Skip to main content

నడవలేడు.. నడిపిస్తున్నాడు...




డాన్ బాస్కో రిహాబిలిటేషన్ సెంటర్, రామంతాపూర్, హైదరాబాద్
వికలాంగుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. 
ఒక వికలాంగుడు కన్నీరు పెడుతూ పాట పాడుతున్నాడు..
వింటున్న వారిలోంచి ఒకాయన లేచి.. ‘‘ఆపండి.. ఏడిపించే ఇలాంటి పాటలొద్దు. చిన్నప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి ఉన్నాం. ఇక చాలు. వికలాంగుల్లో ధైర్యం పెంచే పాటలు పాడండి. ఆశ నింపే మాటలు చెప్పండి. జై వికలాంగ్’’ అని కష్టంగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. ఆయన పేరు శ్రీనివాస్. వికలాంగులకు నాయకుడు. 


నెల రోజుల తర్వాత.. ఎన్‌పిడిఓ కార్యాలయం,
మలక్‌పేట
ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్‌ని కలిసేందుకు వచ్చారు. తాము తీయబోతున్న డాక్యుమెంటరీ కోసం ఒక వికలాంగ బాలుడు కావాలని అడిగారు. కథేంటని అడిగారు శ్రీనివాస్. వచ్చిన వారు క్లుప్తంగా చెప్పారు. ‘‘బావుంది. నథింగ్ ఎబౌట్ అజ్ వితౌట్ అజ్.. మేం లేనిదే మా గురించి వద్దు.. మమ్మిల్ని పనికిరాని వాళ్లుగా కాదు.. మేమూ సాధించగలమని చూపించండి’’ అన్నారు శ్రీనివాస్.
ఈ రెండు సంఘటనలు చాలాఉ ఆయనేంటో చెప్పడానికి, ఏనుగమ్మ ఏనుగు అని భుజాల మీద ఆడించిన తండ్రి తన కొడుకు నడవలేడని తెలిసి ఆ రోజు బాధపడి ఉంటారు. కానీ ఈ రోజు ‘‘నా కొడుకు వికలాంగుడు అయితేనేం..’’ అని గర్వంగా చెబుతున్నాడు.

ఇంటిల్లిపాదీ బాధితులే...
విషం తాగి శివుడు గరళకంఠుడు మాత్రమే అయ్యాడు. కానీ విషంలాంటి ఫ్లోరైడ్ నీళ్లకు నల్గొండలో చాలామంది వికలాంగులయ్యారు. అలాంటి వారిలో శ్రీనివాస్ ఒకరు. ఆయన తల్లి చక్రమ్మ కూడా ఫ్లోరోసిస్ బాధితురాలే. ముగ్గురు తమ్ముళ్లలో ఇద్దరు. ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు కూడా అలాంటి వారే. అందరిలో పెద్దవాడు శ్రీనివాస్. వైకల్యంలో కూడా. నాన్న పెంటోజి రావు స్వాతంత్య్ర సమరయోధుడు. కాని ఆర్థిక స్వాతంత్య్రం మాత్రం సాధించలేకపోయాడు. పేదరికంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో భార్యాపిల్లల వైకల్యం చూసి కృంగిపోయాడు. చదివిస్తేనన్నా వారి ‘కాళ్ల’ మీద వారే నిలబడతారనుకున్నాడు. పిల్లలందర్నీ సర్కారు బళ్లో వేశాడు. అసలు నడవలేని శ్రీనివాస్‌ని మాత్రం దగ్గరలోని చిన్న ప్రైవేటు బళ్లో చేర్పించాడు. రోజూ భుజానెత్తుకుని బల్లో వదిలి, సాయంత్రం తీసుకొచ్చేవాడు. తను ఆలస్యంగా వెళ్లినరోజు ఒంటరిగా కూర్చుని ఏడ్చే శ్రీనివాస్‌ని చూసి తల్లడిల్లిపోయేవాడు. అతనికి నడక నేర్పాలని నడుం కట్టాడు. వానకు రాళ్లు తేలిన మట్టిగోడ మీద రోజూ నడిపించేవాడు. రకరకాల వ్యాయామాలు చేయించేవాడు. శ్రీనివాస్‌లో చలనం మొదలైంది. హైస్కూల్ చదువుకోసం శ్రీనివాస్‌ని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో నేర్పించారు తల్లిదండ్రులు. అది ఇంటికి చాలా దూరం. తోడు ఉంటేనేగానీ అంత దూరం నడవలేని శ్రీనివాస్ తమ్ముళ్లు, స్నేహితుల సహాయంతో పదో తరగతతి వరకు చదివాడు.

ఇల్లొదిలి హాస్టల్‌కు...
తుపాను వచ్చేముందు వాతావరణం ఒక్క క్షణం ప్రశాంతంగా మారిపోతుంది. జీవితం గొప్ప మలుపు తిరిగే ముందు కూడా కాలం ఒక్క నిమిషం అలా ఆగిపోతుందేమో, శ్రీనివాస్ అలాంటి పరిస్థితుల్లో పడ్డాడు. పదో తరగతి అయిపోయాక ఇంటర్ చదవాలనుకున్నాడు. కానీ పేదరికం గుర్తొచ్చి ఆగిపోయాడు. హైదరాబాద్‌లో ఎలా ఉంటాడు? పంపాలా.. వద్దా?’’ ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. ‘ఇంకెన్నాళ్లు మా చేయి పట్టుకుని తిరుగుతాడు. వాడి కాళ్ల మీద వాడ్ని నడవనీ..’’ వాళ్లో నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాస్ మలక్‌పేటలోని వికలాంగుల హాస్టల్‌లో చేరాడు. ఆ రోజు అతనికి తెలియదు. ఆ హాస్టల్ తన జీవితాన్ని మార్చబోతోందని. తాను అనుభవించిన పేదరికం కన్నా దరిద్రంగా కనిపించింది హాస్టల్. అక్కడ సరైన వసతులు ండేవి కావు. మంచి ఆహారం పెట్టేవాళ్లు కాదు. సబ్బులు, సరుకులు సరిగ్గా ఇచ్చేవారు కాదు. పుస్తకాలు సగం చదువులయ్యాక వచ్చేవి. ఇవన్నీ చూశాక శ్రీనివాస్లో ఆలోచన మొదలైంది. మేమంటే ఎందుకింత నిర్లక్ష్యం అందరికీ అని.

ఎత్తుపల్లాలు...
శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి బాగా కలుపుగోలు మనిషి. చలాకీగా ఉండేవాడు. సీనియర్లను, జూనియర్లను పోగేసి వార్డెన్‌తో గొడవకు దిగేవాడు. ఇతర మాస్టళ్లకు వెళ్లి కాలేజి విద్యార్థులను కూడగట్టేవాడు. అందరూ కలిసి కళాశాల విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ కావాలని ధర్నాలు చేశారు. ఇంటర్ రెండో సంవత్సరంలో వారి కోరిక నెరవేరింది. సలీమ్‌నగర్‌లో వారికోసం ప్రత్యేక హాస్టల్ ప్రారంభమైంది. శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ, టైప్ నేర్చుకుంటూ, వికలాంగుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ బిజీ అయిపోయాడు. అతనికి ఎల్‌ఎల్‌బి చదవాలని ఉంది. కానీ పరిస్థితులు అతన్ని జర్నలిజం వైపు నడిపించాయి. ‘ఉదయం’ పత్రికలో కంట్రిబ్యూటర్‌గా చేరాడు. 1992లో ఉదయం పత్రిక మూతబడింది. తోటి విలేకరులంతా ఇతర పత్రికల్లో చేరిపోయారు. శ్రీనివాస్‌కు మాత్రం ఇంకో పత్రికలో చేరాలని లేదు. వికలాంగుల కోసం పనిచేయాలనుకునానడు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో యూత్ కాంగ్రెస్‌లో వికలాంగుల కాంగ్రెస్ సమాఖ్య పేరుతో ఒక విభాగాన్ని, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వికలాంగుల ఫోరమ్‌ని స్థాపించాడు. వికలాంగుల ఇళ్ల పట్టాల కోసం పోరాడాడు. 1994లో సెక్రటేరియట్ ముందు నిరాహారదీక్ష కూడా చేశాడు. పట్టాలిచ్చేందుకు ప్రబుత్వం ఒప్పుకుంది కానీ అసలైన లబ్దిదారులకు అందకుండా స్వార్థపరుల చేతులకు చిక్కాయి ఆ పట్టాలు. ఆ రాజకీయాలు అతనికి నచ్చలేదు.

పత్రిక నడిపాడు...
అతని జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునానడు. 1995లో వికలాంగుల చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దాని గురించి గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకునానడు. చిన్నప్పట్నించి పరిచయం ఉన్న స్నేహితులందరినీ కలిశాడు. డబ్బు పోగేశాడు. 96లో ‘వికలాంగుల వార్తాతేజ’ పేరుతో మాస పత్రికని ప్రారంభించాడు. కష్టంగా రెండేళ్లు నడిపించాడు. డబ్బంతా ఖర్చయిపోయింది. బ్యాంకునుంచి లోన్ తీసుకుని ప్రింటింగ్ ప్రెస్ నడిపాడు. అదీ నడవలేదు. యాక్షన్ ఎయిడ్‌తో కలిసి కొంతకాలం పనిచేశాడు. వారి నుంచి ఒక పనిని ప్రొఫెషనల్‌గా ఎలా చేయాలో నేర్చుకున్నాడు. వికలాంగుల కోసం తాను నడుపుతున్న పత్రికకు సహకరించాలని యాక్షన్ ఎయిడ్‌ని కోరాడు. అతని ఆలోచనలు నచ్చి 1996లో లక్షా 98 వేల రూపాయలిచ్చింది ఆ సంస్థ. ఆ సొమ్ముతో వికలాంగుల చట్టాలు, హక్కులు, ప్రభుత్వ పథకాలు, స్వయంగా ఉపాధి పథకాలు, న్యాయసలహాలు తదితర అంశాలను పొందు పరుస్తూ ఒక మ్యాగజైన్‌ని రూపొందించి లక్షమందికి పంచిపెట్టాడు. అతని కల నెరవేరింది. గ్రామీణ స్థాయిలో వికలాంగులకు కూడా ఆ పత్రిక చేరింది. ఆ సంవత్సరం శ్రీనివాస్‌కు వికలాంగుల స్వయం ఉపాధిలో బెస్ట్ ఎంప్లాయ్‌గా జాతీయ అవార్డు లభించింది.

జాతీయ సంస్థలతో కలిసి...
యాక్షన్ ఎయిడ్‌లో ఉండగానే శ్రీనివాస జాతీయ వికలాంగుల సంస్థలతో కూడా కలిసి పనిచేశాడు. తమ జాతీయ నాయుకుడు జావేద్ లాంటి వారి సహకారంతో తాను రూఒపొందించిన పత్రికను అన్ని భాసల్లోనూ ముద్రించాడు. అది 2001 జనాభా లెక్కల్లో వికలాంగుల సక్రమ గుర్తింపుకు ఉపయోగపడింది. ఆరు జిల్లాల్లో వికలాంగుల స్వాధికార ప్రాజెక్టును రూపొందించి 2002లో ప్రభుత్వం నుంచి 110 కోట్ల రూపాయల సహాయాన్ని పొందాడు. ఆ ప్రాజెక్టు చేస్తునప్పుడు పరిచయమైన భాగ్యశ్రీ(వికలాంగురాలు)ని 2003లో ఆసియా సోషల్ ఫోరమ్ వేదికపై పెళ్లి చేసకున్నాడు. ఇప్పుడు అతనికి ఒక అబ్బాయి. అతను కూడా వికలాంగుడే.

నెట్‌వర్క్
పత్రిక నడిపిస్తూనే 2003లో వికలాంగుల కోసం ఒక నెట్‌వర్క్‌ని ప్రారంభించాడు శ్రీనివాస్. అన్ని జిల్లాలు తిరుగుతూ వికలాంగుల సంఘాలను ఏకం చేస్తూ ఎన్‌పిడిఓ (నెట్‌వర్క్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ ఆర్గనైజేషన్)ని ఏర్పాటు చేశాడు. ఒక రూపాయి సభ్యత్వంతో 75 వేల మందిని సభ్యులుగా చేర్చాడు. 3 వేల మందికి శిక్షణ ఇచ్చి గ్రామ స్థాయిలో వికలాంగులకు స్వయం ఉపాధి, పెన్షన్లు, హక్కులు, చట్టాల గురించి అవగాహన కలిగిస్తున్నాడు. వికలాంగులకు రాజకీయ గుర్తింపు రావాలని 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిపై ఒక అంధుణ్ణి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఒక వికలాంగురాలిన పోటీ చేయించాడు. ప్రస్తుతం ఎన్‌పిడిఓ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 52 మందికి, పరోక్షంగా 5వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందుకే 2010 డిసెంబర్ 3న వికలాంగులకు ఉపాధి కల్పించిన బెస్ట్ ఎంప్లాయర్‌గా మరోసారి జాతీయ అవార్డు తీసుకున్నారు శ్రీనివాస్. ప్రస్తుతం 100 పాఠశాలలను అధ్యయనం చేసి వికలాంగ బాలలకు 1995 చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని కోరుతూ హైకోర్టులో రిట్ వేశాడు. ఆయన వైకల్యం ఆయన్ని ఒకనాడు ఎంత కృంగదీసిందో గాని ఇవ్వాళ మాత్రం చాలామందికి సహాయపడుతోంది.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

ప్రేమే కదా(కాదు) జీవితం

ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం. మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు. వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరా...

మరిచిపోలేని బహుమతి

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా. నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు...