మీ కంప్యూటర్‌లో ముఖ్యమైన ఫైల్ డిలీట్ అయిపోయింది.. ఏం చేస్తారు? మెమరీ కార్డ్‌లోంచి డిలీట్ చేసిన ఫోటోల్ని రికవరీ చేయొచ్చా? ఫార్మాట్ చేసిన పెన్‌డ్రైవ్‌లోని వీడియోల్ని తిరిగి పొందొచ్చా? డోంట్ వర్రీ వీటన్నింటికీ పరిష్కారం ఉంది. రీసైకిల్ బిన్‌లోంచి ఎగిరిపోయిన ఫైల్స్‌ని కూడా వెతికి పట్టుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని టూల్స్ గురించి తెలుసుకోండి.
మీ కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లో ఒక ఫైల్ కనిపించకుండా పోయిందంటే ఇక అది దొరకనట్లే కాదు. మీ హార్డ్ డిస్క్ పూర్తిగా పాడైపోయినప్పుడు మాత్రమే దాన్ని తిరిగిపొందడం కుదరదు. కానీ ఈ మధ్య వస్తున్న హార్డ్ డ్రైవ్‌లు అంత త్వరగా పాడైపోయేవి కావు. అందుకే మీరు కోల్పోయిన డేటాని తిరిగిపొందడం పెద్ద కష్టమేం కాదు. మీ కంప్యూటర్‌లో ఒక ఫైల్‌ని డిలీట్ చేస్తే అది డైరెక్టరీ నుంచి మారుతుందే తప్ప పూర్తిగా కంప్యూటర్‌లో లేకుండా వెళ్లిపోదు. మరెక్కడికి పోతుంది.. సింపుల్.. రీసైకిల్ బిన్‌లోకి. అక్కడ కూడా డిలీట్ చేస్తే? Shift + Delete నొక్కితే? యస్.. అప్పుడు కూడా ఫైల్‌ని రికవరీ చేసుకునే వీలుంది.
పెయిడ్ సర్వీసెస్
మీ ఫైల్ డిలీట్ అవ్వగానే... అంటే రీసైకిల్ బిన్ నుంచి కూడా తొలగించిన తర్వాత దానితో అవసరం పడితే వెంటనే రికవరీ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వెంటనే చేసుకోవడం వల్ల ఫైల్స్‌ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఫైల్‌ని రికవరీ చేయాలనుకుంటే అది రీసెంట్‌గా డిలీట్ అయిన ఫైల్స్‌ని మాత్రమే వెతికి పట్టుకుంటుంది. డిలీట్ అయిన చాలా రోజుల తర్వాత ఫైల్స్‌ని వెతకాలంటే మాత్రం పెయిడ్ సర్వీసులను వాడడం మంచిది. అలాంటి సాఫ్ట్‌వేర్ టూల్స్ గురించే ఇక్కడ ఇచ్చాం.
1. డిస్క్ డాక్టర్స్ Disk Doctors
వెబ్‌సైట్ : www.diskdoctors.com
ధర : 59 డాలర్లు
మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లో డిలీట్ అయిన ఫైల్స్‌ని వెతికి పెట్టేందుకు డిస్క్ డాక్టర్స్ సాఫ్ట్‌వేర్ బాగా పనిచేస్తుంది. క్లీన్ చేసిన రీసైకిల్ బిన్ నుంచి, యాక్సిడెంటల్‌గా డిలీట్ అయిన ఫైల్స్‌ని కూడా ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా పొందొచ్చు. కంప్యూటర్‌ను ఫార్మాట్ చేస్తున్నప్పుడు పార్టీషన్ కరప్ట్ అయినప్పుడు, రీపార్టీషన్ చేసినప్పుడు కోల్పోయిన డేటాని కూడా ఇది వెతికిపెడుతుంది.
2. ఫైల్ స్కావెంజర్ File Scavenger
వెబ్‌సైట్ : www.quetek.com
ధర : 49 డాలర్లు
క్వీటెక్ సంస్థ రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ కూడా డిలీట్ అయిన ఫైల్స్‌ని వెతికి పట్టుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. డెడ్ అయిన ఫైల్స్‌ని ఊడ్చి ఊడ్చి.. వెతికి పట్టుకుని తిరిగి మీ డేటా ఎలా ఉందో అలా పదిలపరుస్తుంది. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లో డిలీట్ అయిన ఫైల్స్‌ని మాత్రమే కాకుండా.. జిప్ డిస్క్‌లు, మెమరీ కార్డులు, ఫ్లాష్ కార్డులలో నుంచి కూడా ఇది డిలీటెడ్ డేటాని వెతికి పట్టుకుంటుంది. మిగిలిన సాఫ్ట్‌వేర్‌లలో ఇలా ప్రత్యేకమైన వాటి నుంచి పొందేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లను కొనాల్సి ఉంటుంది.
3. మున్‌సాఫ్ట్ డేటా రికవరీ సూట్ Munsoft Data Recovery Suite
వెబ్‌సైట్ : www.munsoft.com
ధర : 35 డాలర్లు
మున్‌సాఫ్ట్ రూపొందించిన ఈ డేటా రికవరీ సూట్ చాలా కాలం క్రితం కోల్పోయిన డేటాని కూడా తిరిగి పొందేలా చేస్తుంది. ఇందులో ఆరు రకాల సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి. డాక్యుమెంట్లు, ఫోటోలు.. వీడియోలు ఇలా.. రకాల రకాల ఫైల్స్‌ని పొందేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు ఉంటాయన్నమాట. మిగిలిన అన్ని సాఫ్ట్‌వేర్‌లకంటే ఇది చాలా తక్కువ ఖరీదైనది. ఎక్కువగా ఉపయోగపడేది కూడా.
4. రికవర్ మై ఫైల్స్ Recover My Files
వెబ్‌సైట్ : www.recovermyfiles.com
ధర : 65 డాలర్లు
ఫైల్స్‌ని రికవరీ చేసుకునేందుకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌లలో ఇది చాలా పాపులర్ ప్రోగ్రామ్. ఇది ఖరీదైనది. కానీ అంతకుతగ్గట్టు పని చేస్తుంది. దీన్ని టొరెంట్ సెర్చ్‌లో వెతికి పట్టుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ కీ దొరకడం చాలా కష్టం. ఈ సాఫ్ట్‌వేర్‌తో మ్యాక్ కంప్యూటర్‌లో డేటాని తిరిగి పొందేందుకు అదనంగా మరికొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
5. డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ Data Recovery Software
వెబ్‌సైట్ : www.datarecoverysoftware.com
ధర : 80 డాలర్లు
రికవరీ సాఫ్ట్‌వేర్‌లన్నింటిలో ఇది ఎక్కువ ఖరీదైనది. ఎందుకలా? అంటే ఇది అంత వేగంగా పనిచేస్తుంది మరి. మీరు కోల్పోయిన అతి చిన్న ఫైల్ నుంచి అతి పెద్ద ఫైల్ వరకు అన్నింటినీ ఇది వెతికి పట్టుకుంటుంది. ఫైల్స్‌ని స్టోర్ చేసుకునేందుకు ఉపయోగపడే ఏ డివైజ్ నుంచైనా డిలీటెడ్ ఫైల్స్‌ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీరు మర్చిపోయిన పాస్‌వర్డ్‌లను కూడా వెతికి పట్టుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
6. అన్‌డిలీట్ ప్లస్ Undelete Plus
వెబ్‌సైట్ : undeleteplus.com
ధర : 50 డాలర్లు
ఇది ఉచితంగా లభిస్తున్నట్లు కొన్ని వెబ్‌సైట్లలో ఉంది కానీ.. ఇది ఫ్రీ సాఫ్ట్‌వేర్ కాదు. పక్కా పెయిడ్ సాఫ్ట్‌వేరే. మీరు దీనికోసం ఇంటర్‌నెట్‌లో వెతుకుతున్నప్పుడు కొన్ని వెబ్‌సైట్ల నుంచి ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఫైల్స్ రికవరీ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం రిజిస్ట్రేషన్ కీ అడుగుతుంది. దాన్ని అప్పుడైనా కొనాల్సిందేగా?
ఫ్రీ
సాఫ్ట్‌వేర్లు
ఏదో ఒకటి రెండు ఫైల్స్‌ని వెతికి పట్టుకునేందుకు డాలర్ల కొద్ది డబ్బు వెచించి సాఫ్ట్‌వేర్‌ని కొనడం వేస్ట్ అనుకుంటున్నారా? అలాంటి వారికోసం ఉచితంగా సేవలందించే సర్వీసులు కొన్ని ఉన్నాయి. జస్ట్ బ్యాకప్ ఆప్షన్‌ని మీ విండోస్ డెస్క్‌టాప్ మీద యాక్టివేట్ చేసుకుంటే చాలు. మీరు రీస్టోర్ చేయాలనుకుంటున్న ఫైల్‌ని అదే వెతికి పెడుతుంది.
1. పీసీ ఇన్‌స్పెక్టర్ PC Inspector
జర్మనీకి చెందిన వెబ్‌సైట్ నుంచి ఉచితంగా లభించే ఈ పీసీ ఇన్‌స్పెక్టర్ తప్పించుకుపోయిన ‘దొంగ ఫైల్స్’ని వెతికి పట్టుకుంటుంది.
2. రెకువా Recuva
మీ డిలీటెడ్ డేటాని రికవరీ చేసుకునేందుకు ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్‌లలో రెకువా చాలా పాపులర్ టూల్. సింగిల్ బ్రాండెండ్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఈ సాఫ్ట్‌వేర్ పాపురల్ సీ క్లినర్‌ని అందించే పిరిఫామ్ డాట్ కామ్‌తో కలిసి పనిచేస్తోంది.
3. ఈడీఆర్ విజార్డ్ Easeus Data Recovery Wizard
ఈజ్ హజ్ బ్రాండ్ నుంచి లభించే ఫ్రీ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ ఇది. దీని నుంచి 1 జీబీ వరకు డేటాని ఉచితంగా రికవరీ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేసుకోవాలంటే మాత్రం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి పెద్దగా స్పేస్ అవసరం లేదు. బాగా పనిచేస్తుంది కూడా.
4. విన్ డేటా రికవరీ Win Data Recovery
పీసీ మ్యాగ్ పరీశీలించి విన్ డేటా రికవరీ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చింది. సో.. దీన్ని ఎంచుకోవడంలో మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. వైరస్ వల్ల డామేజ్ అయిన ఫైల్స్‌ని కూడా ఇది రికవరీ చేయగలదు. అంటే ఒక యాంటీ వైరస్‌లా కూడా పనిచేస్తుందన్నమాట.
5. పాండా రికవరీ Panda Recovery
యాక్సిడెంటల్‌గా డిలీట్ అయిన ఫైల్స్‌ని వెతికి పట్టుకునేందుకు పాండా రికవరీ సాఫ్ట్‌వేర్ బాగా ఉపయోగపడుతుంది. డిలీట్ అయిన హిడెన్, ఆర్వై్కవ్ ఫైల్స్‌ని కూడా ఇది రికవరీ చేస్తుంది.
6. ఫ్రీ అన్‌డిలీట్ Free Undelete
బేసిక్ అండ్ సింపుల్ రికవరీ సాఫ్ట్‌వేర్ ఇది. ఇది ఫ్రీ సర్వీస్‌గా, పెయిడ్ సర్వీస్‌గా లభిస్తోంది. మీరొక్కరే వాడుకునేందుకు అయితే ఉచితం. మరికొన్ని కంప్యూటర్లకు కూడా కావాలంటే డబ్బు పే చేయాల్సిందే
Comments