గమ్యం కాదు.. ఆ ప్రయాణం ఆస్వాదిద్దాం! The journey of LB sriram’s Heart films

By | July 10, 2016 Leave a Comment

నదీ ప్రవాహంలోకి కొత్త నీరు వచ్చినప్పుడు పాతనీరునూ కలుపుకొని పోతుంది. పాతని నెట్టేసి కొత్తది ముందుకు పోలేదు. ఈ రెండింటి మధ్య తరాల అంతరం ఉంది. నిన్నటి తరం ఒంటెద్దు బండిలో వెళ్తున్నది. ఈ తరం కారు వేగంలో వెళ్తున్నది. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కట్ అయిపోతోంది. దూరం అంతకంతకూ పెరిగిపోతున్నది. ఆ తరమైనా ఈ తరమైనా కొత్తను పట్టుకోవాలి. పాతను పట్టుకెళ్లాలి అంటారు ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరాం. కడుపు నింపుకోవడానికి ఆయనింకా కమర్షియల్ సినిమాలు చేస్తున్నా.. మనసు నింపుకోవడానికి తనకు తాను ఇంకేదో చేయాలని ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ పేరుతో ఎల్బీ శ్రీరామ్ షార్ట్ (హార్ట్) ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈ తరం ఆయన బండి ఎక్కలేదు. అందుకే కలిసి వెళ్లొచ్చు.. వేగంగా వెళ్లొచ్చు.. భావాలూ పంచుకోవచ్చు అని ఆయనే మన కారు ఎక్కి కూర్చున్నారు. గమ్యం కాదు.. ఆ ప్రయాణం నాకిష్టం అంటున్నారు. ఏమిటా ప్రయాణం?

నమస్తే అండీ! కావడి బద్ద వదిలేసి టీషర్టు వేసుకుని కారెక్కారు.. ఎలా ఉంది ప్రయాణం?

నమస్తే! బావుంది. అనుకున్నదానికంటే పదిరెట్ల ఉత్సాహంగా కూడా ఉంది.

రచయితగా.. నటుడుగా.. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు ఉన్న మీరు ఇంటర్‌నెట్ రంగంలోకి ఎందుకు అడుగు పెట్టాలనిపించింది? 

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక గొప్ప తృప్తి ఉంది. విజయం తెచ్చిన గర్వంలేదు గానీ.. దానితో వచ్చిన గౌరవం ఉంది. చెప్పుకోదగ్గ అనుభవం ఉంది. వీటన్నింటితో జనరేట్ అవుతున్న ఒక పవర్‌తో కొత్తగా.. ఇంకేదో చెయ్యాలన్న తపన. అందుకే ఈవేళ ప్రపంచాన్ని ఏలుతున్న ఇంటర్‌నెట్ రంగంలోకి అడుగుపెట్టాను. నా భావాలు ఈ తరం వారికి విసుగు రప్పించకూడదనే.. షార్ట్ ఫిల్మ్స్‌ను ఎంచుకున్నాను. ఆ భావాలు నా గుండెల్లోంచి వచ్చినవే కాబట్టి వాటికి ఎల్బీ శ్రీరామ్ హార్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టుకున్నాను. 


ఎలాంటి హార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు? మీ జోనర్ ఏమిటి?
నా జోనర్ వేరు. వలువలు విప్పడం కాదు.. విలువలు చెప్పడం. నీతి కథ కాదు. నాది జాతి కథ. దేశం నా టాపిక్ కాదు.. మనిషి నా టాపిక్, టార్గెట్. నా పాండిత్యం నన్నయ్య పద్యం కాదు.. వేమన పద్యం. నాకు తెలిసింది పువ్వు.. చెట్టు. మనిషి.. మట్టి. పువ్వంటే ఇష్టం.. సెన్సిటివ్‌గా ఉంటుందని. సువాసనను ఇస్తుందని. చెట్టంటే మరీ ఇష్టం. సిన్సియర్‌గా రోజూ పువ్వులిస్తుందని. మనకన్నీ మట్టి నుంచే వచ్చాయి. మనమూ మట్టిలోనే పోతాం. ఆ మట్టి రంగేంటి? విత్తనం నాటితే.. వచ్చే మొక్క రంగేమిటి? దాని పువ్వు రంగు.. దానికి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ఆశ్చర్యం. ఎన్ని వింతలు?? ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మనం దేని కోసం పరుగుడెతున్నాం. అంతా కృత్రిమం. బిజీలైఫ్. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నాం. అక్కర్లేనివన్నీ పోగేసుకుంటూ పోతే.. కావాల్సినవన్నీ పొగొట్టుకుంటాం. పాతవి పక్కకు జరిపేస్తున్నాం. మంచం.. పాతది. తీసెయ్. డబుల్ కా..ట్. కుండ వద్దు.. ఫ్రిడ్జ్. అన్నీ కృత్రిమమే. ఎన్ని కొత్తవి.. ఎన్ని కొత్త రోగాలు. 

అంటే కొత్త వద్దా?
నాదీ ఇదే ప్రశ్న. కొత్త వద్దా? అక్కడే ఉందామా? బావి దాటి బయటికి రావొద్దా? అంటే.. కొత్త కావాలి. అక్కడే ఉంటే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. కొత్తదెప్పుడూ పట్టుకోవాలి. కానీ పాతదాన్నీ పట్టుకెళ్లాలి. అప్పుడు అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఎక్కువ. కాశీకి వెళ్తే తిరిగిరాడని.. వాహనం అంటే ఒంటెద్దు బండి అని.. కమ్యూనికేషన్ అంటే ఉత్తరమని.. రేడియోలోకి మనుషులు దూరి ఎలా మాట్లాడతారు.. ఒకప్పటి ఇలాంటి వింతల్ని దాటి వచ్చేశాం. ఒక్కసారిగా గేట్లు తెరుచుకున్నాయి. ఎన్నో అవకాశాలు. పరుగెడుతున్నాం. చాలా కనిపెడుతున్నారు. ఎంతో సాధిస్తున్నారు. కానీ ఎందుకీ ప్రగతి? ఒక గంటకు 124 గంటల పనులు పెట్టుకున్నాం. హడావిడి.. ఆరాటం.. పోటీ ప్రపంచం.. అన్నీ ఉంటాయి. కానీ అన్నింటికీ మొహం మొత్తి ఉంటాం. ఈ ప్రయాణంలో ఏం కోల్పోతున్నాం. తాజ్‌మహల్ చూడ్డానికి వెళ్తున్నాం. కానీ మధ్యలో దాని కంటే అందమైన దృశ్యాలు ఎన్ని చూడకుండా వెళ్తున్నాం. అందుకే నేనంటాను. గమ్యం కాదు.. ఆ ప్రయాణం నాకిష్టం.

నాటకాలు.. రచనలు.. నటుడిగా సినిమాలు మీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. ఎంతో అనుభవం. దాని నుంచి కమర్షియల్ సినిమాలు చేయొచ్చు. కానీ మీరు షార్ట్ ఫిల్మ్స్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
మనం రిటైర్మెంట్ ఎందుకు పెట్టుకున్నాం. జీవన వేగంలో పడి ఎన్నో కోల్పోతాం. చేయలేని పనులు చేయడానికి.. ఆస్వాదించలేనివి.. ఆస్వాదించడానికి. ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఉండాలి. ఇప్పుడు నాకు కావాల్సింది సిక్స్‌ప్యాక్ కాదు.. ఆరోగ్యం. అందుకే జాగింగ్ నుంచి వాకింగ్‌కు వచ్చాను. ఇవాళ నాకు టైమ్ ఉంది. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది. కానీ కళాకారునికి కాదు. నేను నాటకాల నుంచి వచ్చాను. ఒకప్పుడు నాటకం వేస్తే ఎలా ఉండేది? సూర్యోదయం చూపించాలంటే.. తెల్ల కర్టెన్ వెనకాల స్పాట్‌లైట్ పెట్టి పైకి లేపితే.. జనం నిలబడి చప్పట్లు కొట్టేవాళ్లు. ఇవాళ సినిమాలో సూర్యోదయాన్ని ఎన్ని రకాలుగా చూపించొచ్చు. అయినా సహజత్వాన్ని మనం ఫీల్ అవ్వడం లేదు. గ్రాఫిక్స్ అంటున్నాం. తెలిసిపోతుంది. పాతను వదులుకుంటున్నామనే బాధ. కొత్తను కనుక్కోలేకపోతున్నామనే బాధ. 

పాత కొత్తల మధ్య వారధిగా ఏం చెప్పబోతున్నారు?
ఎంత బహుముఖ ప్రజాశాలి అయినా ఒకసారి ఒక పని చేస్తాడు. ఆదాయం లేకపోయినా అభిరుచిని చంపుకోలేక నాటకాలు దాటి వచ్చాం.. తర్వాత సినిమాలు.. బాధలు.. బ్రేక్.. తర్వాత.. బిజీ.. ఎప్పుడూ ఖాళీగా లేను. కానీ షార్ట్‌ఫిల్మ్స్ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. దాదాపుగా 15 ఏళ్ల నుంచి. వయసు మళ్లిన క్రికెటర్లు.. కామెంట్రీ చెప్పినట్లు.. నేనిప్పుడు ఇదే పని చేయాలి. కడుపు నింపడానికి కమర్షియల్ సినిమాలు ఎలాగూ వస్తూనే ఉన్నాయి. మనసు నింపుకోవడానికే నాకు నచ్చిన పని నేను చేయాలి. ఎన్నో మలుపులు.. ఎన్నో గెలుపులు.. కానీ ఈ ప్రాసెస్‌లో నా కొడుకును ఎత్తుకుని ఆడించే అనుభూతిని పొందలేదు. సమయంలేదు. ఇప్పుడు ఉంది. కనీసం వాడి మనవడిని అయినా ఎత్తుకుని ఆడిస్తా. ఏమో రేపు వాడే నాకంటే గొప్పవాడు కావచ్చు. 

ఒకప్పుడు కథ చెబుతా అంటే వినేవారు. చెప్పేవారూ ఉండేవారు. ఈతరాన్ని పట్టుకోవడం ఎవరి తరమూ కావడం లేదు. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రపంచం అరచేతిలోకొచ్చేసింది. ఆ హస్తభూషణం మనిషిని భిన్నత్వంలో ఏకాకిని చేసేసింది. ఒకప్పుడు అశీల్లం చదవాలంటే పుస్తకాల్లో పుస్తకం దాచి పెట్టి ఎంతో రహస్యంగా చదివేవారు. ఇప్పుడు కాలం మారింది. విచ్చలవిడితనం వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లోనూ దొరుకుతు ంది. అలాంటివి ఎన్నో ఉన్నవాటి మధ్య నేను నిలబడి యూట్యూబ్‌లో ఓ నీతి కథ చెబుతున్నాను. నచ్చినవారు చూస్తున్నారు. ఆదరణ, స్పందన వస్తున్న కామెంట్లను బట్టి అర్థమవుతున్నది. వందలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరికీ నచ్చుతుంది. ఇంకా ఎక్కువమందికి ఎలా చేరుకోవాలన్నదే తదుపరి లక్ష్యం. నిజం నిద్రలేచేలోపు అబద్ధం ఆకాశం దాకా వెళ్లి వస్తుంది. మంచి కూడా అంతే మెల్లగా ఎక్కుతుంది. 

ఇప్పటికి నాలుగు లఘుచిత్రాలు చేశారు.. ఇంకెన్ని చేస్తారు? ఎంతకాలం చేస్తారు?
ఇన్ని చేయాలి.. అన్ని చేయాలని రూల్ ఏం పెట్టుకోలేదు. ఆదరాభిమానాలను బట్టి చేసినంతకాలం చేస్తాను. ఇప్పుడు నెలకు రెండు చిత్రాలు చేస్తున్నాను. స్పందనను బట్టి పెంచాలో తగ్గించుకోవాలో చూస్తా. అభిరుచి ఉంది కానీ.. ఆదాయం ఉండదు. ఉన్న పది రూపాయల్లో ఓ రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నాను. అంతకుమించి చేసే పనిలో సంతృప్తి పొందుతున్నాను. ఉత్సాహంగా.. సంతోషంగా ఉన్నాను. అన్ని పనులూ నేను చేసుకుంటున్నాను. చదువుకుంటున్నాను. కథలు ఎంచుకుంటున్నాను. కథనాలు రాసుకుంటున్నాను. ఆర్థికంగా ఇవ్వాల్సిన వారికి ఇస్తున్నాను. సహాయం చేయాల్సిన వారు చేస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ అవసరం పడుతున్నది. యువతరంతో కలిసి యువకుడిలా పనిచేస్తున్నాను. 

యువతరంతో కలిసి పనిచేస్తున్నారు. కొత్తవాళ్లకు అవకాశం ఇస్తారా? ఇస్తే ఎలాంటి అవకాశం ఇస్తారు?
తప్పకుండా అవకాశం ఇస్తా. ఇస్తున్నాను కూడా. అవకాశం మాత్రమే. ఆశిస్తున్నది మాత్రం కాదు. ఆర్థికంగా ఎంత తక్కువలో చేసుకోగలిగితే అన్ని ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు. టెక్నికల్ వ్యాల్యూస్ కంటే హ్యూమన్ వ్యాల్యూస్‌కే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాను. నేర్చుకోవాలి.. ఏదో సాధించాలన్న తపన ఉన్నవారికి.. సాంకేతిక నిపుణులకు.. ఉత్సాహం ఉన్నవారికి నాతో కలిసి నడిచే అవకాశం ఇస్తాను.

పండగ


రెండు రోజుల్లో పండగ. పెట్టట్టుకుని దిగిపోతారు.. అల్లుడు కూతురు అని ఆమె కంగారు పడుతుంది. అన్నీ వస్తుంటాయి.. పోతుంటాయి.. నువ్వు కంగారు పడకు.. ఇల్లుంది.. ఆవుంది.. నేనున్నాను.. నవ్వుతూ చెప్తాడతడు. ఆ పోతుంది.. అల్లుడి ముం దు మన పరువు. మీ మొఖానికి నవ్వు.. ఆ ఆవుకు పేడ తప్ప ఏమీ రావు.. అని చిరాకు పడుతుంది. పేడ.. ఆయనకో ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో వారింట్లో పండగ ఆనందంగా గడిచిపోతుంది. ఏమి టా ఐడియా అన్నది యూట్యూబ్‌లోనే చూడాలి. పాడి-పంట లేకపోవచ్చు! కానీ పేడతో కూడా పండగ చేసుకోవచ్చు!! అనేది సందేశం. 

మా నాన్న


ఈ కథ నిడివి ఏడు నిమిషాలే అయినా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల వారి గుండెల్ని తాకే విస్తృతి ఉంది. రాకరాక ఊరి నుంచి నాన్న వస్తాడు. డబ్బుల కోసమేమోనని కోడలు కంగారు పడుతుంది. కానీ ఆ తండ్రి పొలంలో కాసిన వేరుశనక్కాయలతో పాటు ఇరవై వేల రూపాయలు కూడా ఇస్తాడు. అది చూసి కొడుకు నాన్న మీ ఆర్నెళ్ల కష్టం. మరి మీ ఖర్చులకి? అని అడుగుతాడు. అందుకు తండ్రి మాదేముందిరా డొక్కా డోల్కా మంటెట్టుకున్నా వంటైపోద్దీ. మీకు బోలెడు ఖర్చులున్నాయి అని చెప్పడం బిడ్డల బాగు కోసం తండ్రి నిస్వార్థంగా, సునాయసంగా చేసే త్యాగానికి నిదర్శనం. 

ప్రసాదం


అమెరికా వెళ్లిన కొడుకు ఊరి గుడి కోసం డబ్బు పంపిస్తాడు. దాంతో ఏం చేయాలి? అన్నదానికి అ మృతం కురిసిన రాత్రిలాంటి అద్భుతమైన ఆలోచన వస్తుంది తండ్రికి. అక్షరాల్ని మోసుకురావడం ఆయా సం అనుకోవద్దు అంటారు ఎల్బీ. గుళ్లో ప్రసాదంగా అరటిపండు, కొబ్బరి చిప్ప ఇస్తారు.. వాటి బదులు పుస్తకాలు ఇవ్వాలనుకోవడం ఈ చిత్రంలో సందేశం. అరటిపండు అరగంటలో అరిగిపోతుంది. కొబ్బరి ప చ్చడి ఓ పూటకొస్తుంది. కానీ పుస్తక జ్ఞానం జీవితాంతం వెంట వస్తుంది. కొత్త కొత్తగా ఆలోచిస్తున్న కొత్త తరానికి ఈ కొత్త సంవత్సరంలో మీ ఆలోచన కొత్త గా ఉంది నాన్నగారు అని కొడుకు సంతోషిస్తాడు. 

ఉమ్మడి కుటుంబం


ఊళ్లో సొంతింటికి రావడంతో ఆనందంగా ఉం టాడు ఆనందరావు. కానీ ఆ అపార్ట్‌మెంట్‌లో ఎవరి మొహాల్లోనూ సంతోషం లేదు. అందరిదీ ఉరుకులు పరుగుల జీవితం. అందరితో ఆనందంగా ఉందామ ని ఎన్నో ఆశలతో వచ్చిన ఆనందరావు.. డిజప్పాయింట్ అవుతాడు. వారందరిలో ఆనందం నింపడానికి అతను ఏం చేశాడన్నది కథ. సంతోషం అనేది వెతికితే దొరకదు. పక్కనే ఉంటుంది. అది ఎవరికి వారు సంపాదించుకునే వందనోటు కాదు. ఒకరికొకరు ఇ చ్చి పుచ్చుకునే వస్తుమార్పిడి. ఒకప్పుడు ప్రేమానురాగాలను పంచుకోవడానికి ఉమ్మడి కుటుంబాలు ఉండే వి. ఇప్పుడవి చిట్లిపోయి చిన్న చిన్న కుటుంబాలైపోయాయి. అదృష్టవశాత్తూ మనకిప్పుడు అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చింది. అదే ఇవాళ్టి ఉమ్మడి కుటుంబం. 
- నగేష్ బీరెడ్డి 
photos ; కంది సన్నీ

0 comments: