Skip to main content

గజానన్స్‌ ఖజానా

పది రూపాయల బిళ్ల కనిపిస్తే పదిలంగా దాచిపెట్టుకుంటాం. ఐదు రూపాయల బిళ్లలే తప్ప నోట్లు కనిపించడం లేదని ఎవరైనా ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని పర్సులో పెట్టుకుని మురిసిపోతాం. ఇలాంటివి ఓ నాలుగైదు మన దగ్గరుంటే నలుగురికి చెప్పుకుని గర్వపడతాం. ఆ మాత్రం దానికే అంతలా ఫీలయిపోతే మరి ఈ గజానన్‌ ఎంతలా గర్వపడాలి. ఎందుకంటారా? గజానన్స్‌ ఖజానాలో అలాంటి అరుదైన నాణేలు, నోట్లు చాలా ఉన్నాయి మరి.

పదహారణాల తెలుగమ్మాయి అనడం వినే ఉంటారు. కానీ అణాని ఎక్కడైనా చూశారా? నిజాం కాలం నాటి నాణేలు మ్యూజియంలో కాకుండా బయట ఎప్పుడైనా కనిపించాయా? ఏ దేశం కరెన్సీ నోటు అన్నింటికంటే చిన్నదిగా ఉంటుంది? కలర్‌ఫుల్‌గా ఉండేది ఏ దేశం కరెన్సీ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు గజానన్‌ దగ్గర సమాధానం దొరుకుతుంది.  అతని దగ్గర 195 దేశాల అరుదైన నోట్లు, 220 దేశాల నాణేలు ఉన్నాయి. ఒక్కో నోటుకు ఒక్కో కథ ఉంటుంది. ఒక్కో నాణేం వెనుక ఒక్కో చరిత్ర ఉంది. వాటిని చూపిస్తూ ఆనందంతో గజానన్‌ చెబుతుంటే చిన్నప్పుడు చరిత్ర పాఠాలు చెప్పిన సోషల్‌ టీచర్‌ గుర్తొస్తాడు.

ఎప్పట్నించి?
గజానన్‌ నాన్న రఘు మహబూబ్‌నగర్‌లో డాక్టర్‌. వారి ఆస్ప్రతి పక్కనే వాళ్లకు ఒక మెడికల్‌ షాపు ఉండేది. గజానన్‌ ఆరో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ నుంచి వచ్చాక మెడికల్‌ షాపులో కూర్చునేవాడు. గల్ల పెట్టెలో ఉండే చిల్లరని లెక్కపెడుతూ ఆడుకుంటుండేవాడు. ఒకటి, రెండు, ఐదు రూపాయల బిళ్లలు చాలా ఉండేవి. కానీ అన్నీ ఒకలా ఉండేవి కావు. ఎందుకలా? అతనిలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన నుంచే పుట్టింది ఒక హాబీ. అదే నాణేలను సేకరించడం. పదో తరగతి పూర్తయ్యేసరికి అది అతని జీవితంలో ఒక భాగం అయిపోయింది. అతని స్నేహితులు, బంధువులు అందరికీ అతని హబీ గురించి తెలిసిపోయింది. ఎవరికి ఏ అరుదైన నాణెం, నోటు కనిపించినా వెంటనే గజానన్‌కు పంపించేవారు. గజానన్‌ బంధువులు, వాళ్ల నాన్న స్నేహితులు చాలామంది విదేశాల్లో ఉన్నారు. వారు కూడా అక్కడి కరెన్సీని పంపించేవారు. అలా 2006లో ఇంజనీరింగ్‌లో చేరేసరికి 50 రకాల నోట్లు, మరో 50 అరుదైన నాణేలు అతని సొంతమయ్యాయి.

విదేశాలకు వెళ్లి...
హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు ఇంటర్‌నెట్‌లో వెతికి చాలా రకాల కాయిన్స్‌ గురించి తెలుసుకునేవాడు. నాణేలు సేకరించే అలవాటు ఉన్న వ్యక్తులను కలిసి సలహాలు తీసుకునేవాడు. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక ఎం.ఎస్‌. చేయడానికి న్యూజిలాండ్‌ వెళ్లాడు. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ ఆ డబ్బును కాయిన్స్‌ కలెక్షన్‌కు వినియోగించేవాడు. చదువు పూర్తయ్యాక ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, మలేషియా దేశాలు తిరిగి చాలా నాణేలు, నోట్లు సేకరించాడు. కొన్ని వేలం పాటలో కొన్నాడు. కానీ అవి తర్వాత నకిలీవి అని తెలిశాక ఎంతో బాధపడ్డాడు. మొత్తానికి పదేళ్లు కష్టపడి 195 దేశాల నోట్లను, చిన్న చిన్న దేశాలతో కలిపి 220 దేశాల నాణేలను సేకరించాడు. అందుకు అతనికి అయిన మొత్తం ఖర్చు ఎనిమిది లక్షల రూపాయలు. వాటి మొత్తం బరువు 32 కిలోలు. వాటన్నింటిని 2010 ఆగస్టులో హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌కు పెట్టాడు. మంచి స్పందన లభించింది. అప్పుడే అతనికి బాగా అర్థమైంది తాను సంపాదించినవి ఎంత అరుదైనవో.

స్పెషల్స్‌
గజానన్‌ సేకరించిన నోట్లు, నాణేలలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వాడిన నోట్లు, జింబాబ్వే వారి ఒన్‌ హండ్రెడ్‌ ట్రిలియన్‌ డాలర్‌ నోటు, మిలీనియమ్‌ ప్రత్యేక నోటు, మన దేశంలో పోర్చుగీసు, ఈస్ట్‌ ఇండియా కంపెనీల కాలంలో చలామణిలో ఉన్న నోట్లు, వినాయకుని బొమ్మ ఉండే ఇండోనేషియా నోటు, కలర్‌ఫుల్‌గా ఉండే స్విట్జర్లాండ్‌ నోటు, ఏడో నిజాం కాలంలో వాడిన నోట్లు తన దగ్గర ఉన్న నోట్లలో అపురూపమైనవని చెప్పాడు గజానన్‌. మాల్వా, ఔరంగజేబ్‌, రాజరాజ చోళ, టిప్పు సుల్తాన్‌, అక్బర్‌, హిట్లర్‌ల కాలంలో చలామణిలో ఉన్న వెండి, రాగి నాణేలు హైదరాబాద్‌ సంస్థానంలోని వెండి నాణేలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 50, 100 రూపాయల నాణేలు కూడా అతని దగ్గర ఉన్నాయి.

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో 150 దేశాల నాణేలు సేకరించనతనిదే రికార్డుగా ఉండేది. ఆ రికార్డుని గజానన్‌ ఎప్పుడో బ్రేక్‌ చేశాడు. లిమ్కాకు దరఖాస్తు చేసుకోకపోయినా మరో ఐదు దేశాల నోట్లు సంపాదించి ఏకంగా గిన్నిస్‌ రికార్డునే కొట్టాలని చూస్తున్నాడు గజానన్‌. ఇవన్నీ చేస్తూ కూడా గజానన్‌ హైదరాబాద్‌ వెస్ట్‌ మారెడ్‌పల్లిలోని లెరా టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

ప్రేమే కదా(కాదు) జీవితం

ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం. మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు. వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరా...

మరిచిపోలేని బహుమతి

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా. నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు...