ఈ చెట్టు ఊరికిపోయింది తెలుసా? మొన్నటి వరకు ఇది చౌటుప్పల్ దగ్గర ఉండేది. ఇప్పుడు చిట్యాలకు వెళ్తుంటే రైల్వే బ్రిడ్జీ దగ్గర కుడివైపు ఉంటోంది. చెట్టు ఊరికి వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా? చెట్లకు చక్రాలుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో. రోడ్ల వెడల్పు పెంచినప్పుడల్లా ఎంచక్కా అవి అవతలివైపు కెళ్లి నిలబడి ఉండేవి. చక్రాలు లేవు కదా చక్రాలున్న వాహనాలు హాయిగా తిరగడం కోసం వాటిని నిలువునా నరికి చంపడమూ న్యాయం కాదు. అందుకే ఈ మధ్య వాటిని సగం సరికి మరోచోట పాతి సగమూ బతికేలా చేస్తున్నారు. ఎవరో కోర్టుకెళ్లి ఆర్డరు తెచ్చుకునేదాకా ఆగకుండా ప్రతి రోడ్డు విస్తరణలోనూ ఈ పద్ధతిని భాగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా దేని గురించి అంటారా? తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి విస్తరణ గురించి. రోడ్డుకు ఇరువైపునున్న తొమ్మిది వేల చెట్లలో కేవలం 36 చెట్లని మాత్రమే తీసి వేరే చోట నాటారు. బతికాయా? ఎలా ఉన్నాయి అంటారా? మీరే చదవండి. అ శోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను. పాదచారులు ఆ చెట్ల నీడలో సేదతీరెడివారు- అని చిన్నప్పుడు బట్టీ పట్టిన పాఠం మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంది తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు చూస్తున్నప్పుడు....