Skip to main content

'వారిలా కలగనండి.. వారిలా సాధించండి'

ఇంగ్లీషులో జనాదరణ పొంది, ఎన్నో భారతీయ భాషల్లోకి అనువాదమైన 'స్టే హంగ్రీ స్టే ఫూలిష్‌'కి తెలుగు అనువాదం ఈ పుస్తకం. నలుగురు నడిచే దారిలో మనం నడిస్తే థ్రిల్‌ ఏముంటుంది? మనమే ఓ కొత్త మార్గాన్ని కనిపెడితేనే ఉంటుంది మజా. కానీ ఆ కొత్తబాటలో ఎన్నో ముళ్లుంటాయి. రాళ్లు రప్పలుంటాయి. ఎత్తుపల్లాలుంటాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌లో చదివి తమ భవిష్యత్తుకు అలా బంగారుబాటలు వేసుకున్న 25 మంది వ్యాపారవేత్తల విజయగాథల్ని ఈ పుస్తకంలో వివరించారు రచయిత్రి.

'వ్యాపార రంగంలో ఎదగాలని ఎంతోమందికి ఉంటుంది. ఒకవేళ అలా జరిగివుంటే నేను కోటీశ్వరున్ని అయిఉండేవాడ్ని.. ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈపాటికి కంపెనీ పెట్టి ఉండేవాడ్ని.. ఇలా మనం చాలాసార్లు అనుకుంటుంటాం. ఈ 'ఒకవేళలు' మనం కనే పగటి కలలు కావు. అవి మన ఆశలు, ఆకాంక్షలు, మన స్వప్నాలు. మనం 'ఏదో ఒకరోజు' అనే పెట్టెలో వీటిని భద్రంగా మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువునీ, తర్కాన్నీ కలరా ఉండల్లా వాటి పక్కనబెట్టి భద్రంగా ఉంచుతాం. ఆ తర్వాత దాన్ని మరిచిపోయినవాళ్లు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను ఎవరు చేజిక్కించుకుంటారో వారు జీవితంలో ఎదుగుతారు. మీరు అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెబుతోందో వినండి. మీరు సబ్బులమ్ముకునేవాడిలా మిగిలిపోకూడదని, కార్పొరేట్‌ బానిస అస్సలు కావొద్దని చెబుతోందా? అయితే మీ టాలెంట్‌తో మీరు సాధించాల్సింది ఇంతకన్నా పెద్దది, ఇంతకన్నా మంచిది మరేదో ఉందన్నమాటేగా. దానికోసం మొండిగా మారండి. ఆకలికి ఎదురీదండి' అని చెబుతుంది ఈ పుస్తకం. "అవసరమైతే పస్తులుండండి. అవసరమైతే అవహేళలను ఎదుర్కోండి'' అని 2005లో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో తన విద్యార్థులకు పాఠాలు మొదలుపెడుతూ స్టీవ్‌జాబ్స్‌ సలహా ఇచ్చాడు. దీన్ని అచ్చంగా పాటించిన వారిగా కనిపిస్తారు ఈ పుస్తకంలోని పాతికమంది.
ఆ పాతికమంది గురించి మూడు భాగాలుగా చెప్పారు రచయిత్రి. దేన్నయినా గట్టిగా నమ్మినవాళ్లు ఒకరకం. దొరికిన అవకాశాలను అందుకున్నవాళ్లు రెండో రకం, సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లు మూడోరకం. మొదటి రకంవాళ్లలో 'నౌకరీ.కామ్‌' సంజీవ్‌బిఖ్‌ చందానీ, 'సుభిక్షా' సుబ్రమణ్యన్‌లాంటి వాళ్లని పరిచయం చేశారు. 'మేక్‌మైట్రిప్‌.కామ్‌' దీప్‌కాలరా, 'ఆర్కిడ్‌ ఫార్మా' రాఘవేంద్రరావులాంటి వాళ్ల గురించి రెండో కోవలో... 'సింటెక్స్‌' దన్‌గయాచ్‌, 'క్లోరోఫిల్‌' ఆనంద్‌ల గురించి మూడోకోవలో వివరించారామె. ప్రతి వ్యక్తి పరిచయం, వ్యాపారరంగంలో వారి ఎదుగుదలను వివరిస్తూ వారిచేత ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సలహాలు ఇప్పించారు. ఆ సలహాలు ఎంతో విలువైనవి. "మీకు వ్యాపారం చేయాలని ఆలోచన వస్తే దాని గురించి పగటి కలలు కంటూ కూర్చోకండి, దాన్ని వెంటనే అమలు చేయండి'' అని చెప్తారు 'మస్టెక్‌' వ్యవస్థాపకులలో ఒకరైన సుందర్‌. "నువ్వు ఉద్యోగం చేస్తున్నవాడివయితే నీ జీతం ఏడాదికి 15 నుంచి 18 లక్షల దాకా ఉందనుకుందాం. అప్పుడు ఐదేళ్ల కాలంలో నువ్వెంత సంపాదించగలవు? 18X5, అంతేనా? బహుశా నీకు మిగిలే ది 50 లక్షలు. అదే నువ్వు ఏదైనా వ్యాపారం చెయ్యి, ఐదేళ్ల కాలంలో నువ్వు అంతకంటే ఎక్కువే సంపాదించగలవు'' అంటారు 'ఎడుకాంప్‌' వ్యవస్థాపకుడు శంతను ప్రకాశ్‌. ఇలాంటి అమూల్యమైన సలహాలు ఈ పుస్తకంలో మీకు ఎన్నో దొరుకుతాయి. మీకు వ్యాపారరంగంలో విజయం సాధించాలని ఉంటే తప్పకుండా కొని దాచుకోవాల్సిన పుస్తకం.
---
వారిలా కలగనండి.. వారిలా సాధించండి
రచయిత : రశ్మి బంసల్‌, అనువాదం : వాడ్రేవు చినవీరభద్రుడు
పేజీలు : 385, వెల : రూ. 175
ప్రతులకు : రీమ్‌ పబ్లికేషన్స్‌, 30-05-01, దాభా గార్డెన్స్‌, విశాఖపట్నం-20

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

ప్రేమే కదా(కాదు) జీవితం

ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం. మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు. వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరా...

మరిచిపోలేని బహుమతి

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా. నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు...