హైదరాబాద్‌లో రోడ్ల పక్కన పెద్ద పొట్టతో నడవలేక నడవలేక నడుస్తున్న ఆవులను మీరెప్పుడైనా చూశారా? ‘ఇది రోడ్ల మీద దొరికిందల్లా తిని ఎలా బలిసిందో చూడరా!’ అని ఒకసారి ఒక ఆవుని చూపిస్తూ అన్నాడొక ఫ్రెండ్. అప్పుడు నాకు చెప్పాలనిపించింది కానీ చెప్పలేదు. ఇప్పుడు ఈ ఆవు గురించి చదివాక వాడే అర్థం చేసుకుంటాడు. ఖమ్మం జిల్లా టాబ్లాయిడ్ పేజీలో ఇంటర్‌నెట్‌లో తిరగేస్తుంటే ఒక చిన్న వార్త కనిపించింది. నున్నా మాధవరావు అనే ఆయన ఆవు నాలుగు రోజులుగా మేత మేయడం లేదు. తీవ్ర అస్వస్థతకు గురైంది. రోజు రోజుకూ కడుపు పరిమాణం పెరుగుతోంది. ఆవు అప్పుడప్పుడూ గిలగిలా కొట్టుకుంటుండేది. దీంతో ఆయన ఒక పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ సకాలానికి ఆపరేషన్ చేయడంతో ఆ ఆవు బతికింది. కాకపోతే దాని కడుపులోంచి బయటపడ్డ ప్లాస్టిక్ కవర్లను చూశాక మాధవరావు గుండె పగిలిపోయింది. ఆయనకే కాదు.. ఇది చదివిన ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. ప్లాస్టిక్ వినియోగంలో ప్రజల అవగాహనాలోపం.. నిషేధం అమలులో అధికారుల బాధ్యతా రాహిత్యానికి పర్యావరణమే కాదు.. మూగ జీవాలు కూడా బలవుతున్నాయి.