సరైన సమయంలో సరైన పుస్తకం ‘ఫేస్ బుక్ గైడ్’

By | January 22, 2014 Leave a Comment


సామాజిక అవసరం నుంచి అనివార్యంగా దూసుకొచ్చిన సంఘటన ఫేస్ బుక్ సృష్టి. ఇది మానవ సంబంధాల మీద.. సమాజం మీద చూపుతున్న ప్రభావాలను అర్థం చేసుకుని యువ రచయిత నగేష్ బీరెడ్డి ఈ పుస్తకాన్ని రచించారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ను ఎలా ఉపయోగించాలి అని వివరించే ఫేస్ బుక్ గైడ్ పుస్తకావిష్కరణ సభ సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో డిసెంబర్ 28, 2013న జరిగింది. పుస్తక రచయిత నగేష్ బీరెడ్డి పుస్తకం ఆవశ్యకతను చక్కగా వివరించారు. సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ లో వస్తున్న మార్పులు.. సమాజంపై దాని ప్రభావం.. పరిణామాలు ఇలాంటి అంశాలను పుస్తకంలో క్లుప్తంగా, సూటిగా వివరించారు. పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న వక్తలు సైతం యువ రచయిత నగేష్ బీరెడ్డిని ప్రశంసించారు. తరచుగా పుస్తకావిష్కరణ అంటే నవలలు, కథలు, కవితలు మాత్రమే చూస్తుంటాం. ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్క్ పై పుస్తకం ఆవశ్యకతను ఇప్పటి వరకు పాతతరం రచయితలు ఎవరూ గుర్తించలేకపోయారు. ప్రతి పుస్తకానికి ముందు మనం ముందు మాట చూస్తూ ఉంటాం. ఫేస్ బుక్ గైడ్ పుస్తకానికి ముందు మాట లేకపోవడం ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే ఇది పరిచయం అక్కర్లేని.. సరైన సమయంలో వచ్చిన సరైన పుస్తకం. ఫేస్ బుక్ మీద తెలుగులో వచ్చిన తొలి పుస్తకం కూడా ఇదే. ఫేస్ బుక్ కు ఉద్యమాల సమయంలో మార్గదర్శిగా నిలిచిన చరిత్ర ఉంది. ఫేస్ బుక్ లో మంచి చెడూ రెండూ ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే దగ్గర కూర్చి ఫేస్ బుక్ ఎలా వాడాలో ఒక గైడ్ రచయిత మనకు వివరించారు.. ఎలా వాడాలో మాత్రమే కాదు.. ఎలా వాడకూడదో కూడా రచయిత నగేష్ బీరెడ్డి చక్కగా తెలియజేశాడు.
ఫేస్ బుక్ చరిత్ర.. రచయిత అనుబంధం
2004లో జుకెర్ విజయగాథే ఫేస్ బుక్ అని చెప్పవచ్చు. ఇద్దరు విద్యార్థినుల ఫోటోల్ని పక్క పక్కన పెట్టి పోల్చుకునే వెసులు బాటు మాత్రమే ఒకప్పుడు అందులో ఉండేది. దానికి వచ్చిన అద్భుత స్పందన ఫలితమే ఇప్పటి ఫేస్ బుక్ సృష్టి. జుకెర్ పిల్లాడిగా ఉన్నప్పుడు ఓ బోర్డింగ్ స్కూల్ లో చదువుకున్నాడు. అక్కడ ఏటా విద్యార్థుల వివరాలు, ఫోటోలతో కూడిన ఓ పుస్తకం ముద్రించేవారు. దానిని అంతా ఫేస్ బుక్ అని పిలుచుకునేవారు. తన సోషల్ నెట్ వర్క్ సైట్ కు అదే పేరే పెట్టాడు జుకెర్. ఫేస్ బుక్ ప్రాజెక్టులో స్నేహితులందరినీ కలుపుకున్నాడు. 2004లో హార్వర్డ్ క్యాంపస్ కే పరిమితమైన ఫేస్ బుక్ మెల్ల మెల్లగా మిగిలిన విద్యా సంస్థలకూ విస్తరించింది. ఆ తర్వాత ప్రపంచానికంతటికీ చేరువైంది. ఇందులోకి ఎవరైనా రావచ్చు.. ఎవర్నైనా ఆహ్వానించొచ్చు. జాతి బేధాల్లేవు. సరిహద్దు గోడల్లేవు. అర్హతానర్హతలు లేనేలేవు. అనతి కాలంలోనే.. ఫేస్ బుక్ పై జనం వెల్లు వెత్తారు. ఫేస్ బుక్ ఫేమస్ బుక్ అయిపోయింది.
ఏదైనా రంగంలో కొత్తది పుట్టినప్పుడు అది అంతకు ముందున్న సమస్తాన్ని తుడిచి పెట్టుకుపోతుంది. ఫేస్ బుక్ చేసింది అదే. ఆర్కుట్ ని దెబ్బతీసింది. గూగుల్ ఆర్కుట్ తోనే కాదు.. ప్లస్ తో కూడా ఫేస్ బుక్ ని గెలవలేకపోయింది. ఫేస్ బుక్ చాలా సంచలనాలకు తెర తీసింది. ఫేస్ బుక్ లో స్టేటస్ అప్ డేట్ చేస్తే చాలు కొత్త ఆలోచనైనా, ఆవేశమైనా, ఆవేదనైనా, కవిత్వమైనా, కల్పితమైనా, సోదైనా, సొల్లైనా భరించడానికో బ్యాచ్ రెడీగా ఉంటుంది. మెచ్చుకున్నా తిట్టుకున్నా గిల్లుకున్నా గిచ్చుకున్నా.. ఆ స్టేటస్ ఫేస్ బుక్ లోకి అప్ లోడ్ కావాల్సిందే. దీని పుణ్యమా అని వ్యక్తికి వ్యక్తికీ, వ్యక్తికి వ్యవస్థకీ మధ్య మునుపెన్నడూ లేని భీభత్సమైన కనెక్టివిటీ పెరిగిపోయింది. అందుకే ఈ మధ్య చాలామంది ఇంట్లో, ఆఫీసులో కంటే ఎక్కువగా ఫేస్ బుక్ లోనే ఉంటున్నారు. ఇంతగా పాపులర్ అయిన ఫేస్ బుక్ ను పుస్తక రూపంలో తీసుకురావడానికి కారాణాన్నిరచయిత నగేష్ బీరెడ్డి చాలా చక్కగా వివరించాడు. కేవలం నెల రోజుల్లోనే 80 పేజీల పుస్తకాన్ని రూపొందించాడు. ఫేస్ బుక్ చూసే వాళ్లకు, చూడని వాళ్లకు అందరికీ ఉపయోగపడే పుస్తకం ఇది. ఒక టీవీ ఛానెల్లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నగేష్ బీరెడ్డి సాంకేతికత మీద ఉన్న ఇంటరెస్ట్ తో ఫేస్ బుక్ మీద ఒక పుస్తకం రాయాలనుకున్నారు. దానికి మరో రచయిత వాసిరెడ్డి వేణుగోపాల్ సహకారంతో పుస్తకాన్ని పూర్తి చేయగలిగాడు. పుస్తక రచనలు చేయడం అంటే పెద్దవాళ్లు గొప్పవాళ్లు మాత్రమే చేస్తారనే అపోహల నుంచి నగేష్ బీరెడ్డి ఈ తరానికి కావాల్సిన ఓ కొత్త రచయితగా యువ రచయితగా పుట్టుకొచ్చాడు. తెలుగులో ఇప్పటి వరకు ఫేస్ బుక్ మీద ఒక్క పుస్తకం కూడా రాలేదు. ఇలాంటి రచన రావడం తెలుగు ప్రజలకు ఒక ఆనందదాయకం.
పుస్తకం ఎలా ఉందంటే...
ఫేస్ బుక్ గైడ్ అనే పుస్తకాన్ని నగేష్ బీరెడ్డి పేర్చిన తీరు ఆకట్టుకునేలా ఉన్నాయి. కూర్చిన అమరికలు అందంగా ఉన్నాయి. ప్రతి పేజీ ఫేస్ బుక్ లో ఒక పోస్టు చదువుతున్నట్లు లేఅవుట్ చేశారు. అక్కడ ప్రముఖ కార్టూనిస్టు లేపాక్షి వేసిన కార్టూన్లు తెగ నవ్వు పుట్టిస్తాయి. పుస్తకం చదువుతున్నప్పుడు అక్కడక్కడా వచ్చే కార్టూన్లు రిలీఫ్ గా అనిపిస్తాయి. ఈ పుస్తకంలోని టాపిక్స్ చూసినట్లయితే ఈ టాపిక్ అనవసరం అనే అభిప్రాయానికి ఏ పాఠకుడు రాడు అనేది సత్యం. 80 పేజీల నిడివిగల ఈ ఫేస్ బుక్ గైడ్ అనే పుస్తకంలో లో అన్ని చాప్టర్స్ అందరికీ నచ్చేవి అందరికీ అర్థమయ్యేవి అందరికీ అవసరమైనవి కూడా. రచయిత తొలి ప్రయత్నాన్ని పుస్తకావిష్కరణ సభకు వచ్చిన అతిథులు, వక్తలు ప్రశంసించడమే పుస్తకం తొలి విజయంగా భావించవచ్చు. పుస్తకం అనేది చదివి పడేసేది ఉండకూడదు. అందులోని అంశాలు సమాజానికి వ్యక్తులకు, వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ పుస్తకం విషయంలో రచయిత నగేష్ రెడ్డి అవే జాగ్రత్తలు తీసుకొని పుస్తకం విజయవంతంగా తీసుకొచ్చాడు. యువ రచయితలు రావాలని మంచి పుస్తకాలు సమాజానికి ఉపయోగపడే రచనలు మరిన్ని రావాలని మనమూ కోరుకుందాం.
వక్తలు ఏమన్నారంటే?
యండమూరి, మల్లాది వంటి పేరు మోసిన రచయితలు ఇక నవలలు రాయడం మానేసి, పర్సనాలిటీ డెవలప్ మెంట్, డబ్బు సంపాదించడం ఎలా? లాంటి పుస్తకాలు రాస్తున్నారు. నిజానికి ఫేస్ బుక్ పై ఇలాంటి రచయితల కన్ను పడాల్సి ఉంది. ఎందుకో పడలేదు. ఆ ఛాన్స్ నగేష్ కొట్టేశాడు. టెక్నికల్ రైటర్స్ ఈ జనరేషన్ నుంచి తెలుగులో రావాల్సిన అవసరం ఉంది. నగేష్ చేసిన ప్రయత్నంతో అది మొదలైంది అనుకుంటున్నాను.
- అరుణ్ సాగర్, 10 టీవీ సీఈవో..
పోతన నన్నయ్య అల్పాక్షరంలో అనల్పం.. లాంటి వ్యాసాలు.. పుస్తకాలు చదివి చచ్చిపోయాం. విసిగిపోయాం. మనకు కావాల్సింది ఇలాంటి పుస్తకాలు. సమకాలీన జీవితాన్ని సరైన పద్ధతిలో మనం అర్థం చేసుకోవడానకి లేదా.. మన ఊహకుగానీ మన భాషకు గానీ, మన తలపులకుగానీ అందని విషయం అర్థం చేసుకోవడానికి అవి అర్థం చేసుకున్న వాళ్లు రాసేవే ఇలాంటి పుస్తకాలు. ఫేస్ బుక్ ఎంత అనివార్యమైన సందర్భంలో దూసుకొచ్చిందో ఈ పుస్తకం కూడా అంతే అనివార్యమైన సందర్భంలో దూసుకొచ్చింది.
- ప్రముఖ కవి పైడి తెరేష్ బాబు
నెగెటివ్ అంశాలు ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతూ ఉండడం, ద్వేష పూరితమైన భావజాలం మనకు కఠినమైన చట్టాలున్నా విస్తృతంగా పెరుగుతుంది. ఫేస్ బుక్ ని ఎడ్యుకేట్ చేసే అవసరం అనేది చాలా అవసరం.. ఎడ్యుకేట్ చేసే అద్భుత అవకాశాన్ని రచయిత నగేష్ బీరెడ్డి అందిస్తున్నారు ఈ పుస్తకం ద్వారా..
- నల్లమోతు శ్రీధర్, సాంకేతిక నిపుణులు
ఈ రోజుల్లో 13 సంవత్సరాల పిల్లలు కూడా.. వయస్సు ఎక్కువ వేసుకుని ఫేస్ బుక్ లోకి ఎంటరైపోతున్నారు. అందుకే స్కూల్ పిల్లలకి ఈ పుస్తకాన్ని ఒక చాప్టర్ గా పెట్టాలి.
- మెర్సీ సురేష్ జజ్జర, కవయిత్రి
రచయిత గురించి..
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని యర్రగడ్డల గూడెం అనే ఓ కుగ్రామానికి చెందిన సీతారాంరెడ్డి, సుజాత దంపతుల ప్రథమ కుమారుడు నగేష్ బీరెడ్డి. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నగేష్ బీరెడ్డి మంచి జర్నలిస్టుగా గుర్తింపు పొంది అతి తక్కువ సమయంలోనే యువ రచయితగా ఎదిగాడు. ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల్లో పనిచేశాడు. ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చిన నగేష్ ప్రస్తుతం 10టీవీలో పనిచేస్తున్నారు. టీవీలో కీలక సబ్ ఎడిటర్ గా టెక్నాలజీ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే మరో వైపు తెలుగు యూనివర్సిటీలో ఎం.సి.జె చదువుతున్నాడు. ఫేస్ బుక్ మీద పుస్తకం రాయడం అతని అభిలాషకు, అతని సృజనాత్మకతకు నిదర్శనం. యువ రచయిత నగేష్ మరిన్ని రచనలు చేయడానికి పూనుకుంటానని చెప్పడం హర్షనీయం.

- భరత్ రెడ్డి మందడి
(జనపక్షం..లో)

0 comments: