‘సీనియర్ పాత్రికేయులు బాలస్వామి మృతి’... ఈ వార్త పేపర్లో చూడగానే నాకు పెద్దగా బాధనిపించలేదు. బాధపడడానికి ఆయన నాకేం పరిచయం లేని వ్యక్తి కాదు. బాగా పరిచయం. నాలుగేళ్ల అనుబంధం. ఏడాది కలిసి పనిచేసిన అనుభవం. అయినా నాకెందుకు బాధ అనిపించడం లేదు? పసిపాప నవ్వుని చూసి.. ప్రవహించే సెలయేటిని చూసి పరవశించి పోయే నాకు.. రోడ్డుపై పారే రక్తాన్ని.. మార్చురీలో కోసిన శవాల్ని, బండరాయితో మోదిన తలకాయల్ని, చెరువులో తేలిన చిన్నారుల్ని, ఫ్యానుకు ఉరేసుకున్న అమ్మాయిల్ని చూపించిన వ్యక్తి బాలు. ఎందుకు నేస్తమా నన్నింత కరుడుగట్టిన వాడిలా చేశావు? నీవు లేవని తెలిశాక.. పెద్దగా స్పందించకుండా తయారు చేశావు? నీవు లేకపోయినా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఉస్మానియా మార్చురీలో నీతో కలిసి చూసిన శవాలు.. అర్థరాత్రి రెండు మూడు గంటల వరకు ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో గడిపిన క్షణాలు కళ్ల ముందు కనిపిస్తూ నన్ను కకావికలం చేస్తున్నాయి దోస్త్. --- బాలస్వామికి క్రైమ్ రిపోర్టర్‌గా మంచి పేరుంది. కొంత కాలం ప్రజాశక్తిలో పనిచేశాడు. అప్పుడు నేను ఏ ఇంటరో డిగ్రీనో చదువుతుండి ఉంటాను. బాలస్వామి ఉద్యోగం మానేసి సొంత ఊరికి వెళ్లి ప్రయివేటు స్కూల్ పెట్ట...