హైదరాబాద్ చరిత్రలో ఆమె తాలూకు ఆనవాళ్లు ఇంకా సజీవంగానే ఉన్నాయి..

By | December 22, 2014 1 comment

హైదరాబాద్ నూర్జహాన్
ఈ చరిత్ర పునాదులు తవ్వుకుంటూ పోతే... పునాదుల కింద సమాధులు.. సమాధుల కింద ఎన్నో సత్యాలు. ముచ్‌కుందా నది అలాంటి ఓ సత్యాన్నే చెబుతోంది. ఒక నది రెండు తీరాలను విడదీయదు. రెండు ఒడ్డులను కలుపుతుంది. అలాంటి కలయికకు ప్రత్యక్షసాక్షి ముచ్‌కుందా. వరదకు ఎదురీదిన ఖులీ, భాగమతిల ప్రేమ నగరం.. ఈ భాగ్యనగరం.ఆ దంపతుల గారాల కూతురుదే ఈ సమాధి. కుతుబ్ షాహీ సమాధులలో హయాత్ బక్షీ బేగం సమాధి ప్రత్యేకమైనది. ఆమె ఎన్నడూ స్వయంగా పాలించలేదు. కానీ కుతుబ్ షాహీలలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉన్నది. హైదరాబాద్ చరిత్రలో ఆమె తాలూకు ఆనవాళ్లు ఇంకా సజీవంగానే మన కళ్లకు కనిపిస్తున్నాయి. గగనంలో చుక్కలు.. తోటలోని పూవులు.. కలహించక కలిసుండును.. మనుషులేల కలహించుట.. అన్న దాశరథి మాటలు గుర్తుకువస్తున్నాయి ఈ సమాధిని చూస్తే. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ హైదరాబాద్ నూర్జహాన్ కథ వినాల్సిందే. 

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా చనిపోంగనే ఆయన కొడుకు అబ్దుల్లా కుతుబ్‌షా పన్నెండు సంవత్సరాల వయస్సులనే సింహాసనం అధిష్టించినాడు. ఇతను కుతుబ్‌షాహీ వంశ పరిపాలకులల్ల ఐదో రాజు. చిన్నవయస్సు వల్ల అతను కేవలం నామ్ కే వస్తే నవాబుగా ఉన్నడు. తల్లి హయాత్ బక్షీ బేగం రాజమాతగా నిజమైన అధికారాన్ని నిర్వహించేది. పరిపాలనల ఆమె కడు సమర్థురాలు. ఆమెను హైదరాబాద్ నూర్జహాన్ అనవచ్చు. ఆమె పేరు మీదనే హయత్‌నగర్ వెలిసింది. హయత్‌నగర్ మసీదు ఆమె కట్టించిందే అని ప్రముఖ రచయిత పరవస్తు లోకేశ్వర్ తన సలామ్ హైద్రాబాద్ నవలలో వివరంగా చెప్పారు. 

రాజమాత


హయాత్ బక్షీ బేగం హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ ఖులీ కుతుబ్ షా, భాగమతిల కూతురు. వారికి పుత్ర సంతానం కలగలేదు. ఖులీ, భాగమతి హయాత్‌ను చిన్నప్పుడు ప్రేమగా లాడ్లీ అని పిలిచేవారు. ఆమె పేరనే చార్మినార్ దగ్గర లాడ్ బజార్ వెలిసిందట. 1607లో హయాత్ బక్షీ బేగం యుక్త వయస్సు రాగానే ఖులీ తన మేనల్లుడు మహమ్మద్‌తో వివాహం చేశాడు. నెల రోజుల పాటు రాజధాని నగరమంతటా వివాహ వేడుకలు జరిగాయట. ఖులీ తన తదనాంతర వారసునిగా అల్లుడినే ప్రకటించాడు. హయాత్ భర్త 1612 నుంచి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పేరుతో రాజ్యాధికారం చేపట్టాడు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, హయాత్ బక్షీ బేగంలకు ఏడేళ్ల ఎదురు చూపు తర్వాత ప్రథమ సంతానంగా కొడుకు జన్మించాడు. ఆ తల్లిదండ్రుల ఆనందోత్సహాలు అంబరాన్ని తాకాయి. పిల్లవాడికి అబ్దుల్లా అని నామకరణం చేశారు.

కానీ అబ్దుల్లా జన్మించిన ఘడియ మంచిది కాదని, తండ్రికి ప్రాణగండమని, కొడుకుకు 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు తండ్రి అతని ముఖం చూడడం అరిష్టమని మత పెద్దలు జోస్యం చెప్పారు. ఆ నిర్ణయానికి సుల్తాన్ తలవంచక తప్పలేదు. తండ్రికి దూరంగనే తల్లి హయాత్ బక్షి బేగం పర్యవేక్షణలో అబ్దుల్లా పెరిగాడు. రాజకుమారుడిలాగే అన్ని విద్యాబుద్ధుల్ని హయాత్ నేర్పించింది. కొడుకును చూడాలని ఆ తండ్రి హృదయం తహతహలాడుతూనే ఉంది. ఎట్టకేలకు అబ్దుల్లాకు 12 ఏళ్లు నిండాయి. తండ్రి కొడుకులు కలుసుకునే రోజు రానేవచ్చింది. కొడుకును మొదటిసారిగా చూసిన ఖులీ కౌగిలించుకొని ఆనందభాష్పాలు రాల్చాడు. తర్వాత కొన్ని రోజులకే నవాబు హఠాత్తుగా మరణించాడు. 12 సంవత్సరాల అబ్దుల్లా కుతుబ్ షా సింహాసనాన్ని అధిష్టించాడు. తెర వెనుక నిజమైన అధికారం మాత్రం రాజమాతగా హయాత్ బక్షీ బేగం చెలాయించేది.

మొహర్రం ఐదోరోజు..


యువరాజు అబ్దుల్లాకు 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక రోజు మూరత్ అనే మదపుటేనుగు మీద ఎక్కి పురానాపూల్ దాటి మూసీ నదికి అవతలి వైపు ఉన్న నదీ మహాల్ విహారానికి వెళ్లాడు. చిన్నప్పుడు ఆ ఏనుగును అతని తండ్రి వియత్నాం అడవులు సైగాన్ నుంచి తెప్పించి బహుమతిగా ఇచ్చిండు.

తిరుగు ప్రయాణంల ఆ మదపుటేనుగు మతిచలించి తన తొండంతో మావటీని కిందికి గుంజి తన పదఘట్టనలతో అతడిని నుజ్జు నుజ్జు చేసి, చుట్టుపక్కల ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి తన మీద అంబారీల కూర్చున్న యువరాజుతో సహా సమీపంల ఉన్న అడవిలకు అంతర్థానమైంది. నవాబు వెంబడి ఉన్న కాల్బలం ఆ ఏనుగును వెంబడించినా ఫలితం లేకపోయింది. మూడు రోజులు గడిచినా ఆ ఏనుగు దాని మీద ఉన్న యువరాజు ఆచూకీ దొరకలేదు. రాజమాత హయాత్ బక్షీ బేగం దుఃఖానికి అంతులేదు. అడవిల ఉన్న చెట్ల కొమ్మలకు ఆహార పొట్లాలను, మంచి నీటి ముంతల్ని వేలాడదీయించింది. ఒకవేళ ఆ మార్గం నుంచి కొడుకు వస్తే ఆకలి దప్పుల్ని తీర్చుకుంటడని ఆమె ఆశ.

కొడుకు సురక్షితంగా తిరిగి రావాలని ఆమె నగరంల ఉన్న అన్ని మసీదులల్ల నమాజులను చదివించింది. ముల్లాలలను, మౌల్వీలను, ఫకీర్లను ఆశ్రయించింది. తొందరగ తన కొడుకు తిరిగి వస్తే 40 కిలోల బంగారంతో లంగర్ (గొలుసు) చేయించి వాటి ముక్కల్ని పేద ప్రజలకు పంచుతానని అల్లాకు మన్నత్ (ముడుపు) కట్టింది. ఆమె ప్రయత్నాలు, ప్రార్థనలు ఫలించి ఏడో రోజు ఉదయాన, మొహర్రం మాసం మొదలైన ఐదో రోజున ఏనుగుతో సహా యువరాజు సరక్షితంగా తిరిగి వస్తున్నట్లు ఆమెకు శుభవార్త అందింది. ఆమె తన మొక్కు ప్రకారం బంగారు గొలుసు చేయించి నగ్నపాదాలతో నడుచుకుంటూ వెంట పరివారం రాంగ ఊరేగింపుగా బయలుదేరింది. దానినే లంగర్ ఊరేగింపు అంటారు. మదీనా హోటల్ దగ్గరున్న బాద్‌షాహీ అశుర్‌ఖానాల ఆ గొలుసును దట్టీగా సమర్పించింది. పిమ్మట హుస్సేనీ ఆలం వద్ద ఆ బంగారు గొలుసు ముక్కలు ముక్కలుగా విడగొట్టి పేదలకు పంచిపెట్టింది. . 

మా సాహెబా


హయాత్ బక్షీ బేగం ఒక ఆదర్శ మహిళ. తన తండ్రి హయాంలోనే రాజకీయ సలహాదారుగా కీలక పాత్ర పోషించింది. తన భర్త, కొడుకు రాజ్యం ఏలుతున్నప్పుడు కూడా హయాత్ పాత్ర ఉండేది. అలా గోల్కొండ కోట నుంచి రాజ్యాన్ని పాలించిన ముగ్గరు నవాబుల వెనుక హయాత్ బక్షీ బేగం ఉన్నది. శత్రువుల దాడిని పసిగట్టి ముందస్తు ప్రణాళికలు రచించడంలో హయాత్ దిట్ట. హయాత్ మరో కుమారుడు ఆలీ చిన్న వయసులోనే చనిపోయాడు.

కూతురు ఖదీజా సుల్తానా. ఔరంగాజేబు కాలంలో బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షాకు తన కూతురిని ఇచ్చి వివాహం చేసింది. తద్వారా మొఘలులతో సత్సంబంధాలు కొనసాగించింది. మనుషుల్ని ప్రేమగా జయించాలన్నది ఆమె సిద్ధాంతం. అందుకే ప్రజల్ని తన బిడ్డల్లా చూసుకునేది. ప్రజలు ఆమెను గౌరవంగా మా సాహెబా అని పిలిచేటోళ్లు. మల్లెపల్లిలోని నవాబుల పొలాలకు నీరందించేందుకు ఆమె కట్టించిన మాసాహెబా ట్యాంకు కాలక్రమంలో మసాబ్ ట్యాంక్ అయ్యింది. 1667లో హయాత్ బక్షీ బేగం మరణించింది. హజాజ్ ఫారుఖ్ రాసిన పుస్తకాన్ని ముస్లిమ్స్ అండ్ మిస్టిక్స్ పేరున ఆంగ్లానువాదం చేసిన మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ హయాత్ బక్షీ బేగం గురించి ఇలా రాశాడు.

హయాత్ బక్షీ బేగం ఆ కాలంలో చారిత్రక వ్యక్తిత్వం కలిగిన మహిళ.. గోల్కొండ రాజ్యంలో అందాల యువరాణి.. ఆ కాలంలో కీర్తి గడించిన మహారాణి.. తన చివరి రోజుల్లో సామాన్యులందరికీ దగ్గరయిన అమ్మ

హయత్ నగర్


యువరాజు తప్పిపోయినప్పుడు వారం రోజుల తర్వాత ఒక వృద్ధుడు క్షేమంగా తీసుకు వచ్చాడట. అందుకు

Frong_view_hayat_bakshi_beg

ఆనందించిన హయాత్ నీకు ఏం కావాలో కోరుకో అని ఆ వృద్ధుణ్ణి అడిగిందట. అందుకు ఆ వృద్ధుడు హైదరాబాద్‌కు తూర్పున ఒక పెద్ద మసీదు నిర్మించమని కోరాడట. అతని కోరిక మేరకు పెద్ద మసీదు నిర్మించింది. అప్పటి నుంచి ఆ మసీదు హయాత్ బక్షీ మసీదు.. ఆ ప్రాంతం హయాత్ నగర్‌గా వెలుగొందింది. అదే కాలక్రమంలో హయత్‌నగర్‌గా స్థిరపడిందని స్థానికంగా చెబుతారు. వృద్ధుని కోరిక మేరకే మసీదు కట్టిందో లేదో కానీ.. చారిత్రక వర్తక రహదారి అయిన సూరత్ నుంచి మచిలీపట్నం మార్గమధ్యలో ఇలాంటి నగరం అవసరమని హయాత్‌నగర్‌ను నిర్మించినట్లుగా కూడా చెబుతారు. తన యువరాజును తిరిగి తీసుకు వచ్చిన ఏనుగు ఆ తర్వాత ఈ మసీదులో ప్రాంతంలోనే ఉండేదని, దానికి ప్రత్యేకమైన గదిని కూడా కట్టించిందని చెబుతారు. ఈ మసీదు వద్దే హథీబౌలీ అని పెద్ద బావిని కూడా హయాత్ నిర్మించింది. దీనికి ఏనుగుల బావి అనే పేరు కూడా ఉంది.


1 comments:

cbrao said...

హయాత్ బక్షీ బేగం గురించిన వివరాలు ఆసక్తికరంగా చెప్పారు. చాల కొత్త విషయాలు తెలిసాయి.