ఆడవారికి మగవారు చెవుల పువ్వెట్టింగ్...

By | November 02, 2014 2 comments


ఆడవారికి మగవారు తరచుగా చెప్పే అబద్ధాలు


ఆడవారి మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయో లేదో కానీ మగవారు చెప్పే అబద్ధాలు చాలానే ఉంటాయట. ఆడవారికంటే మగవారే అబద్ధాలు ఎక్కువగా చెబుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. 
మగవారు ఆడవారి చెవిలో తరచుగా పువ్వెట్టే సీన్స్ ఇవి. 

నేను ఆమెను చూడడం లేదు


మగవారు తమ పార్ట్‌నర్‌తో ఉన్నప్పుడు ఎవరైనా అందమైన అమ్మాయిలు వారి ముందుగా వెళితే కళ్లు వాటంతటవే అటువైపు తిరుగుతాయట. ఆడవారు ఆ విషయం గమనించి అడిగితే చూసి కూడా చూడలేదని, నువ్వు పక్కనుండగా మరొకరినెందుకు చూస్తానని ఈజీగా బుకాయిస్తారట. 

మర్చిపోలేదు.. నాకు గుర్తుంది..


ఈ మాట మగవారు ఆడవారి దగ్గర తరచుగా వాడుతుంటారు. ఆడవారు ఏమైనా తీసుకురమ్మని చెబితే అవి మరచిపోవడమే కాక నువ్వు చెబితే మరచిపోతానా ఓ పనుండి అటువైపు వెళ్లలేదు. రేపు ఎంత పని ఉన్నా కచ్చితంగా తీసుకువస్తానంటారట. 

లేదు లేదు వింటున్నా..


తమ గాళ్‌ఫ్రెండో, పార్ట్‌నరో ఏవైనా అనవసర విషయాల గురించి మాట్లాడుతుంటే అవి వింటున్నట్లు తల ఊపుతూ వారి లోకంలో వారు ఉంటారట. ఒకవేళ ఆడవారు ఆ విషయం కనిపెట్టి అడిగితే.. లేదు లేదు నువ్వు చెప్పినవి వింటూ ఆలోచిస్తున్నా అని అంటారు. పొరపాటున ఆమెగానీ.. సరే ఏమి చెప్పానో చెప్పు అని ఆమె అంటే ఇక అడ్డంగా బుక్ అయినట్లే. 

తాగలేదు.. బలవంతం చేశారు..


ఇంకెప్పుడూ తాగను.. అప్పటికీ నీకు ఇష్టం లేదని చెప్పా. కానీ వాళ్లు వింటేగా బలవంతంగా తాగించేశారు అంటూ మగవారు ఇలా మొదలెడతారట. కానీ వాస్తవమేంటంటే ఒకరు బలవంతం పెట్టే విషయం పక్కన పెడితే మందు తాగేటప్పుడు తన భార్యకు ఇష్టం లేదన్న మాట అసలు గుర్తుకే రాదట. ఒకవేళ వచ్చినా లైట్ తీసుకుని లైట్ పెగ్గేద్దాం అనుకుంటారట. పైన చెప్పినట్లు సాకు చెప్పి తప్పించుకోవచ్చనే ధీమాతో నైంటీ ప్లస్ నైంటీ కొట్టేస్తారట. 

నా కలలో ఇంకో అమ్మాయా నో ఛాన్స్!


మగవారు తమ కలలో వారి వారి స్వప్న సుందరులను ఊహించుకుంటూ కలలు కంటారు. ఒకవేళ నిద్రలో కలవరిస్తూ దొరికిపోతే.. ఛా నా కలలో ఇంకో అమ్మాయా? నో ఛాన్స్. నా జీవితంలోనే కాదు.. నా కలలో కూడా నీకు తప్ప మరొకరికి చోటు లేదు అని బిస్కెట్ వేస్తారట. వాస్తవానికి ఏ భర్తకూ తన భార్య కలలో రాదు. 

ఆ విషయం నాకు తెలుసు..


ఏదైనా విషయం తెలియదు అని ఆడవారి ముందు ఒప్పుకోవడానికి మగవారికి నామోషీ. ఆడవారికి తెలిసిన విషయాన్ని మగవారు తమకు తెలియకపోయినా తెలుసని బుకాయిస్తారట. అలా ఇలా మాటల్లోకి దింపి ఆ విషయాన్ని మొత్తానికి ఆడవారి నుంచే రాబడతారట.

2 comments:

Ts said...

చాలా బాగుంది. కానీ ఈ ఉదయం నమస్తే తెలంగాణలో చదినట్లుంది సార్.

naa said...

చదివే ఉంటారు.. ఎందుకంటే నేను రాసింది నమస్తే తెలంగాణ కోసమే కదా..