కట్టలు తెంచుకున్న కన్నీరు కళ్లలోనే ఇంకిపోతే?

By | February 18, 2012 Leave a Comment
veedukolu talangana patrika telangana culture telangana politics telangana cinema
కల్లోల సంద్రాలకు ఆవల బతుకుదెరువుకోసం బయలుదేరతాడు అతడు..
కంటిపాప దాయని కన్నీటిని చీరకొంగుతో
ఒత్తుకుంటూ...
కన్నబిడ్డల్ని గుండెలకు హత్తుకుంటూ
వీడ్కోలు చెబుతుందామె...
ఆ చూపు ఇక కడచూపే అయితే?
కట్టలు తెంచుకున్న కన్నీరు కళ్లలోనే ఇంకిపోతే?
వలస బతుకులు కత్తులవంతెనలన్నది నిజం...
తెలంగాణలో ఇది సహజం...
ఇది అలాంటి ఓ సందర్భం!

సోమవారం, ఫిబ్రవరి 6, 2012 ఉదయం 10.25 గంటలకు ఒక ఈమెయిల్ వచ్చింది.
From : mbreddy.hyd@gmail.com
To : splsecy_proto_gad@ap.gov.in
Cc : beereddy12@gmail.com
విషయం : బహ్రెయిన్ నుంచి వస్తున్న ఎం. శ్రీనివాస్ మృతదేహానికి అంబుపూన్స్ సమకూర్చడం గురించి..
మాదారపు శ్రీనివాస్ (పాస్ట్‌పోర్ట్ నెంబర్ జి-3242177) జనవరి 23న బహ్రెయిన్‌లో మరణించాడు. అతడు పేద కుటుంబానికి చెందినవాడు. రవాణా ఖర్చులు భరించలేని స్థితిలో అతని కుటుంబం ఉంది. దయచేసి హైదరాబాద్ నుంచి జగిత్యాల్ వరకు ఉచితంగా అంబుపూన్స్ వసతి కల్పించగలరని మనవి.
ఫ్లైట్ వివరాలు : బహ్రెయిన్ - మస్కట్ - హైదరాబాద్, ఒమన్ ఎయిర్, ఫ్లైట్ నెంబర్ : డబ్ల్యూవై-231, చేరే సమయం : ఫిబ్రవరి , 2012, బుధవారం ఉదయం : 5.50 గంటలకు
- ఇది ఆ మెయిల్ సారాంశం. మైగ్రేట్స్ రైట్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ ఎం. బీమ్‌డ్డి ఆంధ్రవూపదేశ్ ఎన్‌ఆర్‌ఐ సెల్ నోడల్ ఆఫీసర్ ఎన్.వి. రమణాడ్డికి రాసిన మొయిల్ నాకు కూడా ఫార్వర్డ్ చేశారు. మృతదేహాన్ని తీసుకొస్తున్న నక్క గంగారామ్, రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్‌కి వస్తున్న గంగాధర్, ప్రేమ్ కుమార్‌ల వివరాలు ఆ మెయిల్‌లో ఉన్నాయి.

నగరం నిద్రలేస్తున్న వేళ... ఫిబ్రవరి , ఉదయం 5.30
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ధగధగ కాంతులతో వెలిగిపోతోంది. వచ్చీపోయే ప్రయాణికులతో హడావిడిగా ఉంది. ప్రేమ్‌కుమార్‌కు ఫోన్ చేస్తే ‘కార్గో దగ్గర గంగాధరన్న, నేను అంబుపూన్స్‌లో ఎదురుచూస్తున్నామ’ని చెప్పాడు. 5.50కి బీమ్‌డ్డి వారిని అరైవల్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాడు. బ్లూజీన్స్, వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ప్రేమ్‌కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. శ్రీనివాస్‌కు ప్రేమ్ కజిన్. మాసిన గడ్డం, తలకు మంకీ క్యాప్‌తో పొడుగ్గా ఉన్న ఇంకో వ్యక్తి గంగాధర్. శ్రీనివాస్‌కు స్వయాన అన్నయ్య. ఇద్దరూ రాత్రంతా మేల్కొని ఉన్నారేమో కళ్లు ఎరుపెక్కాయి.
గంగాధర్ ఫోన్ రింగయ్యింది.
‘‘సార్.. మేం ఈడ్నే ఉన్నం సార్. బయటికొచ్చే కాడ.. ఫ్లైట్ వచ్చిందా సార్? బావ కలిసిండా? ఆ.. సరే.. మేం ఈడ్నే వెయిట్ చేస్తం సార్’’ - ఫోన్ పెట్టేశాడు.
‘‘ప్రొటోకాల్ ఆఫీసరా?’’ అడిగాడు బీమ్‌డ్డి.
‘‘అవున్సార్’’ ఫోన్ జేబులో పెట్టుకుంటూ చెప్పాడు గంగాధర్.
‘‘ఎపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఇలాంటి కేసుల్ని డీల్ చేస్తుంది. డెడ్‌బాడీకి సంబంధించిన డీటైల్స్.. బాడీతో పాటు వస్తున్న వ్యక్తి వివరాలు.. రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వారి ఫోన్‌నెంబర్లు అన్నీ ఎయిర్‌పోర్ట్ ప్రోటోకాల్ వింగ్‌కి పంపిస్తుంది. ప్రోటోకాల్ ఆఫీసర్ ఫ్లైట్ రాగానే బాడీతో పాటు వచ్చిన వ్యక్తిని రిసీవ్ చేసుకుని వస్తారు. డెడ్‌బాడీని కార్గోకి పంపిస్తారు. తర్వాత కొన్ని పేపర్ల మీద సంతకం చేయాలి. పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ తర్వాతనే బాడీని హ్యాండోవర్ చేస్తారు. బాడీని అంబుపూన్స్ ఎక్కించేవరకు ప్రోటోకాల్ ఆఫీసర్‌తోపాటు ఒక అటెండెంట్ మనకు సహాయం చేస్తారు’’ అక్కడి ఫార్మాలిటీస్ చెప్పాడు బీమ్‌డ్డి. అరైవల్ పాయింట్ నుంచి బయటికి వచ్చే వాళ్లని గమనిస్తున్నారు గంగాధర్, ప్రేమ్.

మాదారపు శ్రీనివాస్‌ది కరీంనగర్ జగిత్యాల్లో కలాచివాడ. శ్రీనివాస్‌కు భార్య శోభ, కొడుకులు పూర్ణచందర్, శ్రీనివాస్, కూతురు యశస్వినిలు ఉన్నారు. తల్లిదంవూడుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు ఏమీలేవు. పెద్దగా చదువుకోని శ్రీనివాస్‌కు కుటుంబ పోషణ భారంగా ఉండేది. జగిత్యాల్లోని ఒక బార్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. చాలీచాలని జీతం.. పిల్లల చదువులతో అప్పులపాలయ్యాడు. మస్కట్‌కు పోయి డబ్బు సంపాదించాలనుకున్నాడు. తన బావ నక్క గంగారామ్ అప్పటికే బహ్రెయిన్‌కు వెళ్లి రెండేళ్లయింది. అప్పుడప్పుడు అతనికి ఫోన్ చేసి ‘నేను కూడా నీతో వస్తా బావ’ అని అడిగేవాడు. ‘అరబ్బోళ్ల దేశం... ఇక్కడ నువ్వేం పనిచేస్తావ్‌రా.. వద్దులే’ అని చెప్పేవాడు గంగారామ్.

ఒకగంట నిరీక్షణ తర్వాత...
నల్ల జాకెట్ వేసుకుని, చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని వస్తున్నాడొకాయన. పక్కన ఒక ఆఫీసర్ చేతిలో ఏవో కాగితాలు పట్టుకున్నాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్న అటెండెంట్ ట్రాలీ తోసుకొస్తున్నాడు. ట్రాలీపై రెండు బ్యాగులు, ఒక సూట్‌కేస్ ఉన్నాయి. ఒక బ్యాగ్‌పై ఎం. శ్రీనివాస్ అని, ఇంకో బ్యాగ్‌పై నక్క గంగారామ్ అని రాసి ఉంది. వాళ్లని చూడగానే గంగాధర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ప్రేమ్ ఎదురుగా వెళ్లి నల్లకోటు వ్యక్తిని బావ అని బిగ్గరగా హత్తుకున్నాడు. ముగ్గురిలో కాసేపు మౌనం. గంగారామ్ కళ్లలో నీళ్లు రావడం లేదు. బహుశా ఏడ్చి ఏడ్చి ఇంకిపోయి ఉంటాయి. కాస్త ముందుకు వెళ్లి వెహికిల్ కోసం నిల్చున్నారందరు.

ఆ బ్రిడ్జీ కింది నుంచి విఐపీలు లోపలికి వెళ్లే ఎంట్రన్స్. టీడీపీ నేత చంద్రబాబునాయుడు లోపలికి వెళ్తున్నాడు. ప్రోటోకాల్ ఆఫీసర్ ఆనంద్‌కు ఫోనొచ్చింది. ‘డిప్యూటీ సీఎం, ఎక్స్ సీఎం వస్తున్నారు మీరెక్కడ?’ అని. ‘డెడ్‌బాడీని హ్యాండోవర్ చేసే పనిలో ఉన్నాను. వారిని రిసీవ్ చేసుకోవడానికి మావాళ్లు ఉన్నార’ని ఫోన్ పెట్టేశారు ప్రొటోకాల్ ఆఫీసర్ ఆనంద్. ‘ముందు కార్గోకి వెళ్లి కొన్ని సంతకాలు చేయాలి. తర్వాత పోలిస్‌స్టేషన్‌కి వెళ్దాం’ అన్నారు ఆనంద్ వారితో. వెహికిల్ బయలుదేరింది.


ఓసారి పండక్కి గంగారామ్ ఊరొచ్చాడు. ‘నన్ను ఎలాగైనా తీసుకెళ్లు బావా!’ అని కాళ్లవేళ్ల పడ్డాడు శ్రీనివాస్. తీసుకెళ్తానని మాటిచ్చాడు గంగారామ్. హాజీ హాసన్ గ్రూప్ కంపెనీ తరపున పాస్‌పోర్ట్ ఇప్పించి నాలుగు సంవత్సరాల క్రితం బహ్రెయిన్ తీసుకెళ్లాడు. రెండు సంవత్సరాల అగ్రిమెంటు. అతనితో పాటు అక్కడ పనిచేసే కార్మికులకు కూడా ఆ కంపెనీయే వసతి కల్పించేది. రెండున్నరేళ్ల క్రితం తండ్రి చనిపోయినప్పుడు కూడా శ్రీనివాస్ రాలేకపోయాడు. సంపాదించినదాంట్లో అంతో ఇంతో డబ్బు ఇంటికి పంపేవాడు. కొంచెం కొంచెంగా అప్పులు తీరుతున్నాయి. అప్పుడప్పుడు భార్య పిల్లలతో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఇంకో రెండు నెలలు గడిస్తే జగిత్యాల వచ్చి అందర్నీ కలవాలనుకున్నాడు.

7. 30 గంటలకు... కార్గో దగ్గర...
గంగారామ్, గంగాధర్.. ఆఫీసర్ సహాయంతో కౌంటర్ దగ్గర సంతకాలు చేశారు. తర్వాత అంబుపూన్స్‌లో శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కి బయలుదేరారు. గంట తర్వాత నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొచ్చారు. దానిమీద శ్రీనివాస్ వివరాలు, తీసుకెళ్తున్న వెహికిల్ నంబర్, డ్రైవర్ పేరు రాసి ఉన్నాయి. దాని జీరాక్స్ కాపీ కౌంటర్‌లో ఇచ్చి లగేజీ (డెడ్‌బాడీ) ఇన్‌బాండ్ సర్టిఫికెట్, గేట్‌పాస్ తీసుకున్నారు. పెద్ద గోడౌన్ ముందు అంబుపూన్స్ రివర్స్ చేసి పెట్టాడు డ్రైవర్. అక్కడ ఫైల్‌లో సంతకం చేసి గేట్‌పాస్ ఇచ్చిన తర్వాత షటర్ ఓపెన్ చేశారు. పెద్ద ట్రాలీపై దీర్ఘచతురవూసాకారపు చెక్కడబ్బా. చుట్టూ మేకులు కొట్టి ఉన్నాయి. నలుగురు పట్టి ఆ మృతదేహాన్ని అంబుపూన్స్ ఎక్కించారు. లోపల అత్తరు వాసన.. చెక్కడబ్బాలో కెమికల్స్ వాసనల మధ్య గంగారామ్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పాడు.

జనవరి 23, బహ్రెయిన్, హజ్ హాసన్ గ్రూప్ కంపెనీ...
చలికాలం.. చుట్టూ పొగమంచు కమ్ముకుంది. లారీ లోడ్ చేసిన తర్వాత వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చాడు శ్రీనివాస్. డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించాడు. శ్రీనివాస్ వెనక్కి తిరిగి సిగట్ వెలిగించాడు. ఎందుకో తెలియదు వాహనాన్ని డ్రైవర్ వేగంగా రివర్స్ చేశాడు. వెనక టైర్ శ్రీనివాస్ మీదికి ఎక్కింది. తల, మొండెం నుజ్జు నుజ్జయ్యాయి. ఆ విషయం ఎవరో గంగారామ్‌కి ఫోన్ చేసి చెప్పారు. పరుగున అక్కడికి వెళ్లాడు. ఆ దృశ్యం చూసి గుండె పగిలినంత పనయ్యింది. ఆ తర్వాత పోలీసులు.. ఆస్పత్రి.. ఫార్మాలిటీస్.. ఆ విషయం శ్రీనివాస్ ఇంట్లో వాళ్లకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. గంగాధర్‌కి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయినట్లు మాత్రమే చెప్పాడు. చనిపోయాడని మాత్రం చెప్పలేకపోయాడు. ఆ తర్వాత వేరే ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఇంట్లో వాళ్లకి చెప్పమని చెప్పాడు. పదిహేను రోజులు శవం మార్చురీలోనే ఉంది. ఉద్యోగానికి సెలవు పెట్టి.. రోజూ బావమరిది శవాన్ని చూస్తూ.. కంపెనీ.. పోలీసులు..ఎంబసీల చుట్టూ తిరిగాడు. శ్రీనివాస్ మంచితనం.. భార్యాపిల్లలు గుర్తొచ్చినప్పుడు ఒంటరిగా ఎక్కి ఎక్కి ఏడ్చాడు.

0 comments: