1992,
రామ్‌గోపాల్ వర్మ ‘అంతం’ సినిమా ఆడియో విడుదలైన రోజు రాత్రి...
చీకటిగదిలో ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు ఒంటరిగా కాళ్లు పట్టుకుని కూర్చున్నాడు. అతని పేరు రామానంద్.
‘‘గుండెల్లో దడ దడ దడమంటూ ఉరుములతో...
కళ్లల్లో భగ భగ భగ మండే మెరుపులతో.. ’’ టేప్ రికార్డర్‌లో క్యాసెట్ తిరుగుతోంది.
ఆ పాట అతని పరిస్థితికి దగ్గరగా ఉంది. అతని మనసునిండా ఉరుముల్లాంటి ఆలోచనలు..
కళ్లనిండా మెరుపుల్లాంటి కలలు..
అతని ఆలోచనల నిండా డాక్టర్ చెప్పిన మాటలే...
‘‘నువ్విక నడవలేవ్... నీ కాళ్లు చచ్చుబడి పోతాయ్. మూడేళ్లలో వీల్‌చెయిర్‌కు అతక్కుపోవాల్సిందే’’
కాని అతని కలలనిండా తన అందమైన భవిష్యత్తే...
‘‘నేను పెద్ద నటుణ్ణి కావాలి. వర్మ గారిని కలవాలి. ఆయనతో కలిసి పని చేయాలి. ఆయనలా సినిమాలు తీయాలి’’
ఈ ఉరుములు, మెరుపులతో అతని మనసు తుపానులా మారింది.
కాసేపాగి టేప్‌రికార్డర్ కట్టేశాడు రామానంద్. అతని కళ్లు చీకట్లో ఏవో దృశ్యాల్ని వెతుకుతున్నాయి. అన్నీ ఫాస్ట్‌ఫార్వర్డ్‌లో వేగంగా కదులుతున్నాయి. ఒక దృశ్యం ఆగిపోయింది. చిన్నప్పుడు చూసిన ఆనంద్ సినిమా అది. క్యాన్సర్‌తో బాధపడుతున్న రాజేష్ ఖన్నాతో అమితాబ్ బచ్చన్ చెప్పే డైలాగ్.. ‘‘జిందగీ లంబీ నహీ.. బడీ హోనీ చాహియే’’- అతని చెవుల్లో మారుమోగుతోంది.
‘‘ఔను.. జీవితమంటే ఎక్కువకాలం బతకడం కాదు.. ఎక్కువమందితో పరిచయాలు పెంచుకోవడం.. నేను అనుకున్నది సాధించాలంటే.. ఎక్కువమందితో పరిచయాలు పెంచుకోవాలి.. సినిమావాళ్లతో టచ్‌లో ఉండాలి.. కానీ ఎలా, ఇది నాకు సాధ్యమా? అసలు నేను ఎలా ఉండేవాడ్ని?’’ ఆలోచిస్తున్నాడు రామానంద్.
ఫ్లాష్‌బ్యాక్
ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం, పదో తరగతి గది..
‘సుహాగిన్’ అనే డ్రామాలో నవీన్ అనే పిల్లవాడికి హీరో పాత్ర వేసే అవకాశం వచ్చింది. కానీ నవీన్ అదే నెలలో క్రికెట్ టోర్నమెంట్‌కు వెళ్లాల్సి ంది. అందుకే నవీన్ తన పాత్రని రామానంద్‌కు ఇవ్వాలని దర్శకుడు శ్రవణ్‌కుమార్‌ని కోరాడు. ఆయన రామానంద్‌కు ఒక సీన్ ఇచ్చి వేయమన్నాడు. కానీ రామానంద్ బిడియంతో వేదిక ఎక్కడానికే భయపడ్డాడు. ఒకటి రెండు రోజులు చూసి హీరో పాత్రకి బదలు ‘హీరా’ అనే ఒక చిన్నపాత్రని రామానంద్‌కు ఇచ్చారు.
‘డ్రామానంద్’
రామానంద్ ఇంట్లో తన పాత్రని రకరకాలుగా చేసేవాడు. కానీ వేదిక ఎక్కి చేయాలంటే మాత్రం వణికిపోయాడు. హీరా వదిన పాత్రని నందిత అనే అమ్మాయి చేస్తోంది. రోజూ రామానంద్‌తో ఆమె వేగలేక ఒకరోజు బాగా తిట్టింది. ఆ రోజు రామానంద్‌కి నిద్రపట్టలేదు. ఆ రాత్రి అతనిలోకి అమితాబ్ బచ్చన్ ప్రవేశించాడు. కొత్త ఉత్సామంతో మర్నాడు వేదికపైకి ఎక్కాడు. ఆ రోజు అందరికంటే బాగా నటించాడు. అతనిలోని అపరిచితుడ్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు రోజు తిట్టిన నందిత ఆ రోజు అతన్ని అభినందిస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చింది. నువ్వు రామానంద్ కాదు.. డ్రామానంద్‌లో ఏదో కొత్త శక్తి ప్రవేశించింది. అది చూసి దర్శకుడు హీరా పాత్ర నిడివి కూడా పెంచాడు. డ్రామా ప్రదర్శనకు వేలల్లో జనం వచ్చారు. రామానంద్ డైలాగులకు చప్పట్లు కొట్టారు. బస్సెక్కేప్పుడు తోసేసే తోటి విద్యార్థులు ఇప్పుడు చెయ్యి అందించి లోపలికి లాగుతున్నారు. రామానంద్, నందిత మంచి స్నేహితులయ్యారు.
కట్ చేస్తే..
రామానంద్ ఇంటర్ చదివేటప్పుడు ప్రతి శనివారం తప్పకుండా చేసే పని ఒకటుంది. అదేంటంటే.. ఆకాశవాణి కేంద్రానికి వెళ్లి సుహాగిన్ నాటకాన్ని ప్రసారం చేయాల్సిందిగా అడుగుతుండేవాడు. ఇలా ఏడాదిగా జరుగుతోంది. మధ్యలో కొన్ని చిన్న చిన్న నాటకాలు కూడా రాశాడు. ఒకరోజు సాయంత్రం కాలనీలోని పార్కు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు నందిత, రామానంద్.
కుంటుతున్న రామానంద్‌ని చూసి ‘‘కాలికి ఆ దెబ్బేంటి?’’ అని అడిగింది నందిత.
‘‘ఓ అదా.. నిన్న ఆకాశవాణికి వెళ్లినప్పుడు మెట్లపై జారిపడ్డాను’’
‘‘అయ్యో అదెలా?’’
‘‘ఏమో తెలియదు. మెట్లు దిగుతుంటే.. కాళ్లు ఒక్కసారిగా వణికాయి. నడవలేకపోయాను. కాలు పక్కకు తీసి పెడదామని ప్రయత్నించాను. కాని పడిపోయాను’’ చెప్పాడు రామానంద్.
మూడేళ్ల తర్వాత..
‘శివ’ సినిమా చూశాక రామ్‌గోపాల్ వర్మకి వీరాభిమాని అయిపోయాడు రామానంద్. సినిమాల మీద రోజు రోజుకూ ఆసక్తి పెరిగింది. దానితోపాటే అతని కాళ్లనొప్పులు కూడా పెరిగాయి. నడవలేని పరిస్థితి. కాళ్లలో పట్టులేకపోతేనేం సినిమాల్లోకి వె ళ్లాలనే పట్టుదల మాత్రం పుష్కలంగా ఉంది. ఇప్పుడు అతని పడిగాపులు నందిత కోసం కాదు.. ఆమె తండ్రికి బదిలీ కావడంతో వాళ్లు వేరే ఊరు వెళ్లిపోయారు. ఇప్పుడు అతని పడిగాపులు అన్నపూర్ణ స్టూడియా ముందు. స్నేహితుని సహాయంతో రోజూ అక్కడికి వెళ్లేవాడు. వర్మని, అతని కెమెరామాన్ తేజని కలవాలని ప్రయత్నిస్తుండేవాడు.
అపర్ణ హస్తం...
ఆకాశవాణిలో ప్రోగ్రాములు చేస్తున్నప్పుడు అపర్ణ అనే ఆవిడ పరిచయమైంది. ఆమె రామానంద్‌కు ఆలీని పరిచయం చేసింది. శివ సినిమాలో నాగార్జున ఇంటికి సంబంధించిన దృశ్యాల్ని ఆలీ ఇంట్లోనే చిత్రీకరించారు. ఆలీ సహాయంతో ‘అంతం’ సినిమా షూటింగ్‌లో తేజని కలిశాడు. ఫోటోగ్రఫీ గురించి తేజతో గొప్పగా మాట్లాడాడు. అతని మాటలు తేజకు నచ్చాయి. మరోసారి వచ్చి కలవమన్నాడు. కానీ రామానంద్ పరిస్థితి తీవ్రంగా మారింది. మెడ్విన్ ఆస్పత్రిలో డాక్టర్‌ని కలిశాడు. ఆయన పరీక్షలు చేసి ‘‘నీకు మస్కులర్ డిస్ట్రోఫీ. కండరాలు చచ్చుబడిపోతున్నాయి. రెండు మూడేళ్లలో నువ్వు వీల్ చెయిర్‌కు అంకితమైపోవాల్సిందే’’ అని చెప్పాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తూ కోఠీలో ‘అంతం’ సినిమా ఆడియో క్యాసెట్ కొన్నాడు రామానంద్.
ఈ కథ మొదలైన రాత్రి...
రామానంద్ ఇంట్లో జిమ్మీ అనే కుక్క ఉంది. అది మొరగడంతో ఉలిక్కిపడి లేచాడు రామానంద్. గదిలో లైటువేసి ‘అంతం’ సినిమా క్యాసెట్‌ని చేతిలోకి తీసుకుని చూశాడు. ఇది అంతం కాదు నాకు ఆరంభం అనుకున్నాడు. తన దగ్గర ఉన్న గ్రీటింగ్ కార్డులన్నీ వెతికాడు. థ్యాంక్స్ అని రాసి ఉన్న కార్డుని తీసుకుని ‘‘----’’ అని రాశాడు. స్నేహితుడు రాల్ఫ్‌ని తీసుకుని, చేతిలో కర్ర పట్టుకుని స్కూటర్‌పై అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాడు. ఎంత ప్రయత్నించినా ఎవరూ దొరకలేదు. తేజ అసిస్టెంట్ రసూల్‌కి కార్డు ఇచ్చి తేజకి ఇమ్మన్నాడు. ఆ తర్వాత కూడా తేజని కలవడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
జిమ్మీ కాటు...
ఒకరోజు మంచం మీది నుంచి దిగుతున్నప్పుడు కాళ్ల దగ్గర పడుకున్న జిమ్మీ అతన్ని కరిచిఇంది. అతను బాధపడలేదు. ఎందుకంటే జిమ్మీ కరిస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం. రామానంద్ వాళ్ల అన్నయ్యని కూడా అది ఒకసారి కరిచింది. ఆ తర్వాత అతను విదేశాలకు వెళ్లి స్థిరపడ్డాడు. ఒకసారి పక్కింటతన్ని కరిచింది. అతనికి ఆరోజు ఉద్యోగం వచ్చింది. అందుకే రామానంద్‌కి ఎంతో సంతోషంగా ఉంది. వెంటనే వీధి చివరనున్న ఎస్టీడీ బూత్‌కు వెళ్లి తేజ ఆఫీసుకు ఫోన్ చేశాడు. ఆయన రామానంద్ ఇచ్చిన గ్రీటింగ్‌ని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది.
చిత్రం.. ది పిక్చర్..
రామానంద్‌కి అప్పటికి ముప్ఫయేళ్లు. డాక్టర చెప్పినట్టుగానే ఐదేళ్లుగా అతను వీల్ చెయిర్‌కే అంకితమైపోయాడు. నటుడు కావాలన్న ఆలోచనలు అతని కాళ్లలా చచ్చుబడిపోయాయి. అయినా అతను సమయాన్ని వృథా చేయలేదు. ఎన్నో సినిమాలు చూసేవాడు. కథలు రాసేవాడు. సినిమా రివ్యూలు రాసుకునేవాడు. కొన్ని ఆంగ్ల పత్రికలకు వాటిని పంపేవాడు. అప్పుడప్పుడూ తేజ దగ్గరికి వెళ్లి సినిమాల గురించి చర్చిస్తుండేవాడు. తేజని దర్శకుడిగా మారమని ప్రోత్సహిస్తుండేవాడు. 1999లో తేజ ‘చిత్రం.. ది పిక్చర్’ సినిమా మొదలుపెట్టినప్పుడు అందుకు కొత్త నటుల్ని ఎంపిక చేసే పని రామానంద్‌కి అప్పగించాడు తేజ. ఎందుకంటే సినిమాల్లో పాత్రలను, నటుల్ని, వారి నటనని బాగా విశ్లేషించగలడు రామానంద్. ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి తప్ప ఆ పాత్రని ఎవరు చేసినా అంత బాగా నప్పేది కాదని ఎవరైనా చెప్పగలరు కదా. కాకపోతే ఆ జ్ఞానం రామానంద్‌కు మరింత ఎక్కువని తేజ నమ్మకం. తేజ చెప్పిన కథలో పాత్రల్ని కళ్లు మూసుకుని ఊహించుకున్నాడు రామానంద్. ఏ పాత్రకు ఎలాంటి వారు బావుంటారో అతని ఊహల్లో ఒక ఆకారం వచ్చేసింది.
కాస్టింగ్ డైరెక్టర్‌గా...
హీరో పాత్ర కోసం 700 మంది పోటీ పడ్డారు. ఆ పాత్ర.. ఒక మధ్యతరగతికి చెందిన కుర్రాడు... మృదుస్వభావం ఉండేవాడు.. అందుకే ఉదయ్‌కిరణ్‌ని ఎంపిక చేశానంటారు రామానంద్. ఆ సినిమా కోసం నటులందరికీ శిక్షణ కూడా తనే ఇచ్చాడు రామానంద్. ఆ సినిమా విడుదలైంది. పాత్రకు ఉదయ్‌కిరణ్ జీవం పోశాడు. స్క్రీన్ మీద తొలిసారి ‘కాస్టింగ్ డైరెక్టర్ - రామానంద్’ అనే పేరుని చూసుకుని మురిసిపోయాడు. డెబై్బ ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో కాస్టింగ్ డైరెక్టర్ టైటిల్ వేసిన తొలి చిత్రంగా ‘చిత్రం’ సినిమా రికార్డులకెక్కింది. అలాగే జయం సినిమా కోసం మహారాష్ట్ర అమ్మాయి సదాని ఎంపిక చేసింది కూడా రామానందే. తేజ పంచ్‌లైన్.. ‘వెళ్లవయ్యా.. వెళ్లు..’ ఎవరు బాగా చెబితే వారికే ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఆ ఎంపిక జరిగింది. అది ఎంత హిట్ అయిందో మీకందరికీ తెలిసిందే.
ప్రస్తుతం..
చిత్రం సినిమా తర్వాత నువ్వు - నేను, జయం, జై.. ఇలా తేజ తీసిన దాదాపు అన్ని సినిమాలకు రామానంద్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2005లో సొంతంగా యాక్టింగ్ స్కూల్ పెట్టారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో చాలామంది జూనియర్ ఆర్టిస్టులకు శిక్షణ ఇస్తున్నారు. మనిషిని చూడగానే పది నిమిషాల్లో అతని బాడీ లాంగ్వేజ్‌ని, ముఖకవలికల్ని బట్టి అతనికి ఎలాంటి పాత్ర అయితే నప్పుతుందో చెప్పేస్తారు రామానంద్. అలాగే వారికి శిక్షణ కూడా ఇస్తారు. ఆరోగ్యం బాగోలేక కొంత కాలానికి స్కూల్ మూసినా 9.9.2009 నుంచి జూబ్లీహిల్స్‌లోని షేప్‌అప్ యాక్టింగ్ స్కూల్‌లో విద్యార్థులకు పాఠాలు మాత్రం చెబుతూనే ఉన్నారు. ఈ మధ్య వచ్చిన జోష్, తకిట తకిట సినిమాలకు కూడా నటీనటులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ఒక తమిళ సినిమాకి స్క్రిప్ట్ రాస్తున్నారు.

Comments