Skip to main content

ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అన్న పురుషాధిక్యం తలలు వంచి నోళ్లు మూయించిన ధీర వనిత


కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి... శాత్రవ భయంకర నిత్య రుద్ర రూపిణి అరుదైన పాలనా దక్షురాలు.. అసమాన పరాక్రమశాలి.. శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవ మహారాజు.. అలియాస్ రుద్రమ దేవి.. ఉరఫ్.. రుద్రాంబ. రాణీ రుద్రమ దేవి.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ నేమ్ ఒక ఫైర్ బ్రాండ్. దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితమే సమాజంలో బలంగా వేళ్లూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరిన వీరనారి. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? 
అన్న పురుషాధిక్యం తలలు వంచి నోళ్లు మూయించిన ధీర వనిత. నేటి స్వేచ్ఛా మహిళకు ఆమె ఒక ప్రతీక. స్త్రీ ఆత్మ గౌరవానికి సమున్నత పతాక. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గ ధారిణి... 
రాణీ రుద్రమదేవి గురించి మనకు తెలిసింది ఎంత? 
రాణీ రుద్రమ దేవి గురించి మనకు తెలిసినదానికన్నా తెలియనిదే ఎక్కువ. ఆమె జన్మ సంవత్సరం తెలియదు. ఉజ్జాయింపుగా ఊహించడానికి వీలుంది అని కాకతీయ యుగము గ్రంథంలో లక్ష్మీరంజనం రాశారు. నిజమే! రుద్రమదేవి గురించి చరిత్రకారులకూ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ఏడో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో ఇలా ఉంది.
మీరు ఎప్పుడైనా అత్యంత ధైర్యసాహసాలు గల మహిళా పాలకురాలైన రుద్రమదేవి గురించి విన్నారా ? ఆమె తన శక్తిసామర్థ్యాలతో ప్రతి ఒక్కరినీ మెప్పించి దిగ్విజయంగా పాలనా వ్యవహారాలను నిర్వహించారు. ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఓరుగల్లు (నేటి వరంగల్లు) రాజధానిగా పరిపాలించారు. క్రీ.శ.1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. మనదేశంలో మహిళాపాలకులు చాలా అరుదు. రాణీ రుద్రమదేవికి కొద్దికాలంముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు.
ప్రభువర్గాలకు చెందిన వారు స్త్రీపరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుదముట్టించారు. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి, ఆమె పరిపాలన, ధైర్యసాహసాలను కొనియాడాడు. ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా, సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నాడు. నాటి శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. రజియా సుల్తానా లాగా రుద్రమదేవి కూడా తన తండ్రి పాలనా కాలంలోని ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా అణిచివేసింది. రుద్రమదేవి, ఆమె మనుమడైన ప్రతాపరుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకున్నారు.
(పాఠం 14 : ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు -127వ పేజీ)
రాజ్ఞి రుద్రమ దేవిని గూర్చి రాస్తూ ప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, డాక్టరు నేలటూరు వెంకటరమణయ్య ఇట్లా అభివర్ణించారు.
ఆంధ్ర దేశ పరిపాలకులలో రుద్రమదేవి నిస్సందేహంగా మహాఘనత చెందిన వ్యక్తి. రాజధర్మ విధులను ఆమె నిర్వహించిన తీరువలన తండ్రియామెకు ప్రసాదించిన పురుషనామము.. రుద్రదేవుడు అన్ని విధముల సార్థకమైనది. ప్రజలామెను రుద్రదేవ మహారాజు అని పిలుచుకునేవారు. దేశ పరిపాలనలో ఆమె చైతన్యవంతమైన పాత్ర వహించింది. ధైర్య సాహసములు విక్రమము కల యోధురాలు అవడమే కాక గొప్ప వ్యూహతంత్రజ్ఞురాలు. ఆమె రాజరికం చేసిన కాలంలో తరుచూ యుద్ధముల అలజడి కలిగినా ఆమె ప్రజలు సంతుష్టులు, సంప్రీతులు అయి సుఖించారు
అవును.. రుద్రమదేవి పాలన ప్రజారంజకమై భాసిల్లింది. శాంతి సుస్థిరతలతో విరాజిల్లింది.
క్రీ. శ. 1000 నుంచి 1323 వరకు దాదాపు మూడు శతాబ్దాల పాటు తెలుగు నేల నేలింది కాకతీయ వంశం. వీరికాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. కాకతీయ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు తలొగ్గిన ఆయన తన కూతురు రుద్రమదేవిని కుమారుడిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు ఆమె వయసు పద్నాలుగేళ్లే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటుబిడ్డగా పాలన సాగించింది. రుద్రమదేవి 1261 ప్రాంతం నుంచీ స్వతంత్రంగా పరిపాలించినట్లు కనబడుతుంది. కొన్ని శాసనాల్లో 1279 వరకు పట్టాభిషక్తురాలు కాలేదేమో అనే భావం కలిగించే రాతలున్నాయి.
ధీర వనితరుద్రమ దేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి దాయాదుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్టించగానే ఎదురు తిరిగారు. తిరుగుబాట్లు లేవదీశారు.
అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. పరిపాలనా దక్షతలో నేర్పరి అయిన రాణీ రుద్రమ వారి అసూయను అణిచి వేసింది. దక్షిణాదిని పాలించే చోళులు, మరాఠా ప్రాంత యాదవులను సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడిన యోధురాలు రాణీ రుద్రమ. దేవగిరి యాదవ మహాదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై పదిరోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది. రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు.
ప్రజా సేవలో..రాణీ రుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజులూ అర్థం చేసుకోలేదు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియ తిరిగింది. ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మహామంత్రీ! గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇకపై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు అని ప్రకటించింది.
రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది. విరాజిల్లింది. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు ధీటైన పేరిణీ శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుపోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణీ నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్ప కళ, నృత్యం కలగలిసిపోయి విరాజిల్లాయి.
అంబదేవుని దొంగదెబ్బఅనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదునుకోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకింది.
అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు.
శత్రువుల పాలిట సింహస్వప్నం..మన రుద్రమ అసమాన పరాక్రమశాలి. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనం. రుద్రమ్మ భుజశక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ స్వప్నమైంది. అంతఃశత్రువులు, బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన చత్తీస్‌ఘడ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం.. అంటే అస్సోం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే రుద్రమ దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారు పేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలనా పటిమను, మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది.
ఎప్పుడు చనిపోయింది?రుద్రమ తన ప్రసిద్ధ సేనాని గోన గన్నారెడ్డితో కలిసి కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో పలు దుర్గాలు వశపరుచుకుంది. గోన గన్నారెడ్డి వారి రాజ్యరక్షామణియైన విఠలనాథ దండనాథుడు మాలువ, హాలువ మొదలైన దుర్గాలు సాధించిన తర్వాత సర్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణ కోసం రాయచూరులో దుర్గం నిర్మించినట్లు అతని శాసనం(1294) చెబుతోంది. రాయచూరు విజయం రుద్రమ దేవి కడపటి విజయమని భావిస్తున్నారు. కావున 1295 ప్రాంతమున మహారాజ్ఞి రుద్రమ శివసాయుజ్యం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో రుద్రమదేవి 1289 నవంబర్ 27న మరణించినట్లు అవగతమవుతున్నది. దీనిని ఇతర శాసనముల సాక్ష్యముతో సమన్వయించి నిర్ధారించవలసి ఉంది.
వీరభద్రునితో వివాహంపద్నాలుగవ యేటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు ఇరవై ఐదో యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రునితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ముమ్మడమ్మ, రుయ్యమ్మ. తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. విధి ప్రాతికూల్యం చేత రుద్రమ దేవి భర్త చాళుక్య వీరభద్రుడు క్రీ.శ. 1266 నాటికే మృతిచెందినట్లు ఆయన తల్లి ఉదయ మహాదేవి పాలకొల్లు శాసనంలో ఉంది. భర్త మరణానికి సమీప కాలంలోనే రుద్రమదేవికి మరొక తీరని దుఃఖం కలిగింది. వృద్ధుడైన గణపతి దేవ చక్రవర్తి 1267లో శివసాయుజ్యం చెంది ఆమెను నిస్సహాయురాల్ని చేశాడు. రుద్రమకు ఇద్దరు కూతుళ్లే కాక మరో కూతురు కూడా ఉందా? అనే అనుమానం ఆ మధ్య ఒక శాసనం కలిగించింది. ప్రకృతశాసనంలోని ఎల్లన దేవుని భార్య కూడా రుద్రమదేవి తనయ అని ఆ శాసనం చెబుతోంది. 
... నగేష్ బీరెడ్డి 
beereddy12@gmail.com



Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...