నల్గొండలో బస్సు దిగి మా ఊరి బస్సు ఎక్కగానే నాలో తెలియని ఉద్వేగం. ప్రియురాలి కోసం ఎదురుచేసే ప్రియుడిలా... కదలని కాలం.. తగ్గిని దూరం... అలా కళ్లు మూసుకున్నా. చిన్ననాటి జ్ఞాపకాల పొరలు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. సినామా రీళ్లలా గిరిగిరా తిరిగాయి... కిటికీలోంచి చల్లని గాలి వీచింది. ఉలిక్కి పడి లేచి చూస్తే.. మా ఊరి పొలిమేర... "ఈ ఊరు... ఈ గాలి... ననుగన్న నా వాళ్లు...'' మనసు మౌనంగా పాడింది. ఇదే మా ఊరి చెరువు. వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద మోకాలు లోతు నీళ్లు వచ్చేవి. మా ఊరి బళ్లో ఐదో తరగతి వరకే ఉంది. ఆ తర్వాత పక్క ఊరికి వెళ్లాల్సిందే. చెప్పులు చేతిలో పట్టుకుని పుస్తకాల సంచి తలపై పెట్టుకుని స్కూలుకు వెళ్లేందుకు వాగు దాటేవాళ్లం. ఆ నీటి తడి స్పర్శ ఒక్కసారి కాళ్లకు తాకినట్లు అనిపించింది ఆ జ్ఞాపకం. భుజాన నాగలి ఎత్తుకుని వెళ్తున్నారే.. వాళ్లు మా ఊరి రైతులే. కోడవళ్లు చేతిలో పెట్టుకుని పొలం గట్టు వెంట వెళ్తున్న ఆడపడుచులు కూడా మా ఊరి కూలీలే. అదిగో మల్లయ్య తాత.. ఎడ్లబండి... ఆ ఎడ్లు కవలల్లా ఉంటాయి. వాటి పేర్లేంటో తెలుసా? రామ, లక్ష్మణులు. అదే మా ఊరి బడి. రెండెక్కం నేర్పిన తొలి దేవాలయం. నేను ఐ...