Skip to main content

వేళ్లతోనే కళ్లను గెలిచాడు


పదిహేను సంవత్సరాల క్రితం... ఒకరోజు...
దారుల్‌ షిఫా అంధుల పాఠశాల, హైదరాబాద్‌
తొమ్మిదో తరగతి గది ఖాళీగా ఉంది. ఒక అబ్బాయి ఒంటరిగా కూర్చుని టేప్‌ రికార్డర్‌ వింటున్నాడు. అతని పేరు పవన్‌ కుమార్‌. అంతకుముందు రోజు ఆ అబ్బాయి స్కూల్‌కి డుమ్మా కొట్టాడు. అందుకే తన ఫ్రెండ్‌ దగ్గర క్యాసెట్‌ తీసుకుని పాఠాన్ని వింటున్నాడు. టీచర్‌ చెప్పిన పాఠం అయిపోయింది. ఆ తర్వాత టేప్‌ రికార్డర్‌లో ఒక పాట వినిపించింది. ఆ పాటలో ఒక బీట్‌ అతని మనసు దోచింది. ఆ సౌండ్‌ అతని మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయింది.
పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌ హోరులో కూడా అదే స్వరం అతని చె వుల్లో మారుమోగుతోంది. మెట్ల మీద చెప్పుల చప్పుడు, తెరుచుకుంటున్న తలుపు శబ్దం, నల్లా నుంచి వస్తున్న నీటి గల గల.. గదిలో తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ సౌండ్‌.. ఇలా అన్ని శబ్దాలను ఆ స్వరంతోనే పోల్చుకుంటున్నాడు ఆ అబ్బాయి. దేనిదా శబ్దం? ఎంత మాధుర్యంగా ఉంది?...  రాత్రి నిద్రలేదు. ఉదయం ఆకలి లేదు. మూడీగా ఉన్నాడు. అమ్మతో కబుర్లు చెప్పడం లేదు. నాన్నతో ఆడుకోవడం లేదు. "ఏమైందిరా అలా ఉన్నావు'' అని అడిగారు వాళ్ల నాన్న దయాకర్‌. పవన్‌ నుంచి సమాధానం లేదు. రెండు రోజుల తర్వాత టీవీలో అలాంటి సంగీతమే పవన్‌కి వినిపించింది. "ఆ శబ్దం దే నిది నాన్నా?'' పరుగున వచ్చి అడిగాడు పవన్‌. 'వయోలిన్‌' చెప్పారు దయాకర్‌. ఎగిరి గంతేశాడు పవన్‌. "వయోలిన్‌.. వయోలిన్‌'' పదే పదే అదే పదం పలికాడు. "నాన్నా! నేను వయోలిన్‌ నేర్చుకుంటాను'' అన్నాడు. మౌనంగా ఉండిపోయాడు తండ్రి.
***
సంగీతమంటే చాలామందికి ఇష్టమే. కానీ అందులో పరిజ్ఞానం సంపాదించాలంటే చాలా కష్టం. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికే అది కష్టమైనప్పుడు మా వాడికి అంత సులువుగా అబ్బుతుందా?- ఒక గదిలో కూర్చుని ఆలోచిస్తున్నారు దయాకర్‌.
నేను ఎలాగైనా వయోలిన్‌ నేర్చుకోవాలి. చాలా ప్రోగ్రాములు ఇవ్వాలి. చాలామందికి నేర్పించాలి. వయోలిన్‌ ఎవరు బాగా వాయిస్తారంటే నా పేరే చెప్పాలి. నేను అంతటి వాడ్ని కావాలి- మరో గదిలో పవన్‌ కలలు కంటున్నాడు.
ఒక రోజు.. "పదో తరగతి ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యావుగా. ఇంటర్‌లో కూడా అలాగే పాసవ్వు. వయోలిన్‌ నేర్పిస్తాను'' పవన్‌కు హామీ ఇచ్చాడు దయాకర్‌. పదో తరగతే కష్టంగా గట్టెక్కిన పవన్‌కు ఇంటర్‌ ఓ ఇనుప కొండలా కనిపించింది. అంధుల కోసం ప్రత్యేక కళాశాలలు అప్పట్లో లేవు. అందరితో పాటు చదువుకోవాలి. పాఠాలను రికార్డు చేసుకుని దాన్ని బ్రెయిలీలోకి మార్చుకోవాలి. అంటే మామూలు వారికంటే డబుల్‌ కష్టపడాలన్నమాట. వయోలిన్‌ నేర్చుకోవాలంటే తప్పదు మరి. మనకెందుకులే అని వదిలేస్తే పవన్‌ సైడ్‌ క్యారెక్టర్‌గానే మిగిలిపోతాడు. కానీ పవన్‌ హీరో కావాలనుకుంటున్నాడు. హీరో వెనుకడుగు వేయకూడదు. సవాళ్లతో సై అనాలి. ఛాలెంజ్‌తోనే ఛాలెంజ్‌ చేయాలి.
***
ఎవరైనా తోడు లేనిదే బయట కాలు పెట్టలేని పవన్‌ ఆలియా కాలేజ్‌లో అడుగుపెట్టాడు. అందరితోపాటే తరగతిలో కూర్చున్నాడు. చుట్టూ అంత మంది ఉన్నా పవన్‌ ఒంటరి. అందరూ నోట్స్‌ రాసుకుంటుంటే తను మాత్రం పాఠాన్ని రికార్డ్‌ చేసుకునేవాడు. ఇంటికి వెళ్లి దాన్ని బ్రెయిలీలో రాసుకుని ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకునేవాడు. ఒకరోజు క్లాస్‌లో లెక్చరర్‌ స్టూడెంట్స్‌ని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. పవన్‌ లేచి టక్కున సమాధాన ం చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ క్షణమే పవన్‌ వాళ్ల హృదయాలను గెలిచాడు. వారందరూ అతన్ని స్నేహితునిగా అంగీకరించారు. కట్‌ చేస్తే.. ఇంటర్‌ పరీక్షలు.. రైటర్‌ సహాయంతో రాసి ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యాడు.
***
హైదరాబాద్‌ కింగ్‌కోఠీలోని శ్రీ త్యాగరాయ సంగీత కళాశాల... పవన్‌ కలగన్న రోజు...
"అందరితో పాటు నేర్పలేం. ప్రత్యేకంగా చెప్పాలి. అంత సమయం ఉండదు'' అన్నాడు ఒక గురువు.
"గుడ్డి వాడికి సంగీతం ఎందుకండి?'' ఒక లెక్చరర్‌ విసుక్కున్నాడు. పవన్‌ కల బద్దలయింది. వయోలిన్‌ను నేలకేసి కొట్టాడు. ఆ చప్పుడుకు అటుగా వెళ్తున్న ప్రిన్సిపల్‌ పూసర్ల మనోరమ అక్కడికి వచ్చి పవన్‌ను విషయం ఏమిటని అడిగారు. అతని ఆసక్తి ఆమెకు అర్థమయింది. తానే స్వయంగా నేర్పుతానని ముందుకొచ్చారు. బహుశా ఆమెకు పవన్‌లో ఆమె తాతగారు ద్వారం వెంకటస్వామి నాయుడు కనిపించి ఉంటారు. ఆయన ప్రసిద్ధ వయోలిన్‌ విద్వాంసులు. పవన్‌లాగే అంధుడు(పుట్టుకతో కాదు).
***
వయోలిన్‌ సర్టిఫికెట్‌ కోర్సు నాలుగు సంవత్సరాలు... డిప్లమా రెండు సంవత్సరాలు. మొదటి సంవత్సరం మొత్తం సరిగమలు. తర్వాత గీతాలు, వర్ణాలు, కృతులు. ఇవన్నీ నేర్చుకోవడం పవన్‌కి పెద్ద సమస్య కాలేదు. వాటిని రికార్డు చేసుకుని ఇంట్లో కూడా సాధన చేసేవాడు. ఓకల్‌ తరగతులు పూర్తయ్యాయి. వీటిలో ఫర్‌ఫెక్ట్‌ అయితేనే వాయిద్యంపై గమకాలు నేర్పుతారు. పవన్‌కు సమస్య అక్కడే మొదలైంది. వయోలిన్‌ మీద సరిగమలు పలికించాలంటే తీగల మీద చేతి వేళ్లు ఎలా నొక్కాలి?, స్టిక్‌ని ఎలా కదపాలి.. ఇవి చూసి నేర్చుకుంటేనే స్వరాలు సరిగ్గా పలికించవచ్చు. పవన్‌ ప్రతిదీ తప్పుగా వాయించేవాడు. అప్పుడు మనోరమ పవన్‌ వేళ్లని పట్టుకుని వయోలిన్‌ ఎలా ముట్టాలో నేర్పారు. ఒక్కో స్వరానికి ఒక్కో రోజు పట్టింది. తర్వాత ఇ, ఎ, డి, జి తంత్రుల్లో ఏ తంత్రిపై ఏ పంచమం పలుకుతుందో ఒకటికి పదిసార్లు చెప్పారు. అవసరమయితే అదనంగా సమయం కేటాయించారు. అప్పట్నించి వయోలిన్‌పై పవన్‌ వేళ్లు కదలడం ఆగలేదు. పొడి స్వరాలే కాదు, గమకాలు కూడా ఘనఘన వాయించడం మొదలెట్టాడు. ఆరేళ్లు గడిచాయి. పవన్‌ డిస్టింక్షన్‌లో పాసయ్యాడు.

***
2002లో రవీంద్ర భారతిలో మొదటి ప్రదర్శన... ఆ తర్వాత చాలా సంగీత కచేరీలు.. 2004 నుంచి ఆకాశవాణిలో యువవాణి ద్వారా తన వయోలిన్‌ మాధుర్యాన్ని వినిపించాడు. కానీ పవన్‌ లక్ష్యం అది కాదు. తాను నేర్చుకున్నది మరో నలుగురికి నేర్పాలనుకున్నాడు. తాను నేర్చుకున్న కళాశాలలోనే అధ్యాపకునిగా చేరాలనుకున్నాడు. కానీ అతను నేర్పలేడని ఆ కళాశాలలో కొందరు కొట్టి పారేశారు. పవన్‌ రెండు సంవత్సరాలు ఉచితంగా పని చేసి తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు నాలుగు సంత్సరాలుగా అదే కళాశాలలో వయోలిన్‌ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. అంతేకాదు తన ఇంట్లో కొంతమంది పిల్లలకు ఉచితంగా వయోలిన్‌ కూడా నేర్పిస్తున్నాడు. ఇప్పుడు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎం.ఎ. కూడా చదువుతున్నాడు. భవిష్యత్తులో పెద్ద పెద్ద ప్రోగ్రాములు ఇచ్చి ఎంఎస్‌ గోపాలకృష్ణన్‌ అంతటివాడ్ని అవుతానంటున్నాడు.

('నెలవంక' పేరుతో 'ఆంధ్రజ్యోతి-ఆదివారం అనుబంధం'లో నేను రాస్తున్న కొత్త శీర్షిక. నెలలో రెండుసార్లు కనిపించే నెలవంకలా రెండు వారాలకొకసారి.)

Comments

Best of luck pavan. God please give long life to him to get all achievements in life.

nagesh,

kindley, convey all of our comments to pavan.
title.....superb
pavan's challenging skill is great.
nageshjii! thank you to you for writing this best one.
పవన్ కి అభినందనలు.
ఇటువంటి అసాధారణ వ్యక్తుల కథల్ని వెలుగులోకి తెస్తున్న మీకు కూడ అభినందనలు.
మంచి విషయం పంచుకున్నారు. పవన్‌‌గారి పట్టుదల ఇన్స్పైరింగ్.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు......

  కొన్ని షాపుల పేర్లు బావుంటాయి... మరికొన్నింటి పేర్లు మస్త్ ఉంటాయి... ఇంకొన్నింటి పేర్లు క్రియేటివ్‌గా ఉంటాయి...క్రియేటివిటీలో ఫీల్ ఉంటుంది...అర్థం చేసుకుంటే షాపు బోర్డులోనూ ఫిలాసఫీ ఉంటుంది. అలాంటి పేర్ల మిక్చర్ పొట్లాం.. ఈ మోర్ దాన్ మోర్. I wandered lonely as a cloud That floats on high oer vales and hills, When all at once I saw a crowd, A host, of golden daffodils; (నేను ఒంటరిగా ఒక మేఘంలా తిరిగాను. లోయలు, గుట్టల మీదుగా. అప్పుడు నేనొక సమూహాన్ని చూశాను. అందమైన గోల్డెన్ డాఫొడిల్స్ పువ్వులు అవి) విలియమ్ వర్డ్‌స్మిత్ రాసిన ‘ద డాఫొడిల్స్’ పోయమ్‌లోని మొదటి భాగమిది. ఇంటర్మీడియట్‌లో బట్టీపట్టినట్లు గుర్తు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వెళ్తుంటే వెంకటగిరిలో డాఫోడిల్స్ పేరుతో ఫ్యామిలీ సెలూన్ కనిపిస్తుంది. డాఫొడిల్స్ అంటే మెట్ట తామర పువ్వులు అని అర్థం. పసుపు రంగులో అందంగా ఉంటాయవి. వర్డ్‌స్మిత్‌ని తన్మయ పరిచిన ఆ పువ్వులు సెలూన్ నిర్వాహకులనూ కదిలించి ఉంటాయి. అందుకే డిఫంట్‌గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో. చూసే మనసు.. వెతికే కళ్లు ఉండాలిగానీ.. అలాంటి విభిన్నమైన ...