. ఈ ప్రగతి రథంతోనే ముడిపడి ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి వచ్చిన సిటీ బస్సు దిల్‌సుఖ్‌నగర్ వైపు బస్టాప్‌లో ఆగింది. ఒకరు పాల క్యాన్లు దించారు. ఇంకొందరు కూరగాయల బుట్టలు, పువ్వులున్న సంచులు దించారు. బస్సు కదిలింది. ఒక దుకాణం షెట్టర్ ముందు న్యూస్ పేపర్ల కట్టలు ఉన్నాయి. నలుగురైదుగురు ఒక పేపర్‌ని ఇంకో పేపర్‌లోకి జోడిస్తున్నారు. ఇంకొందరు ఆ న్యూస్‌పేపర్లలోకి ఏవో కరపవూతాలు చేర్చుతున్నారు. మరికొందరు పేపర్ కట్టల్ని సైకిల్ క్యారియర్ మీద పెట్టుకుని బయలుదేరుతున్నారు. మొత్తంగా పది పదిహేను మంది ఉన్నారక్కడ. 
pepar
దిల్‌సుఖ్‌నగర్ వైపు కాస్త ముందుకు...
ఎడమవైపు జిల్లా పరిషత్ స్కూల్‌లో ‘ఉ..హా..’ అంటూ కొందరు చిన్నారులు కరాటే ప్రాక్టీస్ చేస్తున్నారు. దాని పక్కనున్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ‘‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. ప్రభాదివ్యకాయం ప్రకీర్తివూపదాయం.. ’’ అని మైక్‌లో హనుమాన్ చాలీసా వినిపిస్తోంది. మాల్ మైసమ్మ గుడి ముందు ఒక బోరింగ్ ఉంది. ఒక ఆటో డ్రైవర్ బకెట్‌తో నీళ్లు పట్టుకున్నాడు. షాంపూ పెట్టి ఆటో కడుగుతున్నాడు. ఎల్‌బీనగర్ హాస్పిటల్ పక్కన టీస్టాల్ నుంచి ఇరానీ ఛాయ్ వాసన ఘుమఘుమలాడుతోంది. ఎదురుగా సవేరా వైన్స్ ముందున్న వరండాపై అల్లంరవ్వ, జీడిపప్పు, బాదం పప్పు ప్యాకెట్లు పెట్టుకుని అమ్మడానికి కూర్చున్నారిద్దరు. వైన్స్ పక్కనున్న ఫ్లవర్ స్టాల్ అతను పూలదండ అల్లి దానికి రంగు రంగుల మెరుపు తీగలు చుడుతున్నాడు. ఫ్రూట్ స్టాల్స్ మీది నుంచి ప్లాస్టిక్ పరదాలు తీసి వ్యాపారానికి సిద్ధమవుతున్నారు వాటి యజమానులు. ఆ స్టాళ్లకు ఎదురుగా ఉన్న బస్టాప్‌లో నలుగురైదుగు అబ్బాయిలు బస్ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు. బస్టాప్‌కు ఒకవైపున్న ‘సులభ్ కాంప్లెక్స్’ బిజీగా నడుస్తోంది. ఇంకో వైపు.. ఒకాయన ఇడ్లీ బండి నుంచి గిన్నెలు దింపి పొయ్యి వెలిగిస్తున్నాడు. పెద్ద గిన్నెలో పల్లీ చట్నీ కలుపుతోంది ఇంకో ఆవిడ.
milkboy
సరూర్‌నగర్ స్టేడియం లోపల... 
వందల మంది ఉన్నారు. ఇండోర్ స్టేడియానికి వెనకాల ఉన్న గ్రౌండ్‌లో కొందరు యువకులు రన్నింగ్ చేస్తున్నారు. నడివయస్కులు వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. ‘రోజూ వస్తావా?’ అని ఒక కుర్రాడిని అడిగితే ‘ఔను రోజూ వస్తాను. తప్పకుండా రావాలి కూడా. ఎందుకంటే ఎస్సై పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. అందుకే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు దగ్గరలో ఉంది ఈ స్టేడియమే కాబట్టి ఎక్కువగా ఇక్కడికే వస్తుంటాం. అప్పుడప్పుడూ విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్‌కి కూడా వెళ్తుంటాం’’ అని ఆయాసపడుతూ చెప్పాడు దినేష్. ఎస్సై పరీక్షలు రాసేందుకు ఇక్కడికొచ్చి స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ‘‘అబ్బో క్లాస్‌కి టైమ్ అవుతోంది. ఇంకో నాలుగు రౌండ్లు కొట్టాలి.. ఉంటా బై..’’ అంటూ మళ్లీ పరుగు మొదపూట్టాడు దినేష్. గ్రౌండ్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఇండోర్ స్టేడియానికి ఎడమ వైపు పచ్చని గడ్డి మధ్యన నాపబండలమీద వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని యోగా చేస్తున్నారు కొందరు. 

అందులో ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలూ ఉన్నారు. స్టేడియం గేటు ముందు నుంచి ఒక ఆటో ముందు ఇంకో ఆటో వరుసగా క్యూలో ఉన్నాయి. వాటి మధ్యలో అక్కడక్కడా ఒకటి రెండు కార్లు కూడా ఉన్నాయి. ‘ఈ లైన్ ఏంటీ?’ అని చూస్తే భాగ్యనగర్ ఎల్‌పీజీ గ్యాస్ బంక్‌లో గ్యాస్ నింపించుకునేందుకు క్యూలో పెట్టారని తెలిసింది. ఎన్టీఆర్ నగర్ మార్కెట్ ముందు ఆగిన బస్సులోంచి కూరగాయల బస్తా దించాడు ఒకరైతు. కష్టంగా బస్తాని నెత్తికెత్తుకుని మెల్లగా రోడ్డు దాటి మార్కెట్‌లోకి వెళ్లాడు. గేటు లోపలి నుంచి బయటికి వస్తున్న వెంకటయ్యని ‘ఏం తెచ్చావ్?’ అని అడిగితే... ‘ఇవూబహింపట్నం నుంచి బెండకాయల బస్త ఏసుకొచ్చిన. సేటు దగ్గర ఐదు రూపాయలకు కిలో లెక్కన అమ్మిన.’ అని బస్తా మడుస్తూ చెప్తూనే వెళ్లిపోయాడు. పచ్చని కూరగాయలతో, గుబాళించే ఆకుకూరలతో.. వచ్చీ పోయేవారితో మార్కెట్ సందడిగా ఉంది. ఆ సందడిలోనే రైతు దగ్గరి కిలో ఐదు రూపాయల బెండకాయ.. ఇరవై రూపాయలకు మారుతుంది. రైతు చేతిలో ‘స్పాట్’ మనీ పెట్టి.. దుకాణం వారికి క్రెడిట్ ఇచ్చే దళారీ.. దర్జాగా సంపాదించేందుకు అనువైన సమయం అదే మరి. 
gadidhapalu
డబ్బు గురించి.. అక్కడ కొందరిది ఆరాటం.. కొందరిది పోరాటం...
కొత్తపేట వరకు అక్కడక్కడా ఆగిన ఇసుక లారీలు.. బేరసారాలు.. కనిపించాయి. ఆదివారం కావడంతో కొత్త పేట రైతు బజార్ మరింత సందడిగా ఉంది. మొక్కజొన్న పొత్తులు నిండిన ఆటోలు అన్‌లోడ్ అవుతున్నాయి. రోజులా కాకుండా కూరగాయల కంటే చేపల దగ్గరే ఎక్కువ మంది కనిపించారు. సండే కదా?!కొత్తపేట ఫ్రూట్ మార్కెట్... ఈ ఉదయం మనుషుల మధ్య వ్యత్యాసాలు తెలియజెబుతుంది. బత్తాయిలు అమ్మడానికి ఊళ్లో నుంచి వచ్చిన వాళ్లు కనిపిస్తారు. వాటిని అమ్మి పెట్టే మధ్యవర్తులూ ఉంటారు. బుట్టల్లో నింపుకుని వీధి వీధీ తిరిగి అమ్మే మహిళలు కనిపిస్తారు. తోపుడు బండ్ల మీద అమ్మే యువకులూ అప్పుడే వచ్చిన పండ్లని కొనేందుకు వస్తుంటారు. రోటీన్‌గా కనిపించేవారితోపాటు.. చైతన్యపురి సందుల్లో గాడిద పాలు అమ్ముకునే మల్లమ్మ కనిపించింది. దిల్‌సుఖ్‌నగర్‌లో వినాయక చవితికి మండపాలు వేసే కూలీలు కనిపించారు. ముసారాంబాగ్‌లో ఫుట్‌పాత్ మీద బార్బర్.. టీవీ టవర్ దగ్గర బొమ్మలమ్ముకునేవారు కనిపించారు. 

తెల తెలవారుతుంటే.. రోడ్డు మీద జనాలు.. ఆరోహణ క్రమంలో పెరుగుతూనే ఉన్నారు. మలక్‌పేట్ ‘చర్మాస్’ పైన ఎగురుతున్న పావురాలు రా... రమ్మని పిలుస్తాయి. దాని ముందున్న రోడ్డులో వేల సంఖ్యలో పావురాలు దిగుతాయి. ఎందుకంటే వాటికి గింజలు చల్లేందుకు ప్రత్యేకంగా కొందరు వస్తుంటారు. అంత మంది వస్తారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక తాతయ్య పావుబస్తా నూకలు చల్లాడు. ఒక యువకుడు జొన్నలు, సద్దలు, పుట్నాలు.. ఇలా మూడు రకాల ధాన్యాలు తెచ్చాడు. ఇంకొకతను తన భార్యాపిల్లలతో వచ్చి కూర్చున్నాడు. ‘‘నేను కరెక్ట్‌గా ఇదే టైమ్‌కి వస్తాను. ఏదో ఒకటి తీసుకొచ్చి చల్లి వెళ్తుంటాను. పావురాలకు దాన పెట్టడంలో ఏదో తెలియని సంతృప్తి. అవి ఎగురుతుంటే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. వాటి రెక్కల చప్పుడు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇలా రెండేళ్లుగా చేస్తున్నా’ అని చెప్పాడు విశాల్ అనే యువకుడు. మలక్‌పేట ‘చర్మాస్’ దగ్గరే కాదు.. కోఠీలోని కబూతర్ ఖానా, పాతబస్తీలోని మక్కా మసీదు దగ్గర ఇంతకంటే ఎక్కువ పావురాలు ఉంటాయి. 
flowerwomen
వాటికి గింజలు పంచేవారు ఇక్కడి కంటే ఎక్కువగానే ఉంటారు. ఎగురుతున్న పావురాల మధ్య నుంచి... దూరంగా కనిపించే టీవీ టవర్ పక్కన.. దిల్‌సుఖ్‌నగర్ కాంక్రీట్ జంగిల్ మీదుగా.. సూర్యుడు మెల్లగా పైకొచ్చాడు. ‘‘ఊదా రంగు చెద్దరును పరుచుకొని ఆకాశం నొప్పులు పడుతుంది అదిగోఅరుణ బింబం ఆవిష్కరణం.. జిగురు రెప్పలు విప్పి చూద్దాం సూర్యుడు తనను తాను వేకువలోకి వొంపుకుంటున్నాడుఎర్రని సొన కారిపోయితెల్లగా పదునెక్కుతున్నాడు’’ అని సూర్యోదయాన్ని గొప్పగా వర్ణిస్తాడు కవి, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డా॥ ఎన్. గోపి. ఇది హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికి సంబంధించించిన సూర్యోదయం కావొచ్చు. ఒక రోజుకు సంబంధించిందే అయి ఉండొచ్చు. 

ఇంతకంటే అందమైన సూర్యోదయాలూ ఉండొచ్చు. కానీ ఎక్కడైనా సూర్యోదయానికి ముందు ఇంచుమించు ఇలాంటి జీవన పోరాటమే ఉంటుంది. అందుకే ఈ సూర్యోదయం కూడా హైదరాబాద్ డైరీలో.. కచ్చితంగా ఒక పేజీ. సూర్యుడు పురోగామిఅస్తమించడానికీ సిద్ధమే గాని వెనుకడుగు వేయడు.. తూర్పున దానిమ్మలా గుప్పెడు మాణిక్యాల్తో బద్ధలవుతాడు. ప్రతి సూర్యోదయాన్ని చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఎందుకంటే ఆ భావన ఒక ఆత్మ విశ్వాసం.. ఒక ఉద్యమ విస్పోటనం...

3 comments:

'''నేస్తం... said...

well written

Sujata M said...
This comment has been removed by the author.
Sujata M said...

chala bavundi. Simple. And Beautiful.