అనన్య పర్వం - ఒక నజియా కోసం.. నవల ముందుమాట

By | May 18, 2015 Leave a Comment

*Shall we meet today for lunch* 
ఒక మెసేజ్ ఎప్పుడో వచ్చి సెల్ ఫోన్ Inboxలో కూర్చుంది. 
ఎవరు పంపిండ్రో. ఊరు లేదు. పేరు లేదు. ఆలోచిస్తూ ‘but who r u ?’ రిప్లయి ఇచ్చా
‘ananya’ రిప్లె వచ్చింది. 
అనన్య? ఎవరీ అనన్య?? ఆరు సెకన్ల కంటే ఎక్కువ పట్టలేదు గుర్తు చేసుకోవడానికి. టక్కున తట్టింది. 
యస్.. అనన్య. షార్ట్ ఫిల్మ్ మేకర్. ముంబై.
మంచి సందేశంతో షార్ట్ ఫిల్మ్ తీసింది. నిర్భయ గురించి. రెండు వారాల క్రితం.. యూట్యూబ్లో చూశాను.
‘జిందగీ’కి స్టోరీ చేయాలనిపించింది. ఫేస్బుక్లో వెతికి పట్టుకుని, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. కానీ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాతి రోజు మెసేజ్ పెట్టాను. ఇంటర్వూ కావాలని.. ఇన్ బాక్స్ లో 
తెలియని అమ్మాయిలు వెంటనే రిప్లె ఇవ్వరు. అనుకున్నాను.. కానీ అనన్య ఇచ్చింది. 
‘థ్యాంక్యూ బాస్! మీ మెసేజ్ చూసి షాక్ అయ్యాను. అదేంటి నేను వెతుకుతున్న వ్యక్తి నాకే మెసేజ్ పెట్టారని. ఇట్స్ ఏ మిరాకిల్!’ అంది మెసేజ్లో. 
‘వాట్ నన్ను వెతుకుతున్నారా? ఆశ్చర్యంగా ఉందే! ఎందుకు?’ టెక్ట్స్ చేశా.
‘చెప్తా. బట్ ఇప్పుడు కాదు (స్మైలీ)’ 
ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఆ రోజు నుంచి నా ప్రతి పోస్టుకు లైక్లు, కామెంట్లు కొడుతూనే ఉంది. 
అప్పుడప్పుడు ఛాటింగ్ చేస్తూనే ఉన్నాం. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటర్వూ ఇస్తానంది. కానీ ఒక కండీషన్ మీద. అదేంటో ఇప్పటికీ చెప్పలేదు. తను నన్ను ఎందుకు కలుసుకోవాలనుకుంటుందో ఎంతకీ అర్థం కాలేదు. 
తన టైమ్ లైన్ లోకి వెళ్లి చాలాసార్లు చూశాను. ఫోటోస్ కూడా చూశాను.. ఒకటికి నాలుగుసార్లు. 
చాలా అందమైన అమ్మాయి. ఆల్ట్రా మోడ్రన్ గర్ల్. బోల్డ్ క్యారెక్టర్. ఓపెన్ మైండెడ్. తన ఎఫ్బీ పోస్టులు కూడా అలాగే ఉంటాయి. ఫేస్బుక్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారుగా. తన గురించి పెద్ద రీసెర్చే చేశాను. ఏదైనా యూనివర్సిటీ వారు చూసి ఉంటే గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చేవారేమో. 
రీసెర్చ్ ముచ్చట తర్వాత, తను రిప్లె గురించి ఎదురు చూస్తుందేమో ‘హే.. హాయ్ అనన్య! వెల్కమ్ టు హైదరాబాద్. ఎప్పుడొచ్చావ్?’ మెసేజ్ పెట్టా.
‘నిన్న ఈవెనింగ్. లంచ్ కి కలుద్దామా. డిన్నర్కా?’ అని వెంటనే బదులు.
అమ్మాయిలతో లంచ్ కంటే డిన్నర్ బావుంటుంది. కానీ నాకు ఆ అవకాశం కానీ, అదృష్టం కానీ లేవు. రావు. (కారణాలు అడక్కండి) అందుకే ‘లంచ్ కి’ అని స్మైలీ యాడ్ చేసి మాడిన మొఖంతో రిప్లె ఇచ్చాను. 
‘సో స్వీట్.. ఎక్కడ కలుద్దాం?’
‘నువ్వే చెప్పాలి?’- మీరూ, సారూలాంటి గౌరవవాచకాలు ఎప్పుడో పోయాయి మా మధ్య. అంత చాటింగ్ ఆల్రెడీ చేశాం. 
‘డిన్నర్కయితే నేను చెప్పేదాన్ని. లంచ్ కాబట్టి నువ్వే చెప్పాలి?’
డిన్నర్ అంటే పోయేదేమో.. అందమైన అమ్మాయితో డిన్నర్ చేసే అవకాశం పోగొట్టుకున్నాను.. అనుకుంటూ ‘సర్వీ.. నియర్ మై ఆఫీస్’ అని మెసేజ్ ఇచ్చాను. 
‘సర్వీ.. వేర్ ఈజ్ ఇట్’
‘రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్’
‘ఓకే.. ఐ విల్ సెర్చ్ ఇన్ గూగుల్. వీ ఆర్ గోయింగ్ టు మీట్ బై వన్ ఓ క్లాక్. యామ్ ఐ రైట్?’
‘హే.. యమ్మీ.. సూర్’
‘స్మైలీ’
‘స్మైలీ’
-
మొబైల్ పక్కన పెట్టి అద్దం ముందుకు వెళ్లా. నాకు నేనే కొత్తగా కనిపించా, పాత మొఖమే అయినా. సినీ తారల్ని ఇంటర్వూ చేసిన అనుభవం ఉంది. కానీ సినిమా స్టార్ లాంటి అమ్మాయితో లంచ్ చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు. అందుకే ఈ ఎగ్జయిట్మెంట్. 
పిచ్చి గడ్డం. ఎన్నడూ లేనిది ట్రిమ్మింగ్ చేసుకున్న. ప్రెష్అప్ అయ్యాక నాలుగైదు రకాల చొక్కాలు మార్చుకున్నా. 
ట్రిమ్మింగ్ చేయడం.. చొక్కాలు మార్చడం.. దువ్విన తలనే దువ్వడం.. మా ఆవిడ గమనించినట్టుంది ‘ఓర్నీ ఏశాలూ..’ అన్నట్లు ఎక్సెప్రెషన్ ఇచ్చింది. కాస్త అనుమానంగానే ఉంది ఆ చూపు. అది నాకు అవమానంగా అనిపించింది. అందుకే ఇక ఓ టీ షర్ట్ కు ఫిక్స్ అయిపోవాల్సి వచ్చింది. అది మా మార్క్ జూకెర్ బర్గ్ కు ఇష్టమైన టీషర్ట్.
సమయం పదయింది. 
ఇంకా 180 నిమిషాలు.. 10800 యుగాలు ఉంది.. తనను కలవడానికి. 
---
నేను నమస్తే తెలంగాణ దినపత్రికలో ఫీచర్స్ పేజీ ‘జిందగీ’ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాను. రేపు జిందగీలో ఫ్యాషన్ పేజీ. అందుకే ఈ రోజు పెద్దగా ఒత్తిడి ఉండదు.
‘నేను రావడానికి సమయం పట్టొచ్చు. పేజీ చూసుకోండి’ అని మా టీమ్‌కు చెప్పి బయలుదేరా. ‘సర్వీ’ దగ్గర డ్రాప్ చేయడానికి అజ్జూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు.వాడు నా తమ్ముడు. ఆఫీసులో.. బయటా.
‘నేను బయలుదేరా’ అనన్యకు మెసేజ్ పెట్టాను. అజ్జూ సర్వీ దగ్గర నన్ను దించి తిరిగి బయలుదేరాడు. అక్కడ కార్ పార్కింగ్‌కు కాస్త ప్రాబ్లమ్ ఉంటుంది. తను ఎక్కడ పార్క్ చేస్తుందో ఏమో. ముందే చెప్పాల్సి ఉండె. అయినా హైదరాబాద్‌లో అమ్మాయిలు వెహికిల్ పార్కింగ్ గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సి ఉండదు.
‘15 మినిట్స్’ అని అనన్య నుంచి 15 నిమిషాల క్రితం వచ్చిన మెసేజ్ చూసి ‘వెయిటింగ్ ఫర్ యు. థర్డ్ ఫ్లోర్, నంబర్ 5’ అని రిప్లయ్ ఇచ్చా.
‘లిఫ్ట్.. ఫస్ట్ ఫ్లోర్’ రిప్లయ్ వచ్చింది.
అది నా గుండె వేగం పెంచింది. నేను ఎంట్రన్స్ డోర్ వైపే చూస్తున్నా. కాస్త టెన్షన్‌గా ఉంది. ఎందుకలా ఉందో నాకే అర్థం కాలేదు. వాష్‌రూమ్‌కు వెళ్లి అద్దంలో నాకు నేను ‘కంట్రోల్’ చెప్పుకున్న.
‘కూల్ బేబీ కూల్.. 1..2.. 3..’ అని నంబర్లు లెక్కబెట్టుకుంటూ టేబుల్ దగ్గరికొచ్చి కూర్చున్న.
తను ఈపాటికే వచ్చి కూర్చుందేమో అనుకున్న. ఇంకా రాలేదు.
ఎంట్రన్స్ వైపు చూశాను. తను అప్పుడే గ్లాస్ డోర్ దగ్గరికి వచ్చింది. బ్లూ జీన్స్ మీద వైట్ టాప్ వేసుకుంది. మఫ్టీలో వచ్చిన దేవకన్యలా.. గాగుల్స్ పెట్టుకున్న గాంధర్వ కన్యలా ఉంది. బేరర్ డోర్ తెరిచాడు. వెధవ. నేను వచ్చేటప్పుడు పట్టించుకోలేదు. నేనే డోర్ నెట్టుకుని వచ్చా. తనతో వస్తే నన్నూ వేరేలా ట్రీట్ చేసేవాడేమో.
తను లోపలికి వచ్చి కళ్లజోడు తీసి హాల్ అంతా కలియ చూస్తున్నది. 
ఇంతలో మేనేజర్ పరుగున ఆమె దగ్గరకు వెళ్లాడు.
‘కాన్ ఐ హెల్ప్ యు మేమ్?’ అన్నాడు.
నేను అప్పటి వరకు టేబుల్ మీద చేతులు పెట్టి కూర్చున్నాను. తనని చూడగానే వెనక్కి ఆనుకున్నాను. కాలు మీదికి కాలు, చేతిలోకి మొబైల్ వాటంతట అవే వచ్చాయి. ఎవరికైనా కాల్ చేయాలనిపించింది.ఎందుకోతెలియదు. కానీ ఎవరికీ?
ప్రవీణ్ నంబర్ కనిపించింది.డయల్ చేశా.
మేనేజర్‌తో ‘టేబుల్ నంబర్ 5’ చెప్పింది అనన్య.
మేనేజర్ నా  వైపు చూపించాడు.
‘ఇడియట్. వీడేమో ఫోన్ తీయడం లేదు. లిఫ్ట్ చెయ్యరా బాబు.. తను వస్తోంది..’ అని మనసులో అనుకుంటూ అనన్య వైపు చూస్తున్నాను.

తను టేబుల్  వైపు, ఆ తర్వాత నా వైపు చూసింది. స్మైల్ ఇస్తూ.. అడుగు ముందుకు వేసింది. దాంతో పాటే ప్రవీణ్ లిఫ్ట్ చేశాడు. థ్యాంక్ గాడ్!
నేనూ స్మైల్ చేస్తూ.. ‘యా ప్రవీణ్.. ఏం జరుగుతోంది?’ అని అడిగాను.. స్మైల్ ఇవ్వడం సహజం. స్మైల్ చేయడం కృత్రిమం.
‘అన్న! పేజ్ నడుస్తుందన్న’ అన్నాడు ప్రవీణ్.
‘ఓకే.. కంటెంట్ ఏం పెడుతున్నారు’- ఈ వాక్యం చివరలో ప్రశ్నార్థకం పెట్టాలో, ఆశ్చర్యార్థకం పెట్టాలో అర్థం కాలేదు. ఆ వాక్యాన్ని అలా వాడాను. నా పరిస్థితి అలాంటిది మరి.
‘అన్నా! చెప్పినవ్ గా ఫ్యాషన్ పేజీగద.. ఏముందన్న అయిపోతది..’
అనన్య దగ్గరికి వచ్చి ‘ఏఁ.. హాయ్’ అంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చింది.
నేను కనుబొమ్మలతో హాయ్ చెప్తూ లేచాను.. తను చిన్న హగ్ ఇచ్చింది..
ట్రాన్స్‌ఫార్మర్‌ని వాటేసుకున్నట్లు షాక్ కొట్టింది.
‘ప్ర...వీ...ణ్..’ పిలుపు లయ తప్పింది.
‘అ...న్న..’ వాడూ నన్ను అనుకరించే ప్రయత్నం చేశాడు.
‘ఒక్క నిమిషం’
‘అన్న’
‘గ్లాడ్ టూ మీట్ యు.. ప్లీజ్ బీ సీటెడ్’ అనన్యకు కుర్చీ చూపించా. పిచ్చి మర్యాద కాకపోతే తనకు తెలియదా.. కుర్చీ ఉందని.. కూర్చోవాలని. ‘థ్యాంక్యూ’ అంది కూర్చుంటూ.
‘ప్రవీణ్’
‘అన్న’
‘ఒక్క నిమిషం రా’
‘అన్న’...
వీడికి రచయిత ఎందుకో ఈ సన్నివేశంలో ఈ ఒక్క పదమే ఎక్కువసార్లు రాశాడు. 
‘వన్ మినిట్ ప్లీజ్’ ఫోన్ మూస్తూ అనన్యని రిక్వెస్ట్ చేశా.
‘యా షూర్’ అంది తనూ ఫోన్ తీస్తూ. తన ముంగురులు మొఖం మీదికి వచ్చాయి. కుడిచేత్తో నుదుటి మీంచి ఎడమ చెవి వెనకాలకు తోస్తూ.. నా వైపు చూసింది. తన కుడిచేతికి టర్కోసీ బ్రేస్‌లెట్ గమనించాను.
‘ప్రవీణ్!’
‘అన్న’
‘అదీ.. యా.. ఏం పెడుతున్నరు?’
‘అన్నా..’
‘అదేరా పేజ్‌లో ఏం పెడుతున్నరు’
‘తెల్సుకదన్న..ఫ్యాషన్ బొమ్మలు’ కాస్త చిరాకు పడ్డట్టు అనిపించింది.
‘ఆ. ఓకే ఓకే. నేను వచ్చే సరికి లేట్ కావొచ్చు. ఇంపార్టెంట్ పర్సన్‌తో మీటింగ్. పేజ్ జాగ్రత్తగా చూస్కోండి.. కంటెంట్, డిస్‌ప్లే, కలర్స్, బ్యాలెన్సింగ్..హెడ్డింగ్స్.. లీడ్.. అన్ని జాగ్రత్తగా చూస్కోండి’ రెండో వాక్యంలో మొదటి రెండు పదాలు నేను కాస్త గట్టిగా పలకడం తను గమనించిందో లేదో.
ప్రవీణ్ మాత్రం  ‘ఓకే అన్న’ అని ఫోన్ పెట్టేశాడు. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా.
అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యడానికి అబ్బాయిలు ఇలాంటి అనవసరపు బిల్డప్‌లు ఇస్తారని తెలుసు. కానీ నేనూ అలా చేస్తానని నాకే తెలియదు. సహజంగానే మగాడి హార్మోన్స్ అలా పనిచేస్తాయేమో. 
ఫోన్ పక్కన పెడుతూ ‘సారీ అనన్య.. ఎనీవే గ్లాడ్ టూ మీట్ యూ’ అన్నాను. ఎంత అమ్మాయి అయినా ఇన్నిసార్లు గ్లాడ్ టూలు అవసరం లేదేమో.
ఫోన్ హ్యాండ్‌బ్యాగ్‌లో పెడుతూ ‘నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇవ్వాళ. మిమ్మల్ని ఇలా కలవడం..’ అంది అనన్య.
ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో పెడుతూ... ‘‘నిజంగా చాలా హ్యాపీగా వుంది ఇవాళ.. మిమ్మల్ని కలవడం’’ అంది అనన్య.
మిమ్మల్ని.. ఈ పదం ఎందుకో నాకు ఇబ్బందిగా.. ఇబ్బంది కూడా కాదు.. దీనికి అటు ఇటు పదం నిఘంటువులో వెతకాలేమో? మనుషులు దగ్గరయినప్పుడు సాన్నిహిత్యం దూరం అవుతుందా? - ఈ సందేహంతోనే ‘థ్యాంక్యూ’అని చెప్పేశా. 
’ఎందుకు?’ అడిగింది ఆశ్చర్యపోతూ. 
’మిమ్మల్నీ... అన్నారుగా.. అందుకు?’ మిమ్మల్ని అనే పదం నొక్కి మరీ చెప్పాను. 
‘సారీ.. మరి నువ్వు.. అన్నారూ...’ రూ...ని చాలాసేపు సాగదీసింది. కొంచెం గ్యాప్ తీసుకున్నాక ‘సరే చెప్పు’ అంది. 
‘మీరే చెప్పాలి.. సారీ నువ్వే చెప్పాలి’
‘ఇంటర్వూ అడిగింది నువ్వు’
‘అడిగింది నేనే. కానీ కండీషన్స్ అప్లై అన్నది నువ్వు కదా. ఇంతకీ ఏంటా కండీషన్?’
‘కండీషన్ కాదు.. కంపల్సరీ.. ఇట్స్ ఏ నెసెసిటీ..’
‘తప్పనిసరియా.. ఏంటది? ల్యాగ్ అయిపోతోంది అనన్య, కొంచెం స్ట్రెయిట్గా మాట్లాడుకుందామా?’
‘ఇదిగో! నీకు స్ట్రెయిట్గానే కూర్చున్నాగా..’ తను జోక్ వేశాననుకుంది. కానీ నా ముఖకవళిక గమనించి. ‘ఓకే బాబా.. అర్థమైంది.. చెప్తాను గానీ.. ముందు ఆర్డర్ చెప్పు.. బేరర్ అప్పట్నించీ మనల్ని తినేలా చూస్తున్నాడు’ అంది. నేను పిలిచి చెప్పేలోపు.. ‘హైదరాబాద్ వస్తే బిర్యానీనే కదా.. కొత్తగా ఆర్డర్ ఇచ్చేదేముంది?’ అని తనే ఆర్డర్ ఇచ్చి.. మొదలెట్టింది. 
‘హుం.. చూడు బాస్! అసలు విషయానికి వస్తున్న. మ్యాటర్ ఏంటంటే.. నువ్వొక స్టోరీ రాయాలి. నా గురించి కాదు. నా ఫ్రెండ్ గురించి. ఇదే కండీషన్’
‘స్టోరీనా.. తప్పకుండా.. ఎవరా అమ్మాయి?’
‘అమ్మాయి కాదు.. అబ్బాయి.. కార్తీక్ రామస్వామి’
‘అబ్బాయా! అయ్యో మాది మహిళల పేజీ కదా’
‘నేను అడిగేది నీ జిందగీ పేజీలో రాసుకోవడానికి కాదు’
‘ఒక కథ. కార్తీక్ కథ. అది రాయాలి. పుస్తకంగా..’ అంది రెండు చేతుల్తో జుట్టు సర్దుకుంటూ. అప్పుడు తన మెడలో వేలాడుతున్న ఆభరణానికి రెండు పెండెంట్స్ ఉండడం గమనించాను. ఆ గొలుసు తన బ్రేస్లెట్కి మ్యాచింగ్గా ఉంది. 
‘పుస్తకమా? నేనా??’ ఊహించని పరిణామం ఎదురైనప్పుడు కలిగే ఆశ్చర్యంతో తాలూకు అనుభూతి కలిగిన అనుమానంతో అడిగా సంతూర్ మమ్మీలా. ‘నేనా.. కాలేజా?’ అన్నట్లు. 

‘అరవై ఆరేళ్ల తర్వాత ఒక ఉత్తరం తిరిగి వస్తుంది. ఒక తాత తన ప్రేయసికి రాసిన ఉత్తరం అది. ఎవరావిడ తెలుసుకునేందుకు మనవడు బయలుదేరతాడు.. ఇదీ స్టోరీ లైన్ దీన్ని ఒక నవలగా రాయాలి’
‘నవలా? ఏం మాట్లాడుతున్నావ్ తల్లీ. నేనేదో జిందగీ పేజీకి రాసుకుని బతికేటోన్ని. నాకెందుకు చెప్పు ఈ నవలలు, కథలు..’
‘అవును.. మరి. మీకెందుకు ఈ కథలు.. అపరిచితులు కదా మీరూ..’ దీర్ఘం తీసింది చివరి పదాలు. గౌరవవాచకం కూడా కలిపింది. 
‘అపరిచితులు?’ ఇది ఎక్కడో తడుతోంది. 
‘అవును అపరిచితులు.. వంగూరి పౌండేషన్ ఆఫ్ అమెరికా.. అపరిచితులు..’ అంది.
‘ఓ.. అదా? అది నేను రాసిన మొదటి కథ. అదొక్కటే రాశా. ఆ తర్వాత ఎప్పుడూ రాయలేదు’ అన్నా నేనేదో తప్పు చేసినట్లు. 
‘తెలుసు. మొదటి దానికే అవార్డ్ వచ్చింది కదా. యువతరం విభాగంలో. ఇంటర్నేషనల్ అవార్డ్! అందుకే కనెక్ట్ అయ్యా’ అంటూ బ్యాగ్లోంచి ఓ ఫైల్ తీసింది. తను తీస్తున్నపుడు మెడలో వేలాడుతున్న పెండెంట్స్లో ఒక దానిపై ‘ఏ, రెండో దానిపై ‘ఎన్’.. అనే ఆంగ్లాక్షరాలు గమనించా.
‘అప్పటి నుంచే నిన్ను గమనిస్తున్న. ఐదొందలకు పైగా వ్యాసాలు.. మూడొందల మంది జీవితాలు.. 140 ఎపీసోడ్లు.. మూడు స్పెషల్ కాలమ్స్.. 36 కవర్ స్టోరీలు.. ఒక కథ.. ఒక అవార్డు.. ఎన్నో రివార్డులు.. చివరగా ఒక పుస్తకం.. అదీ వర్షన్ టు పాయింట్ జీరో కూడా.. తొమ్మిదేళ్ల జర్నలిజంలో ఇదీ నువ్వు చేసింది. చూశావా నీ మీద పెద్ద రీసెర్చే చేశా కదా. ఈ ఫైల్ ఏదైనా యూనివర్సిటీ వాళ్లకు ఇస్తే నాకు గౌరవ డాక్టరేట్ కూడా ఇస్తారేమో’ అంది నవ్వుతూ. 
గౌరవ డాక్టరేట్.. ఈ డైలాగ్ నాదే. నాకు రెండు నిమిషాల నుంచి డైలాగ్ లేదని అర్థమైంది. అందుకే ‘ఎందుకు ఇదంతా?’ అని అడిగా.
‘ఒక అన్వేషణ.. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుంది.. న్యూటన్ మూడో సూత్రం. కార్తీక్ ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. దాని ప్రతిచర్యగా నజియా దొరికింది. కార్తీక్ నాకు కలిశాడు. దాని పర్యవసానం నువ్వు దొరికావ్. నేను నిన్ను కలిశాను. దాని పరిణామంగా.. ఒక పుస్తకం కావాలి’తను కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్తున్నది. 
నేను ఒక నిట్టూర్పు శ్వాస వదిలిన తర్వాత ‘చూడమ్మాయ్.. నువ్వు ఏదైనా చెప్పుగానీ. ఈ కథలు, పుస్తకాలు నా వల్ల కాదు. నేను, నా జిందగీ, నా గూగుల్ గాడు.. ఇది చాలు నా జీవితానికి..’
‘మరి ఎందుకు రాశావ్ ఆ కథ?’ నిందిస్తుందో.. నిలదీస్తోందో అర్థం కాలేదు. 

‘అదీ.. ఏదో సందర్భంలో అపార్ట్మెంట్ కల్చర్కు కనెక్ట్ అయి రాశాను. ఇప్పుడు చెప్పనా? నువ్విలా న్యూటన్ మూడో సూత్రం పట్టుకుని వస్తావని తెలిస్తే అసలు రాసేవాడ్నే కాదు. నాకంత టైమ్ ఉండదు.. తెలుసా?’
‘టైమ్.. కరెక్టే.. ఫేస్బుక్ గైడ్ అనే పనికిరాని పుస్తకం రాయడానికి కూడా టైమ్ ఉండదు.. కదా’ పెదవి విరిచింది. 
పనికిరాని పుస్తకం- తను నన్ను టెంప్ట్ చేయాలని చూస్తోంది. రెచ్చగొడితే రెచ్చిపోయే రకం కాదు నేను. విగ్రహంలాంటి నిగ్రహం.. దీనికి పర్యాయపదంగా నా పేరు రాసుకోవచ్చు. 
‘అదేం పనికిరాని పుస్తకం కాదు. యుటిలిటీ వ్యాల్యూ ఉన్న పుస్తకం’ చెప్పా మొఖం తిప్పుకుంటూ. 
‘తెలుసు. సారీ.. పనికిరాని పుస్తకం అన్నందుకు. అంతలా ఆదరణ ఉంది కాబట్టే వర్షన్ టు పాయింట్ జీరో అని కూడా వేశారుగా.. అదేదో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినట్లు..’ తను పొగుడుతోందో తిడుతోందో అర్థం కావట్లేదు.
‘అదేదో.. సరదాగా..’ నేను చెప్పబోతుండగానే.. పదాల మధ్య కామాలా దూరి ‘వర్షన్ 3.0 కూడా రాస్తావా?’ అంది. అది హేళనో, ఇంకేదో.. ప్రతిసారి ప్రాస దొరకదు మరి. 
‘ఏమో.. రాస్తానేమో.. మా బంగారం మాష్టారు అడగాలే గానీ.. ఫోరు.. ఫైవ్ కూడా రాస్తానేమో’
‘అవునా? బంగారం! మీ బంగారం.. మరి ఈ బంగారం కోసం రాయలేవా? రాయకూడదా?’ తను అమాయకంగా అడిగింది. తన మొఖం చిన్నప్పుడు ‘ఇంకో ముద్ద తిను నాన్నా’ అంటూ గోరుముద్దులు తినిపించిన మా అమ్మ మోములా కనిపించింది. 
కనిపించిందో, అనిపించిందో తెలియక నవ్వాను ముసిముసిగా. ఆ తర్వాత గట్టిగా. పట్టరాని ఆనందం తాలూకు నవ్వు అది. కానీ నేనేం ఆనందంగా లేను. పైగా ఈ అమ్మాయి నా మీద ఏదో కుట్ర పన్నుతోంది. అది తన నవ్వులో కూడా కనిపిస్తున్నది. 
బేరర్ బిర్యానీ తెచ్చాడు. మధ్య మధ్యలో వచ్చి ఓసారి గ్లాసులు, ఇంకో సారి ప్లేటు.. మరోసారి ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలు పెట్టి వెళ్లాడు. బిర్యానీ వడ్డిస్తున్నప్పుడు అనన్య ఫైల్ తన ఎడమ వైపు కుర్చీలో పెట్టింది. దాన్ని ఎవడైనా ఎత్తుకెళ్లి పోతే బాగుండు అనిపించింది. 
‘మనం తింటూ కూడా మాట్లాడుకోవచ్చు’ అంది నేను మౌనంగా రెండు ముద్దలు తిన్న తర్వాత.
నేను తన వైపు చూసి స్మైల్ చేశాను. 
తను ఒక సిప్ మంచినీళ్లు తాగి గ్లాస్ పక్కన పెడుతూ ‘ఒక విషయం చెప్పనా?’ అంది. 
‘చెప్పు’ అన్నట్లు తల ఊపి తనవైపు చూశాక గ్లాస్ వైపు చూశాను. తన లిప్ స్టిక్ కాస్త దాని అంచున అంటుకుంది. 
‘నీ బ్లాగ్, ఫేస్బుక్, గతంలో రాసిన ఆర్టికల్స్.. అన్నీ చదివాను. వాటి నుంచే ఈ కథ రాయడానికి నువ్వే కరెక్ట్ అనిపించింది’ మళ్లీ మొదలెట్టింది. 
‘నేనే ఎందుకు? కథలు, నవలలు రాసేవారు వేరే ఉన్నారుగా, చాలామంది. చాలా గొప్ప రచయితలు..’
‘ఉన్నారు. లేరని నేనట్లేదు. కానీ సంతూరు సబ్బు కోసం పొరుగూరు వెళ్లం కదా మనం. జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. కానీ నేను నిన్నే ఎందుకు అడుగుతున్నాను?’
‘అవును ఎందుకు అడుగుతున్నావ్?’ సంతూరు, పొరుగూరు అదేంటో అర్థం కాక అడిగాను.

కుర్చీలోంచి ఫైల్ తీసి మీద పెట్టింది. ఎడమ చేతితో దాంట్లోని ఒక పేపర్ క్లిప్పింగ్ చూపిస్తూ.. ‘ఫీనిక్స్ జ్యోతి.. ఈమె గురించి చాలామంది చాలాసార్లు రాసి ఉండొచ్చు. కానీ నువ్వు రాసిందే రీప్రింట్ ఎందుకు వేశారు. పది వేల కాపీలు.. అంతకు ముందు సాక్షిలో కూడా రాశారు కదా.. వాళ్లనెందుకు ఆడగలేదంటావ్ ఆ వందేమాతరం పౌండేషన్ వాళ్లు’ 
వందేమాతరం ఫౌండేషన్, రీప్రింట్.. ఈ విషయాలు తనకెలా తెలుసో అర్థం కాలేదు. అవి కాన్ఫిడెన్షియల్ కదా? ఇక్కడ సందేహం తీర్చుకోవడం కంటే ముందు సమాధానం ఇవ్వాల్సి ఉంది. పరిస్థితి అలాంటిది. అందుకే ‘అది వేరు.. అది ఫీచర్స్ స్టోరీ. కావాలంటే కార్తీక్ కథతో ఆలాంటి ఫీచర్ స్టోరీ చేస్తా’
‘రాస్తావ్. మీ పేపర్లో. బట్.. టుడేస్ న్యూస్పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. నువ్వు నీ ఫీచర్ చూస్తున్నావ్. నేను ఫ్యూచర్ చూస్తున్న’
వేస్ట్ పేపర్ అనడం ఎక్కడో తగిలింది. హర్ట్ అయ్యా. నా నోట మాట రాలేదు. నోట్లోకి బిర్యానీ కూడా వెళ్లడం లేదు. 
‘చూడు నాగ్. ఎవ్రీ లవ్ స్టోరీ ఈజ్ బ్యూటీఫుల్, బట్ అవర్స్ ఈజ్ మై ఫేవరెట్. చాలా ప్రేమకథలుంటాయి ఈ ప్రపంచంలో. కానీ అది మనదైనప్పుడు.. మనవాళ్లదైనప్పుడు ఆ కిక్కు.. థ్రిల్లు.. ఆ ఫీలింగే వేరు. చాలా గొప్పగా ఉంటుంది. ఇదీ అలాంటి కథే. ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగ్గ పోరాటం.. తెలంగాణ సాయుధ పోరాటం.. అలాంటి ఉద్యమ నేపథ్యమున్న ప్రేమకథ మరుగున పడిపోకూడదు. నువ్వు ఫీచర్ రాయి. కాదనను. కానీ ప్రతి ఏడాది వాలైంటెన్స్ డే రోజు పబ్లిష్ చేసే ప్రేమకథల్లో ఒకటిగా ఇది మిగిలిపోకూడదు.. ఒక పుస్తకంగా.. వీలైతే.. ఓ సినిమాగా.. రావాలి. అదీ నా తపన’
‘పుస్తకం.. సినిమా? రాయొచ్చు కానీ.. ’ తను బిర్యానీ కంటే వేగంగా నన్నే తింటోంది.. నా మాట పూర్తి కాకుండానే మళ్లీ మొదలెట్టింది. ఫైల్ చూపిస్తూ.. 
‘ఇదిగో ఇక్కడ చూడు.. ఇక్కడి వాళ్లు ఎందుకు రాయడం లేదో. రాసిన కథని ముట్టుకోకుండా.. వంద.. వంద కథలు రాసుకోవచ్చు అన్నారు విజయేంద్ర ప్రసాద్. ఎస్ఎస్ రాజమౌళి వాళ్ల డాడీ.. ఇది చదివినప్పుడు నీకేం అనిపించలేదా నాగ్? ఈ ఇంటర్వూ మీ జిందగీలోనిదేగా?’ తను తినడం ఆపి చాలా సేపైంది. ప్రతి దానికి ఫైల్లో ఓ ప్రూఫ్ చూపిస్తోంది. సమాధానం ఇవ్వడం తప్ప వాదనకి నాకు అవకాశం లేదని, అవసరం రాదని అర్థమవుతోంది.. 
‘అనిపించింది. కానీ కథ రాయడానికి.. చాలా ఉండాలి. సబ్జెక్టుతో కనెక్ట్ అవ్వాలి. అందుకు బాడీలో ఓ ఎలిమెంట్ ఉండాలి. అది బల్బులో ఫిలమెంట్ లాంటిది. ఫిలమెంట్ ఉంటేనే బల్బు వెలుగుతుంది. ఎలిమెంట్ ఉంటనే కథ బావుంటుంది’
‘అంటే.. నాకర్థం కాలేదు’ తను మళ్లీ తినడం మొదలెట్టింది. బిర్యానే. 
‘ఐ మీన్.. నువ్వు చెప్పే కథ.. ఈ పోరాటాలు.. ఉద్యమాలు.. గతం.. చరిత్ర.. ఇవన్నీ యాంటిక్ సబ్జెక్ట్స్.. ఓ ఆరవై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. నేను కాంటెంపరరీకే ఎక్కువ కనెక్ట్ అవుతా. సింపుల్గా చెప్పాలంటే.. నేను యాంటికిటీ ఫుల్ బాటిల్కు కనెక్ట్ అయినంతగా.. ఈ యాంటికిటీకి అవ్వలేను. 
‘అంటే రాయడం ఇష్టమే.. కానీ ఈ సబ్జెక్ట్ రాయడం ఇష్టం లేదన్నమాట..’
‘నాట్ లైక్ దట్..! మేబీ.. ఇంచు మించు అంతే’
‘లేదు.. నువ్వు కనెక్ట్ అవుతావ్’
‘ఎలా చెప్పగలవ్..?’ 
‘చెప్తా చెప్తా’ తను ఫింగర్ బౌల్ కోసం ఎదురు చూస్తూ.. ‘అయ్యావ్.. రాశావ్ కూడా.. రాణీ రుద్రమ నుంచి.. వీరనారి సిరీస్. అంతకుముందు వాహ్ హైదరాబాద్.. ప్యారానా పూల్.. ముచ్కుందా.. ఆపరేషన్ సెప్టెంబర్ 17.. ఇలా చాలా ఉన్నాయ్. ఇంతకు మించి ఏం చెప్పాలి? అందుకే నువ్వు చెప్పే సోకాల్డ్ ఎలిమెంట్ నీలో ఉందని అంటున్నాను..
ఫింగర్ బౌల్లో చేయి పెడుతూ ‘సోకాల్డ్?’ అన్న కాస్త గట్టిగానే.
‘కనెక్ట్ అవుతావని ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటావా?’ అంది తను టిష్యూ తీసుకుంటూ.
ముందు ఇష్యూ క్లోజ్ అవ్వాలని.. ‘ఓకే.. తప్పకుండా’ అన్నాను.
‘ప్రామిస్..?’ అంది చేయి చాస్తూ.
‘ఈ ప్రామిస్లు ఎందుకుగానీ.. చెప్పు’ - ఏం ప్రూఫ్ తెచ్చిందో ఏంటో ఈ మహంకాళమ్మ.
‘మనం ఇక్కడికొచ్చి ఆఫెన్ హవర్ అయింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడు.. చెయిర్స్.. గ్లాసెస్, బౌల్స్, ప్లేట్స్.. ఇన్ని ఉన్నాయ్ కదా. ఇక్కడ బ్యూటీఫుల్ ఫ్లవర్ వాజ్ ఉంది. అక్కడ చూడు సాలిడ్ డిజిటల్ క్లాక్ ఉంది.. కానీ నువ్వు అప్పటి నుంచి ఆ మూలనున్న ఆ హుక్కానే.. ఎందుకు చూస్తున్నావ్.. 30 నిమిషాల్లో 49 సార్లు.. ?
‘ఆశ్చర్యం.. అంతకు మించి ఇంకేదో! 49 సార్లు నిజమో కాదో తెలియదు. కానీ, నేను నిజంగానే దాన్ని చూస్తున్నాను. ఈ విషయం పైకి చెప్పలేకపోయినా, లోపల అర్థమవుతోంది. నిజమే.. అనన్య తర్వాత ఇక్కడ నన్ను ఆకట్టుకున్నది.. అదే. బాల్యమిత్రుడు బార్లో కలిసినట్లు.. ఏదో గొప్ప ఫీలింగ్. మళ్లీ హుక్కా వైపు చూశాను. తన లెక్క ప్రకారం 50వ సారి. అంతకంటే ఎక్కువసార్లు తనని చూశానని తను గమనించలేదా?
ఒక కన్ఫ్యూజన్.
మనుషుల్ని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి.
తను నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసేసింది. దాని నుంచి ఓ క్లారిఫికేషన్ వచ్చింది. కనెక్ట్ అయ్యాను.
తననే చూస్తున్నాను. కళ్లలోకి సూటిగా.
తనూ అలానే చూస్తూ ‘చెప్పు’ అంది.
ఏం చెప్పాలి. ఎలా చెప్పాలో తెలియక చూపుతిప్పుకున్న. తల తిప్పుతున్నప్పుడు నా చూపు తన పెండెంట్స్ మీద పడ్డాయి. ‘యా.. ఇందాకటి నుంచి అడుగుదామనుకుంటున్నాను.. ఆ రెండు పెండెంట్స్లో.. ఏ ఫర్ అనన్య కావొచ్చు.. మరి ఎన్ అంటే..?’ అడిగాను కొత్త అనుభూతిలో విహరిస్తూ.
‘ఎన్ ఫర్.. ఎన్ ఫర్.. నగేష్ బీరెడ్డి..’ అంది. ‘హ హ హా..’ అని నవ్వింది.
‘ఎందుకా నవ్వు’ అని అడగాలన్న ప్రశ్న నాలో ఉదయించేలోపు పెండెంట్ తీస్తూ.. ‘కాదు.. ఎన్ ఫర్ నజియా.. కార్తీక్ రామస్వామి అన్వేషణ.. ఈ నజియా కోసమే.. ఇప్పటి వరకు ఈ బరువు నా మీద ఉండె.. ఇప్పుడు ఆ బాధ్యత నీ చేతిలో పెడుతున్నా’ అంటూ నా కుడిచేయి లాగి అరచేతిలో పెట్టింది. ‘చెప్పు. ఎలిమెంట్ దొరికిందా?’ అంది.. నా చేయి మూసి తన చేతితో కప్పుతూ.
తను భారం దించుకుంది. నా మనసు బరువెక్కింది. 

‘చెప్పనా?’ తన చేయిపై నా ఎడమ చేతిని వేసి.. తన కళ్లలోకి చూస్తూ ‘ఆభరణాల్ని అవయవాలుగా భావించే ఆడవారు.. అవి మనకు ఇస్తున్నప్పుడు కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా?’ అని అడిగాను.
‘ఇలాగే ఉంటుంది. చాలా గొప్ప అనుభూతి ఇది. తల్లి చనుబాలు.. భార్య మురిపాలు.. వేర్వేరు. కానీ దేనికదే ప్రత్యేకం. ఇదీ అలాంటి మరో ప్రత్యేక సందర్భం’ తన మౌనంగా మాట్లాడుతోంది కళ్లతో. తన మనుసు నుంచి ఈ మాటలు నా గుండెకు చేరాయి. చేతుల మీదగా. మధ్యలో నజియా ఉంది. తన కోసం మా ఈ చారిత్రక భేటీని అరచేతుల మధ్య చీకట్లోంచి చూస్తున్నది.
‘కార్తీక్ రామస్వామిని ఎప్పుడు పరిచయం చేస్తున్నావ్?’
‘చేస్తా.. థ్యాంక్యూ నాగ్. నేను నమ్మాను. నువ్వు రాస్తావని. నేను రాయించగలనని. ఆ హుక్కా వెలిగిస్తే కిక్కొస్తది.. నిన్ను రగిలిస్తే బుక్కొస్తది.. తెలుసు నాకు.. ’ తను నవ్వింది.. హుక్కా వైపు.. నావైపు చూస్తూ. ఇద్దరిది ఇంచుమించు ఒకే నవ్వు.
సుఖాంతంగా ముగిసే సినిమాలో శుభం కార్డు పడే ముందు నటీనటులంతా కలిసి నవ్వుతున్నట్లు ఉంది మా నవ్వు.
-
రింగుల జుట్టు, మాసిన గడ్డం, బోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు, ఖద్దరు కుర్తాలో చాలా సాదాసీదాగా ఉన్న కార్తీక్ రామస్వామిని కలిశాను. ముంబైకి చెందిన ఒక కోటీశ్వరుడి కొడుకంటే నమ్మలేదు నేను. తన కథ చెప్పాక నమ్మక తప్పలేదు. నజియా కోసం తన అన్వేషణను ఇక తనే మీకు చెబుతాడు. కార్తీక్ చెప్పే కథ పక్క పేజీలో మొదలవుతుంది. తనతో కలిసి మీరూ ప్రయాణం చేస్తున్నందుకు కృతజ్ఞతలు.

0 comments: