ఒక నజియా కోసం.. : 1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమకథ (నవల)

By | March 29, 2015 Leave a Comment








అరవై ఆరెళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది..
మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది..
అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది..
హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారాయన..
ఎవరీ నజియా? ప్రేమించుకుని ఎందుకు పెళ్ళి చెసుకోలేక పోయారు?
తాత వస్తానని ఉత్తరం రాసి.. ఎందుకు వెళ్ళలేదు? ఎవరీ నిజాం? అసలు ఆయన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మరి నజియా ఏమై పోయింది?
నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకుని.. ముంబై నుంచి హైదరాబాద్ బయలుదెరుతున్నాను.
నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు.. నాకు తెలియని నా ములాల కోసం కూడా..
ఈ కార్తీక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం..

నా హీరోయిన్..
ఐదేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి కోసం రాసిన కథనం ఇది. (25.2.2010)
ఇదిగో ఈ ఫోటోలో ఎరుపు రంగు చీరలో వెలిగిపోతుంది చూశారా? తనే నా హీరోయిన్. 
ఇబ్రహీంపట్నం నుంచి నాయినంపల్లి వెళ్లే మార్గంలో వినోభానగర్ ఉంది. అక్కడ పచ్చని చెట్ల మధ్య పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది ఓ ఆశ్రమం. జనజీవనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తుంది "మాతాపితరుల సేవాసదనం.' అనాథలుగా మిగిలిన వృద్ధుల పాలిటి అమ్మ ఒడి అది. అక్కడ చేరాలంటే కొన్ని షరతులు. అయినవారు ఎవరూ ఉండకూడదు. వీళ్లకు అందరూ ఉన్నారు. కానీ ఎవరూ లేరు. ఈ ఐదుగురు బామ్మలతో పాటు మరో ముగ్గురు వృద్ధులు కూడా అక్కడ అప్పుడు ఆశ్రయం పొందుతున్నారు.
అప్పుడే కలిశాను తనను.
గణ గణా గంట మోగింది. భోజన సమయం అయిందనడానికి అది సంకేతం. ఓ గదిలో మంచంపై లేవలేని స్థితిలో మూలుగుతూ పడుకొని ఉంది. ప్లేటులో భోజనం పెట్టుకుని వచ్చి ఆమెని లేపింది ఓ పెద్దావిడ. ఆమె భుజాలు పట్టుకుని మెల్లగా లేపి కూర్చొబెట్టింది. ముద్దలు కలిపి పెడుతూ ఆమె వద్దంటుంటే "ఇంకొంచెం.. ఇంకొంచెం' అంటూ కొసరింది. అయినా వద్దని చేతితో ప్లేటు నెట్టబోతే "తినకపోతే ఎలా? చస్తావ్!' అని కోప్పడింది.
ఆమె చనిపోకూడదు అని అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అనిపించింది. అందుకు ఒక నిజం మీకు చెప్పాలి.
ఆ ఆశ్రమ నిర్వాహకుడు నాకు చెప్పింది. ఈ కథనంలో రాయనిది.
నా నవలకు బీజం వేసినది.
ఆమె పేరు కనకమ్మ.
ఒకరోజు ఆ ఆశ్రమ నిర్వాహకుడు భాస్కర్ రావును పిలిచి. "ఇదిగో బిడ్డా ఇది నీ దగ్గర ఉంచు' అని ఇచ్చిందట.
తను చావుకు దగ్గరగా ఉందని ఆమెకే కాదు, ఆయనకూ అర్థమైంది.
"ఏంటిది? ఎందికిది?' అడిగాడట.
"దానికోసం ఒకరొస్తారు. లేదంటే కాస్టం మీద నా నోట్ల పెట్టు' అందట.
ఈ విషయం చెబుతున్నప్పుడు భాస్కర్ రావు కళ్లలో నీళ్లు చూశాను.
ఆ తడి..పుత్తడి.
అవును. ఆయన చేతిలో ఉన్నది చిన్న "బంగారం' బిళ్ల.
ఎవరీవిడ?
వచ్చే ఆ "ఒకరు' ఎవరు?
- - -
"ఆమె ఎక్కువ కాలం బతకదు'' గేటు దగ్గర చెబుతూ సెలవు తీసుకున్నారు పెద్దాయన.
ఆ సెలవు.. ఇప్పటికీ నా గుండెలో నెలవు.
ఆమె చనిపోయిందా? బతికుందా? అని ఈ ఐదేళ్లలో చాలాసార్లు లోలోపల అనుకున్నాను.
తెలుసుకోవడం పెద్ద పని కాదు.
కానీ ఆ నిజం నాకొద్దు.
తను బతికే ఉండాలి. ఇంకా బతికే ఉంది కూడా.
నా ఊహల్లో..
నా హీరోయిన్ గా..
కథలో రాజకుమారిలా.. ప్రేమగ మారి పిలిచింది..
కనకమ్మ.. నజియాగా మారింది.
ఆమె కోసం వచ్చే ఆ "ఒకరు'..
ఇప్పుడు ముంబై నుంచి బయలుదేరాడు..
కార్తీక్ రామస్వామి..

0 comments: