మా ఊరెంత మారింది...

By | January 19, 2009 9 comments

నల్గొండలో బస్సు దిగి మా ఊరి బస్సు ఎక్కగానే నాలో తెలియని ఉద్వేగం. ప్రియురాలి కోసం ఎదురుచేసే ప్రియుడిలా... కదలని కాలం.. తగ్గిని దూరం... అలా కళ్లు మూసుకున్నా. చిన్ననాటి జ్ఞాపకాల పొరలు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. సినామా రీళ్లలా గిరిగిరా తిరిగాయి... కిటికీలోంచి చల్లని గాలి వీచింది. ఉలిక్కి పడి లేచి చూస్తే.. మా ఊరి పొలిమేర... "ఈ ఊరు... ఈ గాలి... ననుగన్న నా వాళ్లు...'' మనసు మౌనంగా పాడింది. ఇదే మా ఊరి చెరువు. వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద మోకాలు లోతు నీళ్లు వచ్చేవి. మా ఊరి బళ్లో ఐదో తరగతి వరకే ఉంది. ఆ తర్వాత పక్క ఊరికి వెళ్లాల్సిందే. చెప్పులు చేతిలో పట్టుకుని పుస్తకాల సంచి తలపై పెట్టుకుని స్కూలుకు వెళ్లేందుకు వాగు దాటేవాళ్లం. ఆ నీటి తడి స్పర్శ ఒక్కసారి కాళ్లకు తాకినట్లు అనిపించింది ఆ జ్ఞాపకం. భుజాన నాగలి ఎత్తుకుని వెళ్తున్నారే.. వాళ్లు మా ఊరి రైతులే. కోడవళ్లు చేతిలో పెట్టుకుని పొలం గట్టు వెంట వెళ్తున్న ఆడపడుచులు కూడా మా ఊరి కూలీలే. అదిగో మల్లయ్య తాత.. ఎడ్లబండి... ఆ ఎడ్లు కవలల్లా ఉంటాయి. వాటి పేర్లేంటో తెలుసా? రామ, లక్ష్మణులు. అదే మా ఊరి బడి. రెండెక్కం నేర్పిన తొలి దేవాలయం. నేను ఐదో తరగతి వరకు చదివింది ఇక్కడే. ఊరు అవతల పాలరాతి శిల్పంలా తలతలా మెరుస్తూ ఉండేది. ఇప్పుడు బడి గోడలు బీటలు వారిన కోట గోడల్లా ఉన్నాయి. ధర్మయ్య మాష్టారు లెక్కల క్లాసుకు భయపడి గోడ దూకి కంది చేనులో దాక్కునే వాళ్లం. మమ్మల్ని వెతికి పట్టుకొచ్చేవాడు అటెండర్‌ లక్ష్మయ్య. మాష్టారు కోదండం వేస్తానంటే వద్దని దండం పెట్టే వాళ్ళం మేం. ఆయన మనసు వెన్న. గోడ కుర్చీతో సరిపెట్టేవారు. ఇప్పుడు నా పొజిషన్‌ చూస్తే సంతోషిస్తారేమో? ధర్మయ్య మాష్టారు, లక్ష్మయ్య ఇప్పుడేం చేస్తున్నారో?ఊళ్లో బస్సు దిగగానే కనిపించే చిన్న రామాలయం. అంతకుముందు మ ఊళ్లో అసలు గుడి ఉండేది కాదు. గుడి కట్టాలని ఊరిపెద్దలు రచ్చబండ దగ్గర సమావేశమైన క్షణాలు, చందాలు వసూలు చేసుందుకు మామయ్యతో గడపగడపా తిరిగిన రోజులు రామాలయం ధ్వజస్తంభం చిరుమువ్వల సవ్వడిలా గుర్తొచ్చాయి. ఇది ఏనుగు వాళ్ల ఇళ్లు. అది వారి ఇంటి పేరులెండి. మా ఊళ్లో అలాగే పిలుస్తారు. నా చిన్నప్పుడు మా ఊళ్లో ఉన్న టీవీ ఉన్న ఇళ్లు అదొక్కటే. ఆదివారం సాయంత్రం దూరదర్శన్‌లో వచ్చే సినిమా కోసం దీపం చుట్టు పురుగుల్లా వాళ్లింట్లో చేరేవాళ్ళం. ముందు వరుసలో కూర్చోవాలంటే గంట ముందైనా వెళ్లి ఎదురుచూడాలి. ఇప్పుడు ఎవరింట్లో వారి టీవీ.. పూరిపాకల్లో కూడా కలర్‌ టీవీ... ఠీవీ...ఇదీ నర్సివాళ్ల ఇల్లు. ఎంత పడవ పడిపోయింది. చిన్నప్పుడు బళ్లో బలపం దగ్గరి నుంచి... కాలేజీలో బైక్‌ కోసం డబ్బు బదులు వరకు ఎంత సహాయం చేశాడు నాకు. పాపం ఒక్కడే కొడుకు. నాన్న చనిపోయిన అర్నెల్లకే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన రెండు నెలలకే యాక్సిడెంట్‌లో చనిపోయాడు. వాడితో జ్ఞాపకాలు కనీసం జ్ఞాపకాలుగానైనా గుర్తున్నాయి సరిపుచ్చుకోవడం తప్ప వాడి తల్లి కోసం నేనేం చేయగలిగాను. అదిగో ఆ ఇంట్లో.. రాజేశ్వరి అక్క.. ఎంత మారిపోయింది. ఆ పాప ఎవరు? తన కూతురు కాబోలు. తనకు పెళ్లయిన అప్పటి నుంచి చూడలేదు. పండక్కి వచ్చిందన్నమాట. ఆ బొమ్మలు ఏంటి? బొమ్మలు కొలువుకు ఏర్పాటు చేస్తుందేమో? చిన్నప్పటి బొమ్మల పెళ్లి చేసేది. అందులో నేనే పెళ్లి కొడుకుని. మరి పెళ్లి కూతురు? శ్యామల. ఇప్పుడు తనకు కూడా పెళ్లయిపోయి ఉంటుంది. ఇదే మా ఇల్లు. మా తాత గారు కట్టించారు. ఇప్పుడు ఆయన పోయారు నాన్నమ్మ ఒక్కతే ఉంటుంది. ---కొక్కొరొకో అని కోడి కూసింది. సెల్‌ఫోన్‌ అలారానికి అలవాటు పడిన చెవులకు ఆ ఉదయం... ఆ శబ్ధం.. ఎంత హాయి. నాన్నమ్మ నిద్రలేచి గేదె పాలు పితికేందుకు బయలుదేరింది. తెలియకుండానే తనతో నేనూ బయలుదేరా. వేపపుల్లతో పళ్లు తోపుతూ.. అలా ఊరవతలికి బయలుదేరా... రహదారిలా ఉండే ఆ దారి చిన్న డొంకలా మారిపోయింది. దారి అంతా చిల్ల కంప. నడవడమే కష్టంగా ఉంది. ఆ దారితో మాకు ఎంత అనుబంధం. వర్షాకాలం ఆ ఇసుకలో గుళ్లు కట్టే వాళ్లం. దారి వెంట ఉండే ఇరికి పండ్లు, రేగు పండ్ల కోసం వెతికేవాళ్లం. టీలు టిఫినీలు కానిచ్చి స్నేహితులతో తాండ్రోని బావిలో ఈతకు బయలుదేరా. చుట్టు పక్కల నాలుగు ఊళ్లలో ఆ బావి ఈతకు ఎంతో ఫేమస్‌. నిండా నీళ్లతో నిండు గర్భిణిలా ఉండేది ఆ బావి. నీళ్లలో మునుగుతూ పక్కవాళ్లనీ పట్టించుకోకుండా దొగాట ఆడేవాళ్లం. అలా పట్టించుకోనందుకే కదా ఈత రాని అర్జున్‌ బావిలో మునిగి చనిపోయాడు. అప్పటి నుంచి చాలా మంది ఆ బావిలో ఈతకు వెళ్లడం మానేశారు. ఆ బాధతోనే బావి ఇప్పుడు ఇంకిపోయిందేమో. వరిచేలు కోశాక పరిగి కోసం పరుగులు, చెరువు లూటీ పోయాక చేపల కోసం ఆరాటం, తాటి చెట్ల మధ్య కల్లు తాగి చిందులు.. చింత చిగురు, రేగు పండ్ల, బొండు మల్లెలు, బంతిపూలు, ఓమ చుట్టలు, పచ్చి వేరు శనగ కాయలు, ఉడకబెట్టిన పెసరకాయలు, అగ్గిపెట్టెలో రింగన పురుగులు, తాటి ముంజ కాయల బండి, సైకిలు టైరుతో ఆటలు, జిల్లగోన, అష్టచెమ్మ, వన భోజనాలు, బోనాలు ఇలా ఎన్నో జ్ఞాపకాలు, తీపి గుర్తులు... సంక్రాంతి పండగంటే ఎంత సందడి. ఒక రోజు ముందే పిల్లలంతా రేగు పండ్ల కోసం చేల వెంట వెళ్లేవాళ్లు. ఈ సారి అలా ఏం కనిపించలేదు. పండగంతా నీరసంగా అనిపించింది. ఎందుకు అలా ఆరాతీస్తే... పండగ ముందు పంట చేతికి వచ్చినా అప్పుడు పోలేదు. పత్తికి గిట్టుబాటు ధర పలకపోవడంతో చాలా మంది అమ్మలేదు. పైసలుంటేనే పండగ సందడి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక మాంద్యం మా ఊరిని మాత్రం ఎలా వదులుతుంది చెప్పండి. గంజి నీళ్లు తాగి.. మా ఇంట్లో గుంట పొంగనాలు చేసుకున్నాం అని చెప్పుకున్న రైతుని చూసి జాలి వేసింది. గ్రామానికి ఎంత కష్టం. మొత్తంగా ఈ సంక్రాంతి అంత సందడిగా అనిపించలేదు. ముగ్గుల్లో రంగులు తప్ప జీవం కనిపించలేదు. అప్పుడు కళ కళలాడేది పల్లె. ఆ కళ... ఇప్పుడు కేవలం కల.

9 comments:

శ్రుతి said...

పండగ రోజే కాదు ఎప్పుడెళ్ళినా ఆప్యాయంగా హత్తుకునేది పల్లె. పట్నాన్ని చూసి కొద్దిగా వాతలు పెట్టుకున్నట్లుంది ఇప్పటి మన పల్లె ( నవతరం అనాలేమో ). అమ్మఛాటున దాగిన చటిపిల్లలాంటి పల్లే ఇప్పుడు పంచెకట్టుపై టీషర్ట్ వేసుకుంది. పలకరించాలా వద్దా, ముందు పలకరిస్తే మనం తక్కువగా కనిపిస్తామేమో అన్న సంశయం కొత్త కోడలి గడుసుతనంలా వచ్చిందిలెండి.
ఏదేమైనా పల్లే మన కందనంత దూరం వెళ్ళిపోయింది. ఒక్కసారి మళ్ళీ మాటల్లో కనిపించింది అనాటి మన పల్లె. ధన్యవాదాలు

pseudosecular said...

ప్రస్తుత పల్లెల పరిస్తితి గురించి బాగావ్రాసారు.

Above all, the Soul harvesters hovering in the villages, to snatch their soul of aged people.

Educated young people left villages by leaving aged (parents and grand-parents) people there. And many able bodied people left villages for work elsewhere.

Once self sufficient villages are reduced to rubbles. Villages are crying for help.

Anonymous said...

ఎంత చక్కగా వ్రాసారు..!! మీతో పాటే మీ వూర్లో తిరిగిన అనుభూతి అంతలోనే "పల్లె కన్నీరు పెడుతుందో.." అనే పాట గుర్తుకొచ్చింది. అభినందనలు.

అరిపిరాల

Anonymous said...

gundela meeda guddesharandi

చిలమకూరు విజయమోహన్ said...

ఏ పల్లె పరిస్థితి చూసినా ఇదే,గతంలో పల్లెల పరిస్థితి తో నేటి పరిస్థితి పోల్చుకుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి.

durgeswara said...

తల్లిలాంటి పల్లెను పట్నంపడుచులానే పాడుచేసే కుట్ర గురించి పాట ॒ అదే పల్లే కన్నీరు పెడుతుందో కనిపించనై కుట్రల ,నాతల్లీ కన్నీరు పెడుతుందో ...విన్నప్పుడల్లా ఏడుపొస్తుంది.చిన్ననాటి పల్లెలలో స్థితులను ఇప్పటి కనులముందు దృశ్యాలను చూస్తుంటే.నిజమే నాతల్లీ కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...

Anonymous said...

very touching one.baga rasaru.

సుభద్ర said...

bagundi,

Uyyaala said...

పల్లెలు... ప్రత్యేకించి తెలంగాణా పల్లెలు రక్త మాంసాలు కోల్పోయి ఆస్థి పంజరాల్లా మారుతున్న దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అభినందనలు.

ఒక సూచన. matter ni పేరాలు గా విభజించి - పేరా పేరా కి మధ్య లైన్ గ్యాప్ ఇవ్వండి చదవడానికి చూడడానికి ఇంపుగా వుంటుంది.