బీరుసీసాలో బీరకాయ

By | November 06, 2012 2 comments
‘‘నాన్న! ఒక కథ చెప్పు నాన్న...’’ అడిగింది కీర్తి. 
‘‘ఇప్పుడు కథేంటి, పడుకోమ్మా..?’’ అన్నాడు శ్రీరామ్. 
‘‘లేదు నాన్న.. చెప్పు నాన్న’’
‘‘కార్టూన్ ఛానెల్ చూడమ్మా’’
‘‘టీవీ వొద్దు. కథనే కావాలి. ప్లీజ్ నాన్న చెప్పు నాన్నా..’’
‘‘సరే.. ఏం కథ చెప్పాలి.. అనగనగా ఒక రాజు...’’
‘‘ఆ తెలుసు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు, వారు వేట కెళ్లారు... చేపలు తెచ్చారు. అదంతా పాత కథ నాన్నా.. ఏదైనా కొత్త కథ చెప్పు’’
‘‘కొత్త కథా?... అయితే నీకు బంటిగాడి కథ చెబుతా?’’
‘‘బంటిగాడా?’’
‘‘అవును.. బంటిగాడి కథ. వాళ్ల డాడీ హైదరాబాద్‌లో పెద్ద బిజినెస్‌మేన్. చాలా బిజీ మనిషి. బంటీ కోసం ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేసేవాడు కాదు. అప్పుడు బంటి.. వాళ్ల అమ్మ దగ్గరికెళ్లి అడిగాడు ‘మమ్మీ! డాడీ నాతో ఎప్పుడూ టైమ్ స్పెండ్ చేయడు ఎందుకని?’
‘డాడీ బిజీ కదరా. నీ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు’ అని చెప్పింది ఆమె.
‘నా కోసమా? ఎంత సంపాదిస్తున్నాడు’
‘నెలకు పది లక్షల రూపాయలు’ బంటీ వాళ్ల డాడీ లేట్ నైట్ ఏదో రాసుకుంటున్నాడు. బంటి భయం భయంగా దగ్గరికి వెళ్లి
‘డాడీ! నాతో రేపు ఒక గంట టైమ్ స్పెండ్ చేస్తారా?’
‘లేదురా. రేపు ఇంప్టాంట్ మీటింగ్ ఉంది. ఇంకెప్పుడైనా చూద్దాం’
‘ఊరికే ఏం వద్దు. మీరు గంటకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తారంటా కదా. ఇదిగోండి ఫోర్టీన్ హండ్రెడ్’
‘నాకు డబ్బిస్తావా? ఇంత డబ్బెక్కడిది. దొంగతనం చేశావా?’ కోపంతో ఊగిపోతూ బంటిని చడామడా కొట్టేశాడు.

కాసేపటి తర్వాత..
బంటీ వాళ్ల డాడీ కూల్ అయ్యాడు. ఏడుస్తూ కూర్చున్న బంటీ దగ్గరికి వెళ్లి దగ్గరికి తీసుకున్నాడు.
‘ఏదో కోపంలో అలా చేశాను. ఇప్పుడు చెప్పు. నీకు ఇంత డబ్బు ఎక్కడిది?’ అని అడిగాడు.
ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న మాటలు బంటీ ఇలా చెప్పాడు. ‘మొన్న దసరాకి తాతయ్య వాళ్ల ఊరెళ్లాను కదా. అక్కడ.. పరిగె ఏరుకున్న.. చిన్నప్పుడు మీరు కూడా ఏరుకునే వారంట కదా. మీరు చదువుకున్న స్కూల్ చూసిన.. మన బట్ట ఆవు.. లేగదూడ.. మునసబుగారి మేడ.. రామాలయం.. పక్కనే చెరువు.. అందులో కల్వపూలు.. కట్ట మీది మైసమ్మ అన్ని చూశాను. తాతయ్య తాటికల్లు తాగించాడు. ఈత పండ్లు తినిపించాడు. బర్రె పొదుగు మీదే పాలు తాగితే ఎంత ఉన్నాయో. తాతతో పాటు పొలంకెళ్లి నాగలి దన్నిన. బురదలో ఎగిరిన. ఆముదపు లొట్టలు కట్టుకుని తాతయ్యతో పాటు ఈత కొట్టిన. ఈత అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు కోసిన వరి పొలాల్లోంచి, ఏరిన ఆముదపు చేనుల్లోంచి నడుచుకుంటూ వచ్చినం. కోస్తుండగా రాలిన వడ్ల గింజలు.. ఏరుతుండగా జారిపడిన ఆముదపు కాయలను తాతయ్య చెప్పినట్లు రోజూ ఏరుకున్న. అలా వన్ వీక్ ఏరిన వాటిని ఊరి చివరన శేటు దగ్గర తాతయ్య అమ్ముకొస్తే.. ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయి. మరేమో మీతో నేను వన్ హవర్ స్పెండ్ చేయాలంటే నాకు ఇంకో థౌసెండ్ రూపీస్ కావాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. స్కూల్ స్టార్ట్ అయ్యాక తాతయ్య ఇచ్చిన ‘బీరుసీసాలో బీరకాయ’ని సైన్స్ ఎగ్జిబిషన్‌లో పెడితే నాకు ఫస్ట్ ఫ్రైజ్ థౌసెండ్ రూపీస్ వచ్చినయ్. ఈ ఎగ్జిబిషన్‌కు కూడా మీరు రాలేదు. అవే డాడీ ఈ డబ్బులు. మన పల్లె ఎంత బాగుందో. తాతయ్యతో పాటు ఎంజాయ్ చేసినట్లు మీతో కూడా ఎంజాయ్ చేయాలనుంది డాడీ. కానీ మీరేమో టైమ్ స్పెండ్ చేయరు. అందుకే ఇలా చేశా’ అని ఎక్కిఎక్కీ ఏడుస్తూ చెప్పాడు బంటి.
బంటి వాళ్ల డాడీకి కన్నీళ్లు తప్ప మాటలు రాలేదు. బంటిని గట్టిగా కౌగిలించుకున్నాడు.
---
‘‘వాహ్.. బావుంది డాడీ కథ’ అని శ్రీరామ్‌ని బిగ్గరగా వాటేసుకుంది కీర్తి.
‘ఇంతకీ బీరుసీసాలోకి బీరకాయ ఎలా వెళ్లింది డాడీ?’
‘అదా.. బంటి వాళ్ల తాతయ్య ఇంటి వెనకాల ఒక బీర చెట్టు ఉంది. బీరుసీసా మూతి దగ్గర బీరపువ్వు కనిపిస్తే బంటి ఊరికే దాన్ని అందులోకి తోశాడు. వారం రోజుల తర్వాత అందులోకి పెద్ద బీరకాయ ఊరింది.
‘బీరు సీసాలోకి బీరకాయ’ ఎలా వెళ్లిందని చాలామంది ఆశ్చర్య పడడంతో బంటికి ఎగ్జిబిషన్‌లో ఫస్ట్‌ఫ్రైజ్ వచ్చింది.
---
అదీ విషయం. ప్రపంచంలో మన పిల్లలకంటే ఏదీ ఎక్కువ కాదు. పాలు ప్లాస్టిక్ కవర్‌లోంచి వస్తాయనుకునే ఈ కాలం పిల్లలకు పాల పొదుగు చూపించాలి. పాలు తాగే లేగ దూడనీ పరిచయం చేయాలి. ఫేస్‌బుక్‌లో ‘ఫామ్ విల్లా’నే కాదు విలేజ్‌లో ఫార్మర్‌నీ ప్రత్యక్షంగా చూపించాలి. పంటని కన్నబిడ్డల్లా పెంచేందుకు రైతులు పడే కష్టం వారికి అర్థం కావాలి. మీరెంత బిజీగా ఉన్నా.. మీ పిల్లల కోసం టైమ్ స్పెండ్ చేయాలి. ఈ దీపావళికి వారి పక్కన మీరుండి కాకరవత్తులు, భూచక్షికాలూ వెలిగించండి. టైం కాదు, జీవితాన్ని నిజంగానే స్పెండ్ చేయండి.

2 comments:

bandaru said...

బాబు నీ కథ చాలాబాగుంది. ఇకనుండి నీవు ఇలా మరిన్ని మంచి కథలు రాయాలని కోరుతున్నాను.
- శ్రీనివాస్, శ్రీకాకుళం

bandaru said...

బాబు నీ కథ చాలాబాగుంది. ఇకనుండి నీవు ఇలా మరిన్ని మంచి కథలు రాయాలని కోరుతున్నాను.
- శ్రీనివాస్, శ్రీకాకుళం