గూగుల్ బతుకమ్మ

By | October 21, 2012 9 comments

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు.
లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది.
‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు.
Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది.
‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ.
‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది.
‘మీ మమ్మీని అడక్కపోయావా.
‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’
‘ఏంటది?’
‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’
‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తెలంగాణలోనే అవి పూస్త్తయి..’
‘ఓ అలాగా, మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏమంటరు?
‘ఇంగ్లీష్‌లోనా? తంగేడు అనే రాయ్’
‘నో డాడీ.. రాయడానికి కాదు.. తంగేడు అని కొడితే గూగుల్‌లో ఇమేజ్‌లు పెద్దగా రావడం లేదు. అందుకే ఇంగ్లీష్‌లో చెప్పు డాడీ’
అడగ్గానే చెప్పడానికి లతిక వాళ్ల ఫాదర్ శ్రీరామ్ ఏమీ బోటనిస్ట్ కాదు. ఆ స్కూల్ టీచర్ ఎవరో కానీ పెద్ద పరీక్షే పెట్టింది. తంగేడు పూలని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఈ ప్రశ్న ఆ రాత్రి అతనికి నిద్ర లేకుండా చేసింది. లతిక పడుకున్నాక గూగుల్ ఓపెన్ చేసి పువ్వుల గురించి వెతకడం మొదపూట్టాడు. తంగేడు పూలని టన్నెర్స్ కాస్సియా (tanners cassia), బంతి పూలని ఎల్లో మ్యారీగోల్డ్స్ అంటారని తెలిసింది. కానీ గునుగు పూలని ఏమంటారో తెలుసుకోవడానికి చాలా సమయమే పట్టింది. వైట్ లెట్యూస్ పూలు గునుగు పూలలాగే ఉన్నాయి కానీ.. ఆ పదం వాడొచ్చా? వైట్ లెట్యూస్ అని గూగుల్‌లో వెతికితే చిన్న చిన్న పూలు కనిపిస్తున్నాయి.

అవి గునుగు పూలలాగే ఉన్నాయి కానీ.. కావు. అందుకే వైట్ లెట్యూస్‌కి కాస్త నేటివ్ ఫ్లేవర్‌ని యాడ్ చేసి తెలంగాణ వైట్ లెట్యూస్ అని రాసుకున్నాడు. కట్ల పూల గురించి, చామంతి, నందివర్థనం, బీర, గుమ్మడి, ఇలా బతుకమ్మని పేర్చేందుకు వాడే అన్ని పూల ఆంగ్ల నామాలు వెతికి ఇమేజ్‌లు ప్రింటవుట్ తీసి రికార్డ్ తయారు చేసి పెట్టాడు. అయినా ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తంగేడు పూలు కళ్లలో కదిలాయి. గునుగు పూలు ఏవో గుసగుసలు చెప్పాయి. బంతి, చామంతి గతంలోకి తీసుకెళ్లాయి.

పదిహేను సంవత్సరాల క్రితం...
శ్రీరామ్.. కొత్త బట్టలు కట్టుకున్నాడు. బెల్ బాటమ్ ప్యాంటు.. పెద్ద కాలర్ చొక్కా.. రింగుల జుత్తుతో స్టైల్‌గా తయారయ్యాడు. ఊరి చివర చెరువు గట్టు దగ్గర అతని కళ్లు ఎవరినో సెర్చ్ చేస్తున్నాయి.
పట్టు లంగా వోణీ కట్టుకుని.. తలనిండా మల్లెపూలు పెట్టుకుని ఆమె వస్తోంది. నల్లని పొడవైన జడ.. నడుస్తుంటే ఊగే జడగంటలు.. చేతిలో రంగు రంగుల పూల బతుకమ్మ.. అంతే ఆమెని చూడగానే అతని కళ్లల్లో కార్నివాల్.

కట్ చేస్తే.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. లతిక, లాస్య ఇద్దరు పిల్లలు. బతుకు పోరాటం.. హైదరాబాద్ ప్రయాణం.. ఇల్లు.. ఇల్లాలు.. పిల్లలు.. చదువులు.. ఉద్యోగాలు.. ప్రమోషన్లు.. ఇంక్రిమెంట్లు..
ఈ మధ్యలో ఎన్నో బతుకమ్మ పండగలు ఫేడ్ అయిపోయాయి.
ఆ లైఫ్ హ్యాంగోవర్ ఇప్పుడు విచ్చుకుంది.
తనని తాను తెలుసుకోవాలనుకున్నాడు. తన కూతుళ్లకు తెలియజెప్పాలనుకున్నాడు. అందుకే ఈసారి బతుకమ్మకి ఊరెళ్లాలనుకున్నాడు.
నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీ మూలాల్లోకి వెళ్లాలి. మీ ఊరెళ్లాలి.
అప్పుడు తెలంగాణ అస్తిత్వ మూల ప్రతీకగా నీకొక బతుకమ్మ దొరుకుతుంది.
ప్రతి పువ్వుకీ ఒక రంగుంటుంది. ప్రతి రంగుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది.
అలాగే ప్రతి ప్రాంతానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే మన గుర్తింపుని, అస్తిత్వాన్ని తెలుపుతుంది.
మన బతుకమ్మ పండుగ అచ్చు అలాంటిదే.
కట్టుబాట్లన్నీ మనుషులకే కానీ నీటికి, పూలకూ లేవని చెబుతూ అందరూ సామరస్యంగా కలిసి మెలసి జరుపుకునే పండుగ.
తెలంగాణ విశిష్టతని చాటి చెప్పే.. పూల జాతర చేయాలి.
ఒక కన్వెన్షన్ ఆఫ్ బయో డైవర్సిటీ.
అందుకే బతుకమ్మని బతికించుకోవాలి.
ఆ పునరుజ్జీవనానికి బీ రెడీ.

9 comments:

cg9 said...
This comment has been removed by the author.
డా.ఆచార్య ఫణీంద్ర said...

EXCELLENT NAGESH GARU!

GUNDENU TADIMARU!

CONGRATS!

Raju asari said...

bro keka

krishna kumar said...

wow wonderful telling brother..
but all telagana people are same feeling.

Anonymous said...

inspiring...

Anonymous said...

ఇందులో ఒక సమాచారం పొఱపాటు. తంగేడుపూలు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లోనూ పూస్తాయి.

Uyyaala said...

మీ గూగుల్ బతుకమ్మ అద్భుతంగా వుంది.

>>> నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీ మూలాల్లోకి వెళ్లాలి. మీ ఊరెళ్లాలి.
అప్పుడు తెలంగాణ అస్తిత్వ మూల ప్రతీకగా నీకొక బతుకమ్మ దొరుకుతుంది.

ప్రతి పువ్వుకీ ఒక రంగుంటుంది. ప్రతి రంగుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది.
అలాగే ప్రతి ప్రాంతానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే మన గుర్తింపుని, అస్తిత్వాన్ని తెలుపుతుంది.

మన బతుకమ్మ పండుగ అచ్చు అలాంటిదే. <<<<

ఎంత బాగా చెప్పారు
మీకు నా హృదయపూర్వక అభినందనలు.

Anonymous said...

ఇది బతుకమ్మ అంటే. ఇది సంస్కృతి అంటే. చక్కగా చెప్పారు. పుష్పవైవిధ్యం చూపే రంగుల పండుగ అన్నారు, ఎంత బావుంది చూడండి.

'రాజకీయాలు చేసి బతుకమ్మ ను జాతీయ పండుగగా చేయాలి, బతుకమ్మ ఆడకపోతే తెలంగాన మీద నిబద్ధత లేనట్టే అనే కుళ్ళు రాజకీయాల్ని దూరంగా పెడితే... మా సీమాంధ్ర వూర్లో బీడు ప్రాంతాల్లో పచ్చగా పూచే తంగేడు పూలు బ్రతుకమ్మను గుర్తు తెప్పించక మానవు.

Anonymous said...

ఇప్పుడు బ్రతుకమ్మ పండుగ ఫక్తు రాజకీయ పండుగే తప్ప సాంస్కృతికం కాదు.