పెద్ద రాతి యుగం నాటి మా ఊరు.. పజ్జూరు!

By | March 11, 2017 Leave a Comment


ఆదిమానవుడు ఆకులు కప్పుకునేవాడు. చెట్ల తొర్రలలో నివసించేవాడు. ఒక రాయిని మరొక రాయితో రాపడించి నిప్పు పుట్టించేవాడు. రాతి పాత్రలతో..  పరికరాలతో పని వెళ్లదీసుకునేవాడు. కానీ ఆదిమానవుడు  ఉండేవాడు?  ఏ విధమైన జీవనశైలి అవలింబించేవాడు?..  ఈ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం తెలియకపోయినా.. అక్కడక్కడా అతని ఆనవాళ్లు బయటపడు తుంటాయి. అలాంటి ప్రాంతాల్లో పజ్జూరు ఒకటి.  ఆదిమానవుడి ఆనవాళ్లు ఈ ఊరిలో వెలుగు చూస్తున్నాయి. తొలిచారిత్రక యుగం  దొరల పాలనాకాలమైన 20వ శతాబ్ది మధ్య వరకు విశిష్ట రాజ్య పరిణామాలు పజ్జూరులో అవశేషానవాళ్లుగా కనిపిస్తున్నాయి.



గ్రామం: పజ్జూరు   మండలం: తిప్పర్తి    జిల్లా: నల్లగొండ    పిన్: 508247    జనాభా: 3320    వృత్తి: వ్యవసాయం
తూర్పు: ఎర్రగడ్డల గూడెం   పడమర: సందనపల్లి    దక్షిణాన: పెద్ద సూరారం   ఉత్తరాన: కురువేణిగూడెం
అక్షరాస్యత: 67శాతం



ఎక్కడ ఉంది?: 
నల్లగొండ జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో.
ప్రత్యేకత ఏంటి? : సుమారు రెండు వేల ఏళ్ల చరిత్ర పజ్జూరు సొంతం. శాతవాహనులు.. కళ్యాణీ చాళుక్యులు.. రాష్ట్ర కూటులు.. కాకతీయులతో ఈ గ్రామం అనుబంధం కలిగి ఉన్నట్లు ఆనవాళ్లు లభిస్తున్నాయి.



పురావస్తు తవ్వకాలు 
పజ్జూరుది ఆది నుంచీ ఘనమైన చరిత్రే. తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన శాతవాహనుల హయాంలో పజ్జూరు ప్రముఖ పరిపాలనా కేంద్రంగా వర్ధిల్లినట్లు ఆధారాలున్నాయి. ఇటీవల పురావస్తుశాఖ తవ్వకాల్లో లభించిన అవశేష ఆనవాళ్లు వీటిని తెలియజేస్తున్నాయి. కుండపెంకులు.. మట్టిపూసలు.. టెర్రకోట స్త్రీ ప్రతిమలు.. మట్టి గాజులు.. దంతపు గాజులు.. తిలకం దిద్దుకునే కొనేరియం రాడ్.. కార్నేలియం.. జాస్ఫర్.. డిజైన్ కుండ.. ఇటుకలతో నిర్మించిన కట్టడాలు బయటపడ్డాయి. వీటిలో చేత్యాలు ఉండడంతో ఇక్కడ బౌద్ధ మతం కూడా ఫరిడవిల్లినట్లు పురావస్తుశాఖ అధికారులు నిర్ధారించారు. శాతవాహనుల సామంతులైన మహాతలవరస సీసం, రాగి నాణేలూ లభించాయిక్కడ.



పాటిగడ్డ మట్టి
2001వ సంవత్సరంలో పజ్జూరుకు చెందిన పులిజాల వెంకటరమణ ఇంట్లో ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నట్లు ఆయన సోదరి చెప్పడంతో తవ్వకాలు చేపట్టారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఇది చర్చనీయాంశమైంది. పజ్జూరు సమీపగ్రామమైన చిన్న సూరారానికి చెందిన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అనుములపూరి రామ్‌లక్ష్మణ్‌కు ఈ విషయం తెలిసింది. పురావస్తు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తికి విషయం చెప్పి పజ్జూరును సందర్శించాల్సిందిగా ఆదేశించారు. ఆయన గ్రామంలో పర్యటించారు. ఇక్కడి ఇండ్ల మట్టి గోడలలో ఉన్న ఎరుపు.. నలుపు కుండ పెంకులను చూసి గ్రామస్తులను అడిగారు. ఆ మట్టి చారిత్రక ప్రదేశమైన పజ్జూరు పాటిగడ్డ నుంచి తీసుకొచ్చిందని చెప్పడంతో పురావస్తు శాఖ ఈ గ్రామంపై దృష్టి సారించింది.




శిల్పకళాకృతి 
కళ్యాణీ చాళుక్యులు.. రాష్ట్రకూటులు.. కాకతీయుల కాలంలోఆలయాలు ఇక్కడ నిర్మించి ఉంటారు. వాటిలో ఒక శివాలయం ఇప్పటికీ ఉంది. శాతవాహన కాలంలో టెర్రకోట శిల్పాలు ఆలయ శిల్పాలపై అపురూపంగా కనిపిస్తాయి. శైవతత్వం ప్రబలంగా మనుగడలో ఉన్నకాలంలో ప్రతిష్టించిన  చాముండి ఆలయం నేడు ఊరు దేవత ముత్యాలమ్మగా పూజలందుకుంటున్నది. ఈ గుడి సమీపంలోనే పలుచని పరుపు బండపై వీరగల్లులు ఉన్నాయి. ఇవి కాకతీయ పాలనను చూపిస్తున్నాయి.



రుద్రమ నడిచిన బాట 
కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఓరుగల్లు నుంచి బయలుదేరి పిల్లలమర్రి.. ఇనుపాముల.. చందుపట్ల.. పజ్జూర్ గ్రామాల్లో సేద తీరుతూ పానగల్లు చేరుకునేవారని ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారు. స్వయంగా రుద్రమనే పజ్జూరులో నాగ దేవతారాధన చేపట్టినట్లు ఇక్క డ లభించిన ఆధారాలను బట్టి చెప్పొచ్చు. గ్రామం చుట్టూ నాగుపాముల విగ్రహాలు ఉంటాయి. నాగులచవితి.. నాగ పంచమి  రోజుల్లో గ్రామస్తులు ఇక్కడ పూజలు చేస్తుంటారు. పజ్జూరులో ప్రధానంగా చెప్పుకునేది పెద్ద చెరువు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు నిర్మించారు.




శాసనం చెప్పే చరిత్ర 
ఎర్రగడ్డలగూడెం అనుబంధ గ్రామమైన గుర్గుబావి దగ్గర ఉన్న శిలాశాసనం గోల్కొండ కుతుబ్‌షాహీల పాలనను తెలియజేస్తుంది. క్రీస్తుశకం 1602లో రాయించిన శిలా శాసనం పజ్జూరు విశిష్టతను చెప్తున్నది. వీరి కాలంలో పానగల్ సర్కార్ కింద పజ్జూరు (పరగణ)గా ఉండేదట. దీని కేంద్రంగా పాలన చేస్తున్న పానగంటి నర్సనాయినం బ్రాహ్మణులకు భూమి ఇనాం ఇస్తే వీరి సేవకుడైన చామ సర్వయ్య కుమారుడు వెంకటయ్య వినాయక విగ్రహం.. శిలా శాసనం వేయించారని గ్రామస్తులు చెప్తుంటారు. పజ్జూరు పరగణాలో పానగంటి వంశస్తుల పాలన క్రీస్తుశకం 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు సాగినట్లు చెబుతారు.





ఆదిమమానవుడి ఉనికి 
పజ్జూరులో పెద్దరాతియుగం మానవుడి స్మారక శిల (మెన్‌హీర్).. ఎర్రగడ్డలగూడెంలో ఆదిమ మానవుడి రాక్షసగూళ్లు ఉన్నట్లు పురావస్తుశాఖ వాళ్లు ఇటీవలే నిర్ధారించారు. రాక్షసగూడు పెద్ద డయాతో 235 అడుగుల వృత్త పరిధి.. 78 అడుగుల వ్యాసార్ధం.. 50 పెద్ద గండ్ర శిలలతో వృత్తాకారంలో నిర్మించి  ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్దదని చరిత్ర కారులు.. ఆర్కియాలజీ అధికారులు నిర్దారించారు. దీనికి సమీపంలోనే బండపై ఆదిమ మానవుడు తన జీవన గమనంలో వాడిన రాతి ఆయుధాలను పదును పెట్టిన ఆనవాళ్లు కనపడుతున్నాయి. రాతి గొడ్డండ్లు.. వడిసెల రాళ్లు.. పసర్లు నూరే ఫెజల్స్ ఈ ప్రాంతంలో విరివిగా లభించాయి.
మురళి రాగి, 7702510250



మరికొన్ని చిత్రాలు..










0 comments: