ఒకప్పుడు అతిపెద్ద సామ్రాజ్యంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యాన్ని పాలించిన ఓ వీర వనిత గాథ

By | December 20, 2014 Leave a Comment

స్వాతంత్య్రానికి పూర్వం దేశాన్ని తెల్లదొరలు, రాష్ర్టాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. అడవి తల్లి ముద్దు బిడ్డలైన ఆదివాసీలు బుక్కెడు బువ్వ కోసం కష్టాలు పడుతుంటే.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జల్.. జంగల్.. జమీన్.. అంటూ గర్జించాడు మన గోండు వీరుడు కొమురం భీమ్. 
అది ఒక స్వేచ్ఛా పోరాటం. ఈ సువిశాల భారతదేశంలో ఆదివాసులది మొదటి నుంచీ ఇలాంటి పోరాటమే. ఒకప్పుడు అతిపెద్ద సామ్రాజ్యంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యాన్ని పాలించిన ఓ వీర వనిత గురించి ఎప్పుడైనా విన్నారా? మొఘలుల సామ్రాజ్యం ఉత్తర భారతం మొత్తం విస్తరించినా, దక్షిణ భారతంలో విస్తరించకుండా పోరాడిన యోధులు గోండులు. ఆదిలాబాద్ అడవులు మొదలుకుని.. 
దక్షిణ భారతదేశం సరిహద్దు భూభాగంలో మధ్య భారతపు అతి పెద్ద వన సామ్రాజ్యం గోండ్వానా.
450 సంవత్సరాల క్రితం మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్ గోండ్వానాను ఆక్రమించడానికి యత్నిస్తే 
ఎదురొడ్డి పోరాడింది రాణీ దుర్గావతి. శత్రువు చేతికి చిక్కి బానిసగా బతికేకంటే.. విజయావకాశాలు లేనప్పుడు ఆత్మత్యాగం చేసుకుని గోండ్వానా శౌర్యాన్ని, ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన ధీర వనిత మహారాణి దుర్గావతి ఈ వారం మన వీర నారి. 

గోండు-వన.. గోండ్వానా..


దక్షిణాన సాత్పూర పర్వతాల నుంచి ఉత్తరాన నర్మదా నది వరకు విస్తరించిన సువిశాల సామ్య్రాజ్యం.. గోండ్వానా. 
గోండులు మధ్య భారతదేశానికి చెందిన ద్రవిడులు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని (విదర్భ), చత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, దక్షిణ ఒడిశా భూభాగాలలో గోండ్వానా రాజ్యంగా ఆదివాసుల పాలన కొనసాగింది.
The Gonds of Vidarbha (విదర్భ గోండులు) పుస్తకంలో ఎస్. జి. డియోగాంకర్ గోండుల పాలన గురించి వివరంగా రాశారు. ఆదిలాబాద్ గోండులు చంద్రాపూర్ నుంచి వలస వచ్చారని, వారే రాజ్ గోండులని వివరించారు. దీని గురించి డాక్టర్ బి. హెచ్. మెహతా చేసిన మధ్యభారతంలో గోండులు(Gonds of the Indian Central Highlands) అధ్యయనంతో ఆయన ఏకీభవించారు.

15 శతాబ్దంలో నర్మాదా నదీ తీరాన జబల్‌పూర్(మధ్య ప్రదేశ్)కి దగ్గరలో ఘడ్ కేంద్రంగా గోండ్వానా రాజ్యం ఏర్పడి.. ఆ తర్వాత చందా(చంద్రాపూర్), డియోఘడ్‌గా విస్తరించింది. చంద్రాపూర్‌ను పాలించిన రాజుల ఆధీనంలోనే ప్రస్తుత ఆదిలాబాద్‌లోని కొంత ప్రాంతం ఉండేదని అందులో చెప్పారు.
గోండుల మీద విశేష పరిశోధన చేసిన చరిత్రకారుడు పక్డి సేతు మాధవరావు మాత్రం.. 1323లో కాకతీయుల సామ్రాజ్య పతనానంతరం.. చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్‌కు దగ్గరలో సిర్పూర్ కేంద్రంగా గోండు రాజ్యం ఏర్పడి.. ఆ తర్వాత చంద్రాపూర్ వైపు విస్తరించి ఉండొచ్చు అని చెప్పారు.
ఉత్తరం నుంచి దక్షిణం అయినా.. ఇటు నుంచి అటు అయినా.. ఆదిలాబాద్ గోండులు గోండ్వానాలో భాగంగా ఉన్నారని తెలుస్తోంది. మన గోండులే కాదు.. యావత్ భారత చరిత్రలో వీర నారిగా, శౌర్యవంతురాలుగా చెప్పుకునే గోండు వనితే మహారాణి దుర్గావతి.

1542..


గోండ్వానా మహారాజు సంగ్రమ్‌షా తన కుమారుడు దళపత్‌షాకు వివాహం చేయాలని నిర్ణయించాడు. ఛండేలా వంశంలో జన్మించిన యువరాణి దుర్గావతి గురించి ఆయనకు తెలిసింది. దుర్గావతి వీరత్వం గురించి విన్న సంగ్రమ్‌షా తన కుమారుడికి సరైన జోడి అని భావించాడు. ఛండేలా చక్రవర్తి కీరత్ రాయ్ కుమార్తె దుర్గావతి. 1524, అక్టోబర్ 5వ తేదీన దుర్గావతి ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలోని కలింజర్ కోటలో జన్మించింది. భారతదేశ చరిత్రలో ఛండేలా వంశానికి అత్యంత ధైర్యసాహసాలు గలదిగా పేరుంది. ఛండేలా రాజు విద్యాధర్ తన రాజ్యంపై దాడిచేసిన మహ్మద్ ఘజినీని ముప్పుతిప్పలు పెట్టాడు. రాజు విద్యాధర్‌కు చిత్ర, వాస్తుకళలు అంటే ఎంతో ప్రీతి. దీనికి ప్రతిబింబమే ఖజురహో దేవాలయాలు, కలింజర్ కోట.

వీరనారిగా పేరు ప్రఖ్యాతలు


1540లో బాబర్ తరువాత పరిపాలనా బాధ్యతల్ని చేపట్టిన హుమాయున్‌ను పఠాన్ వీరుడైన షేర్ షా సూరి జయించి ఢిల్లీ కేంద్రంగా సుర్ సామ్రాజ్యం స్థాపించాడు.

మొఘలులకు చిక్కకుండా తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాలని కంకణం కట్టుకున్న షేర్ షా కంట్లో గోండ్వానా రాజ్యం పడింది. మాల్వా సుల్తాన్‌ను జయించి సుజిత్ ఖాన్‌కు అప్పగించాడు షేర్షా. సుజిత్ ఖాన్ మరణానంతరం అతని కుమారుడు బజ్ బహదూర్ సింహాసనం ఎక్కాడు. గద్దెనెక్కిన నూతన ఉత్సాహంతో బజ్ బహదుర్ రాణీ దుర్గావతి మీదికి దండెత్తాడు. అతని సైన్యాన్ని రాణీ దుర్గావతి అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టింది. సైన్యం ఘోరంగా దెబ్బతినడంతో బజ్ బహదుర్ తోకముడిచాడు. దీంతో దుర్గావతి వీరనారిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆమెను ఏమీ చేయలేక బజ్ బహదుర్ ఆ తర్వాత అక్బర్‌తో చేయి కలిపాడు. దుర్గావతి వీరత్వాన్ని అక్బర్‌కు వివరించాడు. అది మింగుడు పడని అక్బర్ ఎలాగైనా గోండ్వానాను చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

మూడు దఫాల యుద్ధం


దుర్గావతిని జయించేందుకు అక్బర్ తన వైస్రాయ్ అసఫ్ ఖాన్‌ను పంపాడు. దుర్గావతి తన సేనాని ఫౌజ్ద్దర్ అర్జున్ దస్వాస్‌ను సైన్యంతో పంపింది. మొదటి దఫా యుద్ధంలో ఫౌజ్దర్ చనిపోయాడు. దీంతో మహారాణి స్వయంగా యుద్ధరంగానికి బయలుదేరింది. తన సేనానులు, సైన్యాన్ని సమీక్షించింది. మొఘల్ సైన్యం బలంగా ఉందని వెనుదిరగడం అనివార్యమని తేలింది. ఈ విషయం ఒప్పుకోని మహారాణి యుద్ధానికే సిద్ధపడింది. మరోవైపు యువరాజు వీర్ నారాయణ్ సైన్యంతో అసఫ్ ఖాన్ మీదికి ఎగబడ్డాడు. ఆ యుద్ధంలో వీర్ గాయాలపాలై వెనుదిరిగాడు. దీంతో రాణి దుర్గావతి తన గజరాజు సర్మాన్ మీద యుద్ధ రంగానికి వెళ్లి పోరాడింది. గజకేసరి అయిన దుర్గావతి శత్రువులకు ముచ్చెమటలు పట్టించింది. ఇంతలోనే రెండు బాణాలు ఆమె వైపు దూసుకొచ్చాయి. ఒకటి భుజం మీద, మరొకటి చెవి కింది మెడలో బలంగా గుచ్చుకున్నాయి. ఆమె స్పృహ కోల్పోవడం మొదలైంది. ఇది గమనించిన మావటి తన మహారాణిని కాపాడుకునేందుకు సర్మాన్‌ను వెనక్కు తిప్పాడు.

కాస్త మెలుకువలోకి వచ్చిన దుర్గావతి ఇక విజయావకాశాలు లేవని తెలుసుకుంది. శత్రువు చేతిలో చనిపోవడం ఇష్టం లేక తనను చంపేయమని మావటిని అడిగింది. అందుకు మావటి మా మహారాణిని నేను చంపలేను అన్నాడు. దీంతో ఖడ్గంతో పొడుచుకుని ఆత్మత్యాగం చేసి ఆత్మగౌరవం చాటుకుంది దుర్గావతి. అది 1564 జూన్ 24. ఇది రెండో దఫా యుద్ధం. ఇక మూడోదఫాలో అసఫ్ ఖాన్ సైన్యం చౌరాఘర్ మీదకు విరుచుకుపడింది. వీర్ నారాయణ్‌ని చంపేసింది. చౌరాఘర్‌ను నాశనం చేసింది. ఆ తర్వాత గోండ్వానాను అక్బర్ చంద్ర షాకు అప్పగించాడు. అలా 1780 వరకు వివిధ గోండ్వానా రాజులు పాలించిన తర్వాత గోండ్వానా మొఘలుల చేతికి వెళ్లిపోయింది.

Rani_Durgawati

వీరనారి జ్ఞాపకార్థం


-1983లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్‌పూర్ యూనివర్సిటీకి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది.
- 1988 జూన్ 24న ఆమె వర్థంతి సందర్భంగా భారత ప్రభుత్వం రాణి దుర్గావతి పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
-జబల్‌పూర్ జంక్షన్ నుంచి జమ్ము తావి వరకు నడిచే రైలుకు మహారాణి జ్ఞాపకార్థం దుర్గావతి ఎక్స్‌ప్రెస్ (11449/11450) అని పేరు పెట్టారు.

ఛండేలా - గోండులు
రాణీ దుర్గావతి


1542లో గోండు వంశ రాజు దళపత్‌షాను వివాహమాడిన తరువాత ఛండేలా, గోండు వంశాలు మరింత దగ్గరయ్యాయి. షేర్ షా సూరి దాడి చేసినప్పుడు జరిగిన యుద్ధంలో గోండు వీరుడు దళపత్ షా సాయంతో కీరత్ రాయ్ విజయభేరి మోగించాడు.

nrani

రాణీ దుర్గావతి 1545లో కుమారుడికి జన్మనిచ్చింది. అతని పేరు వీర్ నారాయణ్. భర్త దళపత్ షా 1550లో కన్నుమూశాడు. అప్పుడు కొడుకు వీర్ నారాయణ్ చాలా చిన్నవాడు. దీంతో రాణీ దుర్గావతి పాలనా పగ్గాలు చేపట్టింది. పరిపాలనను సాఫీగా చేయడానికి రాణీ దుర్గావతికి మంత్రులు అధర్ కాయస్త, మన్ ఠాకూర్‌లు సహాయపడ్డారు. గోండ్వానా ప్రజల యోగక్షేమాలు చూసుకోవడంలో సఫలీకృతం అయ్యింది దుర్గావతి. సింగార్‌ఘర్ నుంచి తమ రాజధానిని చౌరాఘర్‌కు మార్చి అందమైన కోటను నిర్మించింది. గొప్ప సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఆమె సైన్యంలో వెయ్యి ఏనుగులు, 20 వేల అశ్వాలు ఉండేవని చెబుతారు. దుర్గావతి ఆధీనంలో 70 వేల గ్రామాలు ఉండేవట.


0 comments: